Sports

IPLపై శివసేన నిషేధాజ్ఞలు

Sivasena Boycots IPL Ticket Sales

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణపై నానాటికీ అనుమానాలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు టోర్నీని వాయిదా వేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కోరాయి. మద్రాస్‌ హైకోర్టులోనూ వాయిదా కోరుతూ ఓ పిటిషన్‌ దాఖలైంది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించిందని తాజా సమాచారం! షెడ్యూలు ప్రకారం ఈ నెల 29న ఐపీఎల్‌ 2020 ఆరంభమవుతుంది. ముంబయిలోని వాంఖడే వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, రన్నరప్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆరంభ పోరులో తలపడాల్సి ఉంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ముందు జాగ్రత్తగా భారీ జన సమూహాలు ఏర్పడకుండా చూడాలని శివసేన నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎల్‌ టికెట్ల విక్రయాన్ని నిషేధించిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ముంబయిలోని వాంఖడేలోనే రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ జరుగుతోంది. భారత్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులను భారీ సంఖ్యలోనే అభిమానులు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. దీనిని మాత్రం కూటమి ప్రభుత్వం వ్యతిరేకించలేదు! ఇదిలా ఉండగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాత్రం ఐపీఎల్‌ జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. ‘ఐపీఎల్‌ జరుగుతుంది. అన్ని దేశాల్లో క్రికెట్‌ టోర్నీలు కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్‌ ఇప్పటికే శ్రీలంక చేరుకుంది. దక్షిణాఫ్రికా భారత్‌కు వచ్చింది. ఇబ్బందులేమీ లేవు. కౌంటీ జట్లైతే ప్రపంచమంతా పర్యటిస్తున్నాయి. అబుదాబి, యూఏఈకీ వెళ్తున్నాయి. అక్కడ ఎలాంటి సమస్యలు లేవు. మేం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. అవి ఎలాంటి జాగ్రత్తలు నాకైతే తెలియదు. వైద్య సిబ్బంది వాటి గురించి వివరిస్తారు. వైద్యపరమైన ఇబ్బందులన్నీ ఆ బృందమే పరిష్కరిస్తుంది. ప్రతి టోర్నీ జరుగుతుంది’ అని గంగూలీ ధీమా వ్యక్తం చేశారు.