* కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెడుతుందనే ఊహాగానాలతో అపర కుబేరుడు ముకేశ్ అంబానీ అస్తులకు 5.8 బిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లింది. దీంతో ఆసియాలోనే అత్యంత ధనవంతుల చిట్టాలో మొదటి స్థానం అయన చేజారిపోయింది. కాగా ఆ స్థానంలోకి అలీబాబా సంస్థ అధినేత జాక్ మా వచ్చి చేరారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం తగ్గింది. అంతే కాకుండా చమురు ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ఉత్పత్తి ధరల యుద్ధం దీనికి మరో కారణమైంది. దీంతో చమురు ధరలు 29 సంవత్సరాల కనిష్ఠానికి క్షీణించాయి. చమురు ధరల ప్రభావం అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌పై పడింది. ఈ భారతీయ దిగ్గజ సంస్థ షేర్ల విలువ సోమవారం 12 శాతం వరకూ పడిపోయాయి. అదే సమయంలో కరోనా ప్రభావం చైనా ఆధారిత సంస్థ అలీబాబాపై కూడా పడినప్పటికీ క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ యాప్‌ల ద్వారా వాణిజ్యం పుంజుకోవటంతో ఆ నష్టం భర్తీ అయింది. ఈ పరిణామాల అనంతరం ప్రస్తుతం జాక్ మా ఆస్తుల విలువ 44.5 బిలియన డాలర్లు కాగా.. ఇది ముకేశ్ కంటే 2.6 బిలియన్ డాలర్లు అధికం.
* కార్పొరేట్ రుణాల బకాయిలు, అంతర్గత అవకతవకల కారణంగా కష్టాల్లో కూరుకుపోయిన యెస్‌బ్యాంక్‌లో సమూల మార్పులు తీసుకురావాలని అడ్మిన్‌స్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగా కార్పొరేట్ రుణాలను విక్రయించే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. బ్యాంక్‌ను కార్పొరేట్ రుణ వ్యాపారం నుంచి రిటైల్ లోన్ వ్యాపారం వైపు మళ్లిస్తామని పేర్కొన్నారు. ఆర్‌బీఐ హామీ ఇచ్చాక బ్యాంక్ ఏటీఎంల వద్ద క్యూ తగ్గిందన్నారు. బ్యాంక్‌పై ప్రజలకు నమ్మకం తగ్గలేదని ప్రశాంత్‌కుమార్ చెప్పారు. ఎస్‌బీఐ 49శాతం పెట్టుబడి పెట్టనుండటం బ్యాంక్‌పై తొలుత నమ్మకాన్ని పెంచిందన్నారు. దీంతోపాటు బ్యాంక్ రిసొల్యూషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుండటం, దీనికి ఆర్‌బీఐ, ఎస్‌బీఐ మద్దతు ఉండటంతో ప్రజలు కొంత స్థిమితపడ్డారని వెల్లడించారు. వీటికి తోడు బ్యాంక్ మూలధన సేకరణ ప్రణాళికలు సిద్ధం కావడం ప్రజల్లో విశ్వాసం పెంచిందని వివరించారు. మార్చి14వ తేదీన బ్యాంక్ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. డిపాజిట్లను విత్‌డ్రాచేసుకొనే కస్టమర్ల అవసరాలు తీర్చడం తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు.
* 82శాతం మంది మహిళలు వారి పెట్టుబడులను స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారని ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ‘గ్రో’ సర్వేలో వెల్లడయింది. ఈ సర్వేలో 26వేల మంది మహిళలు పాల్గొనగా 43శాతం మంది సంప్రదాయ పెట్టుబడులైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఇక అత్యధికంగా.. 25శాతం మంది బంగారంపై పెట్టుబడి పెట్టినట్టు తెలిపారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో 13శాతం, పెన్షన్ పథకాల్లో 9శాతం మంది మహిళలు పెట్టుబడులు పెట్టినట్టు ఈ సర్వేలో వెల్లడైంది.