* ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో పాటు తనను హత్య చేసేందుకు ప్రణాళిక రచించారని.. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా మాచర్లలో పక్కా వ్యూహంతోనే తమపై దాడి జరిగిందని తెదేపా నేత బొండా ఉమ ఆరోపించారు. తమపై జరిగిన దాడి ప్రజాస్వామ్యవాదులను కలవరపరిచిందని చెప్పారు. గుంటూరు జిల్లా మాచర్లలో వైకాపా దాడి నుంచి తప్పించుకున్న అనంతరం వారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ తెదేపా అధినేత చంద్రబాబును కలిసి ఘటన జరిగిన తీరును వివరించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ.. ‘‘జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు ఆపడంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు న్యాయవాది సహా మూడు కార్లలో మాచర్ల వెళ్లాం. వైకాపా నేతలు కారంపూడి నుంచి మా వాహనాన్ని అనుసరించారు. వైకాపా కార్యకర్త తురక కిశోర్ సహా 30 మంది వచ్చి ఏకకాలంలో కర్రలు, రాళ్లతో మాపై దాడి చేశారు. ఆ సమయంలో కారు డ్రైవర్ చాకచక్యంగా అక్కడినుంచి తీసుకెళ్లి మమ్మల్ని కాపాడాడు. తప్పించుకుని ముందుకు వెళ్లిన తర్వాత కూడా వెంబడించి మరోసారి దాడి చేశారు. మాచర్ల దాటి వెళ్తుండగా మరికొంత మంది దాడి చేశారు. వెల్దుర్తి దాటగానే మరో 200 మంది రోడ్డు పక్కన ఉన్నారు’’ అని చెప్పారు.
* చైనాలో విజృంభించిన కరోనా ప్రపంచ దేశాలకూ శరవేగంగా విస్తరిస్తోంది. అగ్ర రాజ్యం అమెరికా పైనా పంజా విసిరింది. ఈ మహమ్మారి ప్రభావంతో అమెరికాలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 31కి చేరింది. మరో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. ఒక్క వాషింగ్టన్‌లోనే మృతుల సంఖ్య 24కి చేరడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు అమెరికా ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు అధ్యక్ష బరిలో ఉన్న జో బిడెన్, బెర్నీ శాండర్స్ తమ ఎన్నికల ర్యాలీలను సైతం వాయిదా వేసుకున్నారు. అమెరికాలోని 38 రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం ఉంది. మొత్తం 1015 కేసులకు పైగా నమోదు కాగా.. ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు వదిలినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అత్యధికంగా వాషింగ్టన్‌లో 279 కేసులు నమోదు అయ్యాయి. అలాగే, కాలిఫోర్నియాలో 178 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. అలాగే, ఫ్లోరిడాలో ఇద్దరు, న్యూజెర్సీ, సౌత్ డకోటాలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు.
* ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. 14 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న బాధితుడు గత నాలుగు రోజులుగా నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు అతనికి కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. రెండో విడత పరీక్షల కోసం బాధితుడి రక్తనమూనాలను పుణె పంపించారు. ప్రస్తుతం నెల్లూరు ఆసుపత్రిలోనే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరులోని చిన బజారులో నివసిస్తున్న బాధితుడి కుటుంబ సభ్యులకు కూడా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బాధితుడి నివాస ప్రాంతంలో ఉన్న వారిని అప్రమత్తం చేశారు.
* గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమపై జరిగిన దాడి ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. దాడిలో గాయపడిన నేతలతో పాటు దెబ్బతిన వాహనాలతో ఆయన ర్యాలీగా డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు సహా నేతలెవరూ లోపలికి ప్రవేశించకుండా పోలీసులు ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. దీంతో చంద్రబాబు సహా నేతలంతా బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబు పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు పాల్గొన్నాయి.
