DailyDose

చాలా మంది ఎమ్మెల్యేలకు బర్త్ సర్టిఫికెట్లు లేవట-రాజకీయం

Majority Of Telangana MLAs Have No Birth Certificates-Telugu Political News Roundup Today

*జాతీయ పౌర పట్టిక జాతీయ పౌర జాబితా లకు వ్యతిరేకంగా ప్రవేశ ఎత్తిన తీర్మానాన్ని డిల్లి అసెంబ్లీ నిన్న ఆమోదించింది. ఈ నేపద్యంలో డిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ మొతం 70 మంది ఎమ్మెల్యేలతో 61 మందికి బర్త్ సర్టిఫికెట్లు లేవని చెప్పారు. డెబ్బై మంది ఎమ్మెల్యేలలో 61 మందికి బర్త్ సర్టిఫికెట్లు లేవని చెప్పారు. దేశ రాజధానిలో ఎన్పీఅర్, ఎన్నార్సీలను అమలు చేయకూడదని అసెంబ్లీ తీర్మానించిందని తెలిపారు. యావత్ దేశానికి ఇది అతి పెద్ద సందేశమని అన్నారు. తనతో పాటు తన భార్యకు మా కేబినేట్ సభ్యులకు కూడా బర్త్ సర్టిఫికేటు లేవని కేజ్రీవాల్ చెప్పారు.
*ఆ మూడు పార్టీలు పోటీ చేసే చోట సీపీఎం పోటీ చేయదు
స్థానిక సంస్థల ఎన్నికల మేనిఫెస్టోను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సనివారం విడుదల చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ఎన్నికలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధుల నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ దౌర్జన్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఎక్కడ దౌర్జన్యాలు జరిగాయో అక్కడ ఎన్నికలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేసారు. ఎన్న్నికల్లో అక్రమాలు జరిగాయండానికి ఏకగ్రీవాలే నిదర్శమన్నారు.
*విశాఖ భాజపా పార్టీ ఆఫీసులో రగడ
విశాఖ నగరంలోని భాజపా ఆఫీసులో రగడ చోటు చేసుకుంది. టికెట్ కేటాయింపులో జరిగిన అన్యాయంపై సీనియర్ కార్యకర్త కిల్లి శ్రీరమూర్తి భాజపా నాయకులను ప్రశ్నించారు. భాజపా పార్టీ జెండా మోపిన తనకు పార్టీ టికెట్ ఇవ్వలేదని 24 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్నా కూడా తనకు సీటు కేటాయించలేదని మండిపడ్డారు.
*రేవంత్ అరెస్టు పై పార్లమెంటులో కాంగ్రెస్ నిరసన ‘
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టు పై లోక్ సభ జీరో అవర్ లో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేసారు. ఈ అంశంపై కాంగ్రెస్ సభ్యుడు మణికం టాగోర్ వాయిదా తీర్మానం ఇవ్వగా దానిని సభాపతి అనుమతించలేదు. కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో జీరో అవర్ లో మాట్లాడేందుకు అవకాశం కల్పించాను. మణికం మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డిని తప్పుడు కేసులో అరెస్టు చేసారని పేర్కొన్నారు.
* ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా?: పంచుమర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతిపక్షాలు నామినేషన్లు దాఖలు చేయకుండా అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో ఆమె మాట్లాడారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు వచ్చిన ఓ మహిళ వద్ద ఉన్న పత్రాలను వైకాపా కార్యకర్తలు బలవంతంగా లాక్కున్నారన్నారు. అవమాన భారంతో ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. వైకాపా పాలనలో మహిళలకు ఇచ్చే రక్షణ ఇదేనా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
*లోక్‌సభకు చేరిన రేవంత్ వ్యవహారం
మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్‌ అంశం పార్లమెంట్‌ను తాకింది. తెలంగాణ ప్రభుత్వం ఆయనపై కక్షసాధిస్తున్నదని, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని, బెయిల్ కూడా రాకుండా చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. వెంటనే కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. రేవంత్ అరెస్టు అంశంపై గురువారం లోక్ సభలో తమిళనాడు ఎంపీలు మణికమ్ ఠాగూర్, సుబ్బరామన్ తిరునవుక్కరసర్, పంజాబ్ ఎంపీ జబ్బీర్సింగ్ గిల్ నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ లోక్‌ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరీ వాయిదా తీర్మానం అందజేశారు. క్వశన్ అవర్ ముగిసిన అనంతరం మణికమ్ నోటీస్పై స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా స్వల్ప చర్చకు అవకాశం ఇచ్చారు.
*వైసీపీలోకి మరికొందరు ముఖ్యనేతలు: విజయసాయిరెడ్డి
వైసీపీ పార్టీలోకి మరికొందరు ముఖ్యనేతలు చేరుతారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో 98 స్థానాలకు 95 గెలిపిస్తే సుందరనగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. పురుషోత్తంపట్నం నుంచి విశాఖకు తాగునీటి ప్రాజెక్ట్‌ పనులు జరుగుతున్నాయని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
*పిరికివాడిగా నేను బతకదలచుకోలేదు: పవన్‌
దేవుడు తనకిచ్చిన జీవితానికి సంపూర్ణంగా న్యాయం చేస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏ పనినైనా సంపూర్ణంగా చేయాలనే తాను పనిచేస్తానన్నారు. ప్రతికూల పవనాలు వీచినప్పుడే తాను ముందుకొచ్చాననీ.. పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీని స్థాపించానని అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన నేతల సమావేశంలో పవన్‌ మాట్లాడారు. ‘‘నాలోని పిరికితనంపై చిన్నప్పటి నుంచే అనుక్షణం నాలో నేనే ఎంతో పోరాడా. జిమ్‌కు వెళ్తే కండలొస్తాయి. కానీ మనల్ని భయపెట్టే పరిస్థితులను ఎదుర్కోకపోతే ధైర్యమనే కండ పెరగదు. వాటిని అధిగమించి ముందుకెళ్లా. సమాజంలో నేను పిరికివాడిలా బతకదలచుకోలేదు. పిరికితనమంటే నాకు చాలా చిరాకు. ఇన్ని పుస్తకాలు చదివి.. అంబేడ్కరిజాన్ని, గాంధీయిజాన్ని అర్థంచేసుకొని.. సుభాష్‌ చంద్రబోస్‌ పోరాట స్ఫూర్తిని అర్థంచేసుకున్న మనం కూడా భయపడితే ఎలా? కత్తులు తీసుకొని తిరగాలని కాదు.. ధైర్యంగా మన భావాలను వ్యక్తికరించగలగాలి. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఘటనలన్నీ చూసే పార్టీ పెట్టాల్సి వచ్చింది. దాడులు చేస్తారేమోనని భయపడితే అలాగే ఉండిపోతాం’’ అన్నారు.
*ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేక్‌
ఉగాది రోజున ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బ్రేక్‌ వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నెల 25 ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, ఓటర్లను ప్రలోభపెట్టే వ్యక్తిగత లబ్ధి కార్యక్రమాలను నిలుపుదల చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఇప్పటికే పలు వ్యాజ్యాలు దాఖలవ్వగా.. హైకోర్టు మార్గదర్శకాలను సైతం పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వం చేపట్టాల్సిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని నిలుపుదల చేయాలని నిర్ణయించారు.
*ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే-రాజ్యసభ స్థానాలకు కేకే, సురేశ్రెడ్డి నామినేషన్లు
రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న రెండు రాజ్యసభ స్థానాలకు తెరాస అభ్యర్థులుగా కె.కేశవరావు, సురేశ్రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం మధ్యాహ్నం 12.41 గంటలకు వారు రెండు సెట్ల చొప్పున నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి నరసింహాచార్యులకి అందజేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని, పువ్వాడ అజయ్, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, చీఫ్ విప్ వినయ్భాస్కర్, విప్లు, తెరాస ఎమ్మెల్యేలతోపాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు సైతం అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.
*విదేశీ ఉపకార వేతనాలు భర్తీ కావడం లేదు
కొప్పుల ఈశ్వర్, ఎస్సీ, ‘విదేశాల్లో ఉన్నత విద్య కోసం ముందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. ఏడాదికి 500 మందికి ఉపకార వేతనాలు ఇవ్వాలనుకుంటున్నాం. కానీ గరిష్ఠంగా 350 మంది విద్యార్థులే ఉపయోగించుకుంటున్నారు. 2015-16 నుంచి ఇప్పటి వరకు 1,685 మంది విద్యార్థులు ఈ సౌలభ్యాన్ని పొందారు’ అని ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సందర్భంగా శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అయిదు దేశాల్లో చదువుకునేందుకు అనుమతించాం.. తరువాత మరికొన్ని దేశాలకు విస్తరించామని చెప్పారు. రూ.20 లక్షలకు మించి ఉపకార వేతనం పెంచే ఆలోచన లేదన్నారు.
*ఆర్టీసీ డిపోల అభివృద్ధికి ఎమ్మెల్యేలు నిధులివ్వాలి- పువ్వాడ అజయ్కుమార్, మంత్రి, రవాణాశాఖ
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కుదుటపడుతోంది. నియోజకవర్గాల పరిధిలోని డిపోలు, బస్టాండ్ల అభివృద్ధికి నియోజక అభివృద్ధి పథకం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిధులు కేటాయించాలి. త్వరలో వారికి లేఖలు రాస్తాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో రవాణా మంత్రిగా పనిచేసిన సమయంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది. ఛార్జీలను పెంచడం ద్వారా రూ.11 కోట్లు ఉండే రోజు వారీ ఆదాయం ప్రస్తుతం రూ.12.5 కోట్లకు చేరింది. రెండు నెలలుగా ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాం.
*యువజన కాంగ్రెస్ సారథి ఎంపికపై దృష్టి
17న ఏఐసీసీ పరిశీలకుల రాక
తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్కు కొత్త సారథిని నియమించేందుకు ఏఐసీసీ దృష్టి సారించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ స్వయంగా ఇంటర్వ్యూ చేసి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ పదవి కోసం నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ జరపