Food

మొలకలు మంచిగా తినండి

Eat loads of sprouts for long term health benefits

విటమిన్లు, ఎంజైమ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్‌, బయో ఫ్లేవనాయిడ్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మొలకల్లో సమృద్ధిగా ఉంటాయి. వీటితోపాటు విటమిన్‌-ఎ, సి, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, మెగ్నిషియం, ఫోలేట్‌ వంటి మూలకాలు కూడా మొలకల్లో సమృద్ధిగా ఉంటాయి. రోజూవారీ ఆహారంతోపాటు మొలకలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు..

*** తయారీ ఇలా…..
పెసలు, సెనగలు, బఠాణీలు, మెంతులు, అలసందలు (బొబ్బర్లు), కందులు, చిరుధాన్యాలు…ఇలా వేటితోనైనా మొలకలను తయారుచేసుకోవచ్చు. ముందుగా వీటిని ఒక పెద్ద గిన్నెలో తీసుకుని పది నుంచి పదిహేను గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత నీటిని ఒంపేసి రెండు మూడు సార్లు నీటిలో బాగా కడగాలి. ఆ తడి గింజలను కాసేపు ఆరబెట్టాలి. శుభ్రమైన, పలుచని వస్త్రంలో మూటలా కట్టాలి. కొన్ని గంటల తరువాత వీటి నుంచి మొలకలు వస్తాయి.

*** ఆరోగ్య ప్రయోజనాలు…
* శరీరానికి పీచు చాలా అవసరం. మొలకల ద్వారా దీన్ని భర్తీ చేయవచ్చు. వీటితో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం సమస్య ఎదురుకాదు.
* మొలకల్లో ఉండే విటమిన్‌-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరాన్ని అనేక ఇన్‌ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. గుండెజబ్బులను తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదల బాగుంటుంది.
* ఎక్కువ పోషకాలున్న వీటి నుంచి లభించే కెలొరీలు మాత్రం తక్కువ కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం.
* మొలకలు రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.
* వీటిలో ఉండే పొటాషియం శరీరంలోని నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
* ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి.
* మొలకలు శరీరాన్ని బలోపేతం చేస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి.
* వీటిలోని విటమిన్‌-ఎ వల్ల కంటి చూపు బాగుంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది.
* ఇవి ఆమ్లాల సాంద్రతను తగ్గిస్తాయి. దాంతో కడుపులో మంట లాంటి సమస్యలు తగ్గుతాయి.