తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తిరువూరులో నాయకత్వ లోపం ప్రస్తుత ఎన్నికల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనా, తిరువూరు తెలుగుదేశానికి పెద్ద దిక్కుగా ఉన్న నల్లగట్ల స్వామిదాస్ వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. గత అయిదు సంవత్సరాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన స్వామిదాస్ ఆ పదవిని అడ్డంపెట్టుకుని గట్టిగా సంపాదించారన్న అభిప్రాయం పార్టీ కేడర్‌లో బలంగా ఉంది. స్వామిదాస్ భార్య సుధారాణిని జిల్లాపరిషత్ ఛైర్మన్‌తో పాటు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పలు ఉన్నత పదవులు ఇచ్చి చంద్రబాబు గౌరవించారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వామిదాస్, సుధారాణిల పాత్ర చురుగ్గా ఉండటం లేదు. తిరువూరు నగర పంచాయతీకి జరుగుతున్న ఎన్నికలే ఇందుకు నిదర్శనం. నగర పంచాయతీలో నామినేషన్ల ఘట్టం ముగియడానికి మరొక 24 గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే వార్డు కౌన్సిలర్లను ఎంపిక చేసుకోలేని దుస్థితిలో తెదేపా నాయకత్వం ఉంది. తిరువూరు పట్టణ తెదేపా నాయకుల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. తిరువూరులో మహానాయకుడుగా చెప్పుకుంటున్న తాళ్లూరి రామారావు ఈ ఎన్నికల్లోనూ పార్టీ కేడర్‌ను కలుపుకుపోవడంలో విఫలం చెందినట్లు కనిపిస్తోంది. పట్టణంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్న గద్దె రమణ, గద్దె వెంకన్న సోదరులను ఈ ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఒక వర్గం ప్రయత్నిస్తోంది. స్వామిదాస్ పట్టణ నాయకులందరినీ ఏకం చేయడంలో శ్రద్ధ చూపటం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తిరువూరు నగర పంచాయతీలో విజయం సాధించి చైర్మన్ పదవి దక్కించుకున్న తెలుగుదేశం ఈ ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థులను కూడా నిలుపుకోలేని దీనస్థితికి దిగజారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు తిరువూరులో హడావుడి చేశారు. ఈ ఎన్నికల్లో జవహర్ చిరునామా కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు తిరువూరు అంటే అమితంగా ఇష్టపడే విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రస్తుతం తిరువూరు నాయకులను దగ్గరకు రానివ్వడంలేదు. ఈ ఎన్నికల పట్ల ఎంపీ కూడా ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు.
*** దూకుడు పెంచిన వైకాపా
తిరువూరులో తెలుగుదేశం పార్టీ నాయకుల అసమర్థత వైకాపాకు బలంగా మారింది. ఇప్పటి వరకు తిరువూరు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీతో వైకాపాకు గట్టి పోటీ ఉంటుందని భావించారు. కానీ వైకాపాకు ప్రస్తుత పరిణామాలు అనుకూలంగా మారాయి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తిరువూరు వ్యాపారులు కొందరు ప్రస్తుత ఎన్నికల్లో వైకాపాకు అండగా నిలిచారు. వైకాపా అభ్యర్థుల ఎంపిక కూడా పకడ్బందీగా జరుగుతోంది. తెలుగుదేశం నాయకత్వంలో మార్పు లేకపోతే వైకాపా తిరువూరు నగర పంచాయతీని అతి సులభంగా తన్నుకుపోయే పరిస్థితులు…ప్రస్తుత వాతావరణాన్ని బట్టి కనిపిస్తున్నాయి. తెదేపా పుంజుకుని సమర్థులైన అభ్యర్థులను నిలబెడితే పోటీ మాత్రం గట్టిగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల ఘట్టం పూర్తయితే గాని తెలుగుదేశం సత్తా ఏమిటో? వైకాపా బలం ఏమిటో? ఋజువు అవుతుంది. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.
తిరువూరులో తెలుగుదేశం అసమర్థతే వైకాపా బలం-TNI ప్రత్యేకం
Related tags :