తెలంగాణకు భాజపా కొత్త అధ్యక్షుడిని నియమించింది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ స్థానంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. జాతీయ అధ్యక్షుడు నడ్డా బండి సంజయ్‌ను నియమించినట్లు ఆపార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటనలో పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన సంజయ్.. సమీప తెరాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌పై విజయం సాధించారు. ఓ దశలో లక్ష్మణ్‌నే మళ్లీ కొనసాగిస్తారని ప్రచారం జరిగినా చివరికి కొత్త వ్యక్తివైపే భాజపా అధినాయకత్వం మొగ్గు చూపింది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం సంజయ్‌తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పోటీ పడుతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఆశావహులు భాజపా పెద్దలతో సైతం తమ ప్రయత్నాలు కొనసాగించినట్లు సమాచారం. అయితే ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీలో పనిచేసిన అనుభవంతో పాటు అనేక ఇతర సమీకరణాలు కలిసి రావడంతో బండి సంజయ్‌కు అధ్యక్ష పదవి వరించింది. బండి సంజయ్ కిందిస్థాయిలో అనేక పదవుల్లో పనిచేశారు. కరీంనగర్ ఏబీవీపీ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. దిల్లీ ఎన్నికల ప్రచార ఇన్‌ఛార్జ్‌గా, భాజపా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, యువమోర్చా జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. భాజపా అగ్రనేత అడ్వాణీ చేపట్టిన సురాజ్ రథయాత్రలో వెహికల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత 48వ డివిజన్ నుంచి రెండు సార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో భాజపా తరఫున కరీంనగర్ శాసనసభ స్థానానికి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2019లో ఎంపీగా గెలుపొందారు.
*** సంజయ్ ప్రొఫైల్
పేరు: బండి సంజయ్ కుమార్
పుట్టినతేదీ: 11.07.1971
తల్లిదండ్రులు: బండి నర్సయ్య (లేట్), శకుంతల
భార్య: బండి అపర్ణ (ఎస్‌బీఐ ఉద్యోగి)
పిల్లలు: సాయి భగీరథ్, సాయి సుముఖ్