WorldWonders

₹60లక్షలు గెలిచాడు. కానీ గుండెపోటు గెలిచింది.

Kerala Man Dies Before Cashing 60lakhs Lottery Wins

కేరళలో ఓ వ్యక్తికి లాటరీ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. కానీ దాని కన్నా ముందే దురదృష్టం చావు రూపంలో ఆ వ్యక్తిని తన కుటుంబానికి దూరం చేసింది. కేరళలోని అలప్పుళలో ఓ వ్యక్తిని రూ.60లక్షల విలువ చేసే లాటరీ వరించినా.. దాన్ని పొందడానికి ముందే గుండెపోటుతో మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. అలప్పుళ జిల్లా మావెలికర గ్రామానికి చెందిన సి.తంబి ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. తంబి ఇటీవల తన దుకాణంలో ‘స్త్రీ శక్తి’ లాటరీలు కూడా తెచ్చి విక్రయించాడు. తన వద్ద ఉన్న లాటరీలన్నీ విక్రయించగా.. చివరగా పది టిక్కెట్లు మాత్రం మిగిలిపోయాయి. లాటరీ బహుమతుల ఫలితాలు వెల్లడించగా.. అతడి వద్ద ఉన్న టిక్కెట్లలో ఒకదానికి రూ.60 లక్షల బహుమతి వరించడం విశేషం. దీంతో తంబి ఎంతో సంతోషంతో.. వెంటనే ఆ నగదు బహుమతి పొందేందుకు ఫెడరల్‌ బ్యాంక్‌కు వెళ్లి టిక్కెట్‌ను సమర్పించాడు. దాంతో వచ్చే డబ్బుతో తన దుకాణం విస్తరణతో పాటు పిల్లల భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకున్నాడు. కానీ ఇంతలోనే విధి అతడిని మరో రకంగా పలకరించింది. ఛాతి నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. ఆయన మరణం కుటుంబసభ్యులు, స్థానికుల్ని కలచివేసింది.