Politics

గుప్తదాతల విరాళాలు ₹2513కోట్లు

Indian Political Parties Received 2513 Crores

పారదర్శకత పాటించాల్సిన రాజకీయపార్టీలు తమకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లు బయటపెట్టడంలేదు. ఈ సమాచారం లేకుండానే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పిస్తున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.20వేల లోపు విరాళాలు ఇచ్చినవారి పేర్లుకానీ, ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలుకానీ వెల్లడించాల్సిన అవసరంలేదు. అయితే ఈ తరహా స్వల్ప మొత్తాల రూపంలో అత్యధికంగా విరాళాలు సమకూరుతుండడం గమనార్హం. నిబంధనను సాకుగా చూపించి దాతల వివరాలను పార్టీలు అజ్ఞాతంగా ఉంచుతున్నాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ జరిపిన విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
* 2018-19లో ఈ రూపంలో అన్ని పార్టీలకు కలిపి రూ.2,512.98 వచ్చాయి. అందులో భాజపాకు అందినవి రూ.1,612.04 కోట్లు. అంటే 64 శాతం ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి. కాంగ్రెస్‌కు లభించినవి రూ.728.88 కోట్లు.
* అజ్ఞాత విరాళాల్లో 78 శాతం ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో సమకూరింది. ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారి చిరునామాలు తెలియవు. వీటి విలువ రూ.1,960.68 కోట్లు. అంటే ఎక్కువ మంది పేర్లు వెల్లడించడానికి ఇష్టపడకుండా ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేస్తున్నారు.
* పేర్లు బయటికి తెలిసేలా రూ.20వేలకు మించిన విలువ చేసే ఎలక్టోరల్‌ బాండ్లను చాలా తక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ తరహాలో సమకూరింది. రూ.71.44 లక్షలే.
* తమకు రూ.20వేల విలువకు మించిన బాండ్లేవీ రాలేదని బీఎస్పీ తెలిపింది.
****పార్టీల వ్యయంపైనా పరిమితులు ఉండాలి: నిపుణుల బృందం
ప్రచారంలో అభ్యర్థుల వ్యయంపై పరిమితులు ఉన్నట్టే పార్టీల ఖర్చులపైనా అదుపు ఉండాలని నిపుణుల బృందం సూచించింది. ప్రచారంలో జరుగుతున్న వ్యయంపై అధ్యయనం చేయడానికి ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఈ మేరకు సిఫార్సు చేసింది. ప్రస్తుతానికి పార్టీల వ్యయంపై ఎలాంటి నియంత్రణలు లేవని, ఆ లోపాన్ని సరిదిద్దుతూ విధానాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది.

Indian Political Parties Received 2513 Crores