ప్రపంచ వ్యాప్తంగా కరోనా(కోవిడ్-19) వైరస్ విజృంభిస్తున్నా టోక్యో ఒలింపిక్స్-2020 యథావిథిగా నిర్వహిస్తామని టోక్యో గవర్నర్ యురికో కొయ్కె స్పష్టం చేశారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో.. జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు అక్కడ జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టోక్యో గవర్నర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒలింపిక్స్ క్రీడల్లో ఏలాంటి మార్పులు చేయాలనుకోవట్లేదని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో అనేక టోర్నీలు రద్దవుతుండగా, మరికొన్ని వాయిదా పడుతున్నాయి. ఇంకొన్ని వాటికి ప్రేక్షకులను అనుమతించట్లేదు. దీంతో ఒలింపిక్స్ క్రీడలపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా, ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు తమ ప్రాక్టీస్‌ను కొనసాగించాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఇటీవల స్పష్టం చేసింది. వైరస్ నివారణకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది. ఒలింపిక్స్ నిర్వహణకు తాము పూర్తిగా సహకరిస్తామని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంతోషంగా ఉన్నామని వెల్లడించింది.
టొక్యో ప్రభుత్వం ప్రకటన
Related tags :