Editorials

ప్రణయ్ ప్రేమకథ. మారుతీ ఆత్మహత్య.

The never soothing story of amruta pranay and marutirao

ప్రణయ్,అమృతలది ప్రేమకధ మాత్రమే కాదు…! సమాజానికి స్వాంతన లేకుండా చేసిన ప్రశ్న..భవిషత్ తరాలకు మానవత్వం చేసిన హెచ్చరిక..!

ఈ కథని వినటానికి ,ఆలోచించటానికి, తీర్పుచెప్పటానికిి రెండు మెదళ్ళు,రెండు హృదయాలు, రెండు కన్నీటి చుక్కలు కావాలి..! ఏ వైపు నిలబడాలో,ఎవరిని సమర్ధించాలో నిర్ణయించలేని స్థితి. ఆడపిల్ల,అదీ ఒక్కతే బిడ్డ..అంటే తండ్రికి ఎంత మురిపం.! గులాబీని ముద్దాడినట్టు ముద్దాడుతూ గుండెలమీద ఆడిస్తూ పెంచిన తండ్రి, తన బిడ్డ జీవితం వెన్నెల వెలుగులో వెండి ఉయ్యాలఊగినంత అందంగా,హాయిగా సాగిపోవాలని కోరుకుంటాడు. స్కూల్ కి వెళ్లినా,కాలేజీకి వెళ్లినా క్షేమంగా రావాలని కోరుకుంటాడు. దారిలో ఎవడయినా తనబిడ్డని కోరికతో చూసినా,తాకినా ఎలా రక్షించుకోవాలా అని మధనపడతాడు. ఒక్కోసారి ఆ చేతులూ,కళ్ళుతీసేయ్యాలన్నంత ఉద్రేకం వచ్చినా అణుచుకుంటాడు.తన కూతురికి కాబోయే భర్త ఎలావుండాలో ఆలోచించుకుంటూ,తన కలల్లో,ఊహల్లో వాడి శిల్పాన్నిఅందంగా చెక్కుకుంటూ బతుకుతాడు.!!
ఆ శిల్పాన్ని శిథిలం చేస్తే హృదయం బద్దలయి నిస్సహాయంగా ఏడుస్తాడు లేదా మతి తప్పి ఉన్మాదిగా మారిపోతాడు..! తప్పు ఎవరిదీ కాదు..! వాడి ప్రేమది, పెంచుకున్న బంధానిది..!నేరం వాడి హృదయానిదే..!

ఆ బిడ్డకి తండ్రి ప్రేమ తెలియనిదా..! అది ఎప్పటికీ, ఎక్కడికీ తనని వదిలిపోయేది కాదు. అదీ పిల్లల ధైర్యం..కానీ పెరిగే వయసు ప్రపంచాన్ని కొత్తగా చూస్తుంటే..ఎదిగే మనసు ఇంకేదో కొత్తగా కావాలని ప్రేమించటానికి, ప్రేమించ బడటానికి పరుగులు తీస్తుంది.ఆ ప్రేమలో ఆకర్షణ ఉంటుంది కానీ ఆలోచనఉండదు.స్వేచ్ఛ వుంటుందికానీ బాధ్యత ఉండదు.తమ ప్రేమేకానీ తమని ప్రేమించేవాళ్ళని గురించి ఎరుకవుండదు.. అక్కడినుండే అసలు పోరాటాలు మొదలవుతాయి. అంతస్తులలెక్కలు,కులాలకొలతలు..విచ్చు కత్తుల్లా పదునెక్కుతాయి ! అన్నిటినీ మించి ఇక్కడ నా మాటే నెగ్గాలనే పట్టుదలలు,అహం,అపార్ధాలు ప్రధానంగా నిలిచాయి..! మారుతీ రావు అభిప్రాయాన్ని కాదని ప్రణయ్ ని పెళ్లి చేసేసుకుంది అమృత.తన ప్రేమ లో పసితనం ఎంతవుందో, పరిణితి ఎంతవుందో తనకే తెలియాలి. ప్రేమకోసం ప్రేమగా పెంచిన తండ్రినే కాదనుకుని వెళ్ళిపోయింది.పెళ్లి కాగానే ప్రణయ్ తోఎక్కడికో దూరంగా వెళ్లి బతికితే బావుండేది.కానీ అదే ఊరిలో,ఆయన తిరిగే సమూహాల మధ్య,ఆయన ముందే భర్తతో కలిసి తిరుగుతోంది. తండ్రి తనని ఎంత ప్రేమిస్తాడో తనకి తెలుసు. ఆయన ఎదురుగా తిరుగుతుంటే అదే ప్రేమతోనే మెల్లగా చల్లబడి తనని భర్తతో సహా ఆదరిస్తాడని ఆశపెట్టుకొని ఉండవచ్చు..! అక్కడే తేడా వచ్చింది.మారుతీరావు అహం దెబ్బతిన్నది. కూతురిమీద ఉన్న ప్రేమ వల్ల ఆమెని తప్పు పట్టటం మానేసి ఇదంతా ప్రణయే చేయిస్తున్నాడన్న అపోహలు,కసి పెంచుకున్నాడు. ప్రేమ ప్రేమించిన వాళ్ల తప్పులు వెతకదు..కూతురు చేసిన తప్పులని కూడా ప్రేమిస్తుంది..ఎంత పొరపాటు చేసినా ఎవరిబిడ్డ వాళ్ళకి అమాయకురాలే..! లోకం తెలియని తనబిడ్డని ప్రణయ్ మరీ అమాయకురాలిని చేసి ఆడిస్తున్నాడని ఆయన భ్రమ కావొచ్చు.ఇక్కడ ప్రణయ్ కూడా అమృత మీద ప్రేమతో ఆమె అభిప్రాయం ప్రకారమే నడిచి ఉండొచ్చు. కానీ కూతురు నిర్ణయాలు కూడా ప్రణయ్ వే అని మారుతీరావు మరీ శత్రుత్వం పెంచుకున్నాడు. కడుపుతో ఉంది, తల్లి కాబోతోంది అని తనమీద తండ్రిమరింత జాలి ,ప్రేమ చూపిస్తాడని అమృత ఆశించి ఉండొచ్చు..! కానీ ఎవరనుకున్నట్టు..అదిజరగలేదు. మారుతీరావుకి తగిన సలహాలిచ్చి, శాంతపరిచి, కాలానికి పరిష్కారం అప్పగిద్దాం అని నచ్చచెప్పే ఆత్మీయులు ఆయనచుట్టూ లేనట్టున్నారు.ఉన్నవాళ్లు కూడా, అయోమయంలో,ఆవేశంలో ఉన్న అతనిలోని ఆగ్రహాన్ని సమర్ధించారో, మౌనం వహించారో కానీ ఆయనలో రగిలిన హింసాతత్వాన్ని ఆయన మేలుకోరి ఎవరూ ఆపలేదు..! ఫలితంగా జరిగిన ప్రణయ్ దారుణహత్యజరిగింది..! అదే ఇంకా ఎన్నో సమస్యలకు,ప్రమాదాలకు తెరతీసింది.చివరకు తండ్రిలేని బిడ్డకుతల్లిగా అమృత.., కూతురికి,కుటుంబానికి దూరమై జైలుకు వెళ్లిన తండ్రిగా మారుతీరావు మిగిలిపోయారు.ప్రతి ఆడపిల్ల,ఆడపిల్ల తండ్రే కాదు,హృదయం ఉన్న ప్రతి మనిషి ఆ తండ్రి, కూతుళ్ళ..విధిరాత చూసి విమర్శించటం, జాలిపడటం కాదు.

