స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు నేడు తుదిగడువు కావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలుచోట్ల వైకాపా నేతలు దౌర్జన్యాలకు దిగడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంలో భాజపా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. అభ్యర్థి మణెమ్మ చేయి, భుజంపై కత్తితో దాడి చేశారు. ఆమె అల్లుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమా, న్యాయవాది కిశోర్‌పై దాడి చేసి బీభత్సం సృష్టించారు.
చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండల పరిధిలోని పాడిపేటలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను వైకాపా నేతలు చించివేశారు. పుదిపట్లలో తెదేపా అభ్యర్థి హరిప్రియను అడ్డుకున్నారు. దీంతో వారిద్దరూ నామినేషన్లు దాఖలు చేయకుండానే వెనుదిరిగారు. పాకాలలో నామినేషన్‌ను వైకాపా నేతలు అడ్డుకోవడంతో పోలీసుల సాయంతో తెదేపా అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడకలో తెదేపా అభ్యర్థి నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. వైకాపా నేతలు తనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. వైకాపా నేతలు హద్దుమీరి ప్రవర్తిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పడకండ్లలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నామినేషన్ వేయకుండా వైకాపా వర్గీయులు అడ్డుకుంటున్నారని తెదేపా అభ్యర్థి ఆరోపించారు. నామినేషన్‌ను అడ్డుకునేందుకే గుట్కాలు విక్రయిస్తున్నారనే కారణంతో అరెస్ట్ చేశారని ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైకాపా నేతలు అడ్డుకుంటున్నారని తెదేపా నేత చెంగల్రాయుడు కడప జిల్లా రైల్వే కోడూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. రాయచోటి మండలం చినమండెంలో తెదేపా అభ్యర్థిపై వైకాపా నేతలు దాడి చేశారని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నామినేషన్ పత్రాలు చించివేసినా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.