Kids

విద్యా-శాంతి కావాలి

Telugu Kids Stories-Peace And Wisdom Are Forever

ఒక వ్యాపారస్థుడు తన సరుకుల బళ్ళతో వ్యాపార నిమిత్తం బయలుదేరాడు. ఒక అరణ్యం మధ్యలోకి వచ్చి విశ్రాంతి కోసం ఆగాడు. సేవకులు బళ్ళకున్న ఎద్దుల్ని విడిపించి వాటికి గడ్డి వేశారు. వంటవాళ్ళు వంట ప్రయత్నాల్లో పడ్డారు.

వ్యాపారస్థుడు విశ్రాంతికోసం ఒక చెట్టుకు ఆనుకొని చల్లగాలిని అనుభవిస్తూ కునుకుతీశాడు. అంతలో అడవిలో చెట్లు నరికే ఒక గుంపువచ్చి నిద్రపోతున్న వ్యాపారిని తట్టి లేపి మీరు కాస్త లేచి వేరే చెట్టు దగ్గరికి వెళతారా! మేము ఈ చెట్టును నరకబోతున్నాం’ అన్నారు.

నిద్ర చెడగొట్టిన వాళ్ళను చూసేసరికి వ్యాపారికి చిరాకు, ఆగ్రహం కలిగింది. ‘మీకు ఎంతధైర్యం! మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకున్నారా!’ అన్నాడు కోపంగా.

చెట్లు కొట్టే వాళ్ళు ఈయనెవరో గొప్పవాడనుకుని భయపడి ‘అయ్యా! మన్నించండి! తెలియక మీ నిద్ర చెడగొట్టాం.

మేము ముందుగా ఈ చెట్టును నరకాలని తీర్మానించుకోవడం వల్ల మిమ్మల్ని నిద్రలేపాల్సి వచ్చింది. ఫరవాలేదు. మీరు పడుకోండి. మేము వేరేచెట్టు వెతుక్కుంటాం’ అని అక్కడినుండి వెళ్ళిపోయారు.వ్యాపారస్థుడు యథావిధిగా చెట్టు మొదలుకు ఆనుకొని మగత నిద్రలో మునిగిపోయాడు. కాసేపటికి ఆ చెట్టు మీద నుంచి ఎవరో తనను ఉద్దేశించే మాట్లాడుతున్నట్లు వ్యాపారి నిద్రమత్తులోనే గుర్తించాడు.

‘అయ్యా! మీరు నాకు ఎంతో ఉపకారం చేశారు. నేను ఈ చెట్టు మీద ఉంటాను. అదీ ఈ ఒక్కరోజే నివాసం చేసుకున్నాను. రేపు ఈ చెట్టును వాళ్ళు కొట్టెయ్యవచ్చుకూడా! కానీ ఈ రోజుకు నిశ్చింతగా ఈ చెట్టు మీద నేను నివసించడానికి పరోక్షంగా మీరు సహకరించారు. ఇందుకు మీకు కృతజ్ఞతలు’ అన్న మాటలు వినిపించాయి.

ఆ మాటల్తో వ్యాపారి నిద్ర ఎగిరిపోయింది. అతను లేచి కూర్చొని ఇంతకూ ఎవరు నువ్వు? అని చెట్టుపైకి చూశాడు.

చెట్టుపై నుంచి ‘నేను ఒక శక్తిని. నేను నీకు కనిపించను. కానీ నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యడం నా ధర్మం. ఒక గంట తరువాత ఈ చెట్టు నుంచి ఒక చిన్ని పండు నీ తలపై పడుతుంది. దాన్ని నీ నుదుటి మీద పెట్టుకొని ‘నాకు విద్య కావాలి’ అని కోరుకున్నావనుకో నీకు గొప్ప వివేకం, శాంతి సమకూరుతాయి. నిర్మలంగా జీవితం సాగిపోతుంది. ఎట్లాంటి ఆటుపోటులైనా నువ్వు చలించవు. నీ ఆనందానికి అవధులుండవు. ఇక నువ్వు ‘అవిద్య’ కావాలి అని కోరుకున్నావనుకో నీకు మూడు వరాలు లభిస్తాయి. నువ్వు ఆ వరాల ద్వారా ఏమి కోరుకుంటే అది జరుగుతుంది’ అంది.

అంతలో వంటవాడు వచ్చి సిద్ధమైందన్నాడు. వ్యాపారి వెళ్ళి తృప్తిగా భోంచేసి మళ్ళీ చెట్టు మొదల్లో విశ్రాంతి తీసుకున్నాడు. కాసేపటికి ఒక చిన్ని పండు అతని తలపై మృదువుగా వాలింది దాన్ని దాచుకున్నాడు.మళ్ళీ బళ్ళు సిద్ధం చేసి బయలుదేరాడు. పని ముగించుకొని ఇల్లు చేరాడు. భార్యతో తన అనుభవం చెప్పాడు. ‘అయితే మీరు ఏం కావాలనుకుంటున్నారు?’ అంది.

‘నేను విద్య’ కావాలనుకుంటున్నాను. శాంతి కోరుకుంటున్నాను’ అన్నాడు.

భార్య ‘మనకు లోటుఏముంది? శాంతిగానే సుఖంగానే ఉన్నాం కదా! వంద ఊళ్ళల్లో మీ పేరు మారుమోగిపోతోంది. ఒకసారి మనయిద్దరి ముక్కు చూడండి. మనకున్న లోపమల్లా ఒకటే. మనవి చప్పిడి ముక్కులు. మనకు మంచి ముక్కులు కావాలని కోరుకోండి’ అంది. దాని తరువాత యింకా రెండు కోరికలు కోరవచ్చు కదా! అప్పుడు మీరు కోరుకున్న శాంతి కోరుదాం’ అంది.

వ్యాపారి ఇదేదో బాగుందని అవిద్యను ఆవహించి ‘మాకు మంచి ముక్కులు కావాలి’ అని కోరాడు.

వెంటనే అతనికి, భార్యకు మొఖం మీద శరీరం మీద లెక్కలేనన్ని ముక్కులు ప్రత్యక్షమయ్యాయి. అవి చూసి భయం కలిగింది. దాంతో వ్యాపారి ‘మాకు ముక్కులు వద్దు’ అన్నాడు.

అసలుకే మోసమన్నట్లు ముక్కులతో పాటు ఉన్న ముక్కులు కూడా ఊడిపోయాయి.చూడ్డానికే అసహ్యంగా ఉన్న ముఖాలు ఒకర్నొకరు చూసుకొని దిగులుపడ్డారు. దీంతో వ్యాపారి ఈసారి జాగ్రత్తగా ‘మా ఇద్దరికీ వెనుకటి ముక్కులే రావాలి’ అని కోరాడు. వాళ్ళ చప్పిడి ముక్కులు యథాతథంగా వచ్చాయి. ఆ విధంగా ‘అవిద్య’ వల్ల వాళ్ళ ఆశలు ఆశలుగానే మిగిలిపోయాయి.