వాళ్ల జీవితాలని సానుభూతితో గమనించి ఎంతో నేర్చుకోవాల్సిందిఉంది,ఆలోచనల్ని మార్చుకోవాల్సివుంది.మారుతీరావు తనుఅందించిన ప్రేమకు,తను తీర్చుకున్న ప్రతీకారానికి తానే తీర్పు చెప్పుకుని మరణ శిక్ష వేసుకున్నాడు..! కారులో హైదరాబాద్ వస్తూ కూడా ఆల్ బొమ్ లోతనకూతురు ఫోటోలు చూస్తూ వచ్చాడని వార్తలు..కూతురు సుఖంగా బతకాలని కలలు కంటూ,కష్టపడి సంపాదించాడే కానీ,ఏంచేస్తే కూతురు ఆనందంగా వుంటుందో సమయానుకూలంగా ఆలోచించలేకపోయాడు. తన సమస్య పరిష్కారం కాలానికి వదిలేసి దూరంగా వెళ్ళిపోతే బావుండేది. ఆవేశంలోతీసుకున్న నిర్ణయాలతో తన బిడ్డ జీవితాన్ని,ఆమె కన్న బిడ్డ భవిష్యత్ ని ప్రశ్నలమయం చేశాడు. ఒంటరివాడయ్యాడు.ఓడిపోయాడు.భార్యని కూడా ఒంటరిదాన్ని చేసి విచారణ లేని శాశ్వత నేరస్థుడిలా తలవాల్చేసి వెళ్ళిపోయాడు. ఇక అమృతకి భిన్నమైన వ్యక్తులు,వ్యక్తిత్వాలతో, నిస్వార్థంగా తోడునిలబడేవాళ్ళు,స్వలాభాలకోసం సలహాలు ఇచ్చేవాళ్ళు,విచిత్ర,వికారపరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి. తండ్రిలేని బిడ్డని,తోడులేని జీవితాన్నిమోసుకుంటూ ముందుకు ఎలానడిపిస్తుందో..!? ఏది ఏమైనా.. ఎవరి ప్రేమను వారు ప్రతీకారంతో గెలిపించుకోవటానికి పోరాడిన ఆ తండ్రీ ,కూతుళ్ళది అదోరకం “రక్తసంబంధం”..! కన్నబిడ్డమీద ఎడతెగని ప్రేమ నింపుకున్న గుండెని, పగతో నిప్పులకుంపటి లాగా మార్చుకుని,తన బిడ్డ జీవితం చీకటిలో పడేసి.. తను ఏంచేశాడో తనకే తెలియని స్థితిలోప్రపంచాన్ని సెలవుకోరిన మారుతీరావు.. ఎలాంటి వాడయినా ఓ ఆడపిల్ల తండ్రి..! అదే అతనిమీద జాలి..!! అందుకే ఓ మహానుభావుడు ఎప్పుడో చెప్పిన మాట గుర్తొస్తుంది. ఎటాచ్ మెంట్,డిటాచ్ మెంట్ ఒకేనిముషంలో నడిపించాలి..!