* రాష్ట్రం బిహార్‌ను తలపిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బిహార్‌లో కూడా ఇన్ని అక్రమాలు, అఘాయిత్యాలు జరిగాయని అనుకోవడం లేదన్నారు. చిత్తూరు జిల్లా పులిచర్లలో భాజపా నాయకులపై వైకాపా దాడిని ఆయన ఖండించారు. దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే స్వర్గం చూపిస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు ప్రశాంత జీవనం కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. దౌర్జన్యం, దాడులు, బెదిరింపులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని వైకాపానుద్దేశించి కన్నా విమర్శించారు. ఎన్నికల్లో గెలవకపోతే ఎమ్మెల్యేల అంతు చూస్తామని బెదిరించారని, దీంతో ఎమ్మెల్యేలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
* రాష్ట్రంలో వైకాపా కార్యకర్తల దౌర్జన్యాలు, అరాచకాలు శృతి మించిపోయానని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమా, హైకోర్టు న్యాయవాది కిశోర్ ప్రయాణిస్తున్న వాహనంపై వైకాపా కార్యకర్తల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎప్పుడైనా ఏ నియోజకవర్గంలోనైనా ఇలా జరిగిందా? ఇంత అరాచకాలేంటి? కట్టడి చేయాల్సిన బాధ్యత లేదా? కట్టడి చేయలేకపోతే వ్యవస్థ ఎందుకు? ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి లేదా? ఓటు వేసే హక్కు లేదా? కశ్మీర్, బిహార్‌లోనూ ఇలా జరగలేదు’’ అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
* పద్దెనిమిదేళ్ల పాటు సుదీర్ఘంగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడి కమలం గూటికి చేరారు. ఎన్నో ఉత్కంఠ పరిణామాల అనంతరం బుధవారం మధ్యాహ్నం భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ఒకప్పటి పార్టీలా లేదని, ఇంకా అక్కడే కొనసాగితే ప్రజాసేవ చేయలేననే ఉద్దేశంతోనే తాను పార్టీ మారానని సింధియా తెలిపారు.
* మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హత్య జరిగి ఏడాది కావస్తున్నా కేసు దర్యాప్తులో పురోగతి లేదని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం కీలకం కాబట్టి సీబీఐకి అప్పగించినట్లు స్పష్టం చేసింది.
* హైకోర్టు తీర్పు జగన్‌కు చెంపదెబ్బ: వర్ల
* తెలుగుదేశం నాయకులపై వైకాపా దాడులు కొనసాగుతున్నాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెదేపా నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న తదితరులు బుధవారం మాచర్ల ప్రాంతంలో పర్యటించారు. తెదేపా నేతలు పర్యటిస్తున్న విషయం తెలుసుకున్న వైకాపా కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై వెంబడించి కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించి కారును వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో బుద్దా వెంకన్న దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు.
* తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందింది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకాలానికి సంబంధించి వేతనాలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమ్మె కాలానికి రూ.235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సమ్మె కాలానికి వేతనం మంజూరు చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
* రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఖండించారు. సమస్యలు పరిష్కరించమంటే ఇష్టం వచ్చినట్లు చితకబాదుతారా అని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
* భారత్‌లో కరోనా(కొవిడ్-19) కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా కర్ణాటకలో ఓ కరోనా అనుమానిత రోగి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 76ఏళ్ల మహ్మద్ హుస్సేస్ సిద్ధిఖీ ఇటీవల యాత్రల నిమిత్తం సౌదీ అరేబియాలో పర్యటించి వచ్చాడు. అనంతరం ఆయన అనారోగ్యానికి గురవడంతో చికిత్స నిమిత్తం కలబుర్గి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు.
* సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో త్వరలో ఉరికంభం ఎక్కబోతున్న నలుగురు దోషులను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో దోషులైన ముకేశ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌లను ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతి కల్పించాలంటూ ఓ మీడియా సంస్థ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. మీడియా సంస్థ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని తిహాడ్ జైలు అధికారులను అడిగింది.
* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో మరో బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దూర ప్రయాణాలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడే వారి కోసం కొత్త డామినర్ 250 తీసుకొచ్చింది. దీని ధరను రూ.1.60లక్షలు (ఎక్స్‌షోరూమ్, దిల్లీ)గా నిర్ణయించింది. ఎరుపు, నలుపు రంగుల్లో ఇది లభిస్తుంది. ఇప్పటికే బజాజ్ డామినర్ 400ను ఆ కంపెనీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.