Movies

అక్షయ్ నాకు చాలా నేర్పించారు

Katrina Kaif Thanks Akshay Kumar

నటిగా తన నైపుణ్యం మెరుగు కావడానికి అక్షయ్‌ కుమార్‌ తోడ్పడ్డారని బాలీవుడ్‌ కథానాయిక కత్రినా కైఫ్‌ పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో స్నేహితులయ్యారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో అక్షయ్‌, కత్రినా నటించిన తాజా సినిమా ‘సూర్యవంశీ’. ముంబయిలో ఉగ్రదాడి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను మార్చి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా వైరస్‌ నేపథ్యంలో సినిమా వాయిదా పడింది.ఈ సినిమా ప్రచారంలో భాగంగా కత్రినా కపిల్‌శర్మ షోలో పాల్గొన్నారు. అక్షయ్‌తో స్నేహం గురించి ముచ్చటించారు. ‘అక్షయ్‌కు ధన్యవాదాలు చెప్పాలి. నా కెరీర్‌ ప్రారంభంలో సహనటుడుగా ఎంతో ప్రోత్సహించారు. నేను షూట్‌లో ఉన్నప్పుడు నా ఎదురుగా నిలబడి ఉత్సాహం నింపేవారు. ఎలా నటిస్తే ఇంకా బాగుంటుందో చెప్పేవారు. ఆయన సలహాలు, ఫీడ్‌బ్యాక్‌ వల్ల నా నైపుణ్యాన్ని మరింత పెంచుకోగలిగా. నన్ను నమ్మే అతి కొంతమంది నటుల్లో ఆయన ఒకరు. ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పగలను’ అని కత్రినా పేర్కొన్నారు. ‘ఇన్నేళ్లవుతున్నా అక్షయ్‌లో ఎటువంటి మార్పులేదు. అతడొక అద్భుతమైన సహనటుడు. ఇప్పటికీ ఎంతో ఏకాగ్రత, అంకితభావంతో పనిచేస్తున్నారు’ అని ఆమె చెప్పారు.