Fashion

రోజుకు ఒక అరగంట మౌనం వహించండి

Telugu Fashion And Lifestyle News-Stay Silent For Half An Hour Everyday

చక్కటి శారీరక మానసిక ఆరోగ్యం మీ సొంతమవ్వటమే కాదు-మీ ఆశలు ,ఆశయాలు, కలలు, కోరికలు అన్ని నెరవేరుతాయి” అని చెబితే నమ్మగలరా? నమ్మలేం కదూ? కాని ఇది నిజం. అదెలా సాధ్యం? ప్రయత్నిస్తే తెలుస్తుంది ఎలా సాధ్యమో? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరుకు ఎంత సేపు మనం మాట్లాడతాం? ఎప్పుడైనా లెక్కేశారా? పోనీ ఎంత సేపు మౌనంగా ఉంటాం? ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటాం కదా? అప్పుడు ఎవరితో మాట్లాడతాం అంటారా? దానికి నిపుణుల సమాధానం ఏంటో చూద్దాం.మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ, లేదా ఏ టి.వి లోని కార్యక్రమాన్ని చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ ఇది కాదు మౌనమంటే. అచ్చంగా మౌనంగా ఉండటం – ఈ పనులు అన్నీ చేస్తున్నపుడు మన నోరు మాట్లాడక పోయినా, మనసు అలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయ. అదే కళ్ళుమూసుకుని మాటని, మనసుని మౌనంలోకి జార్చామనుకోండి…ఓ పదినిమిషాలు చాలు.. కళ్ళు తెరిచాకా చూస్తే… హాయిగా ఉంటుందిట.మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు, అరుపులు… అక్కడితో అయిపోతుందా? అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వదిలించుకోవటం ఎలా? సింపుల్. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవటమే దాన్ని ధ్యానమనండి, మెడిటేషన్, ప్రాణామాయం… ఎదైనా కావచ్చు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. ఎలా అంటారా?మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడు సూటిగా, స్పస్టంగా ఉంటాయి. బెరుకు, బెదురు అనవసరమైన కబుర్లు ఏవీ ఉండవు. అవి ఎదుట వ్యక్తుకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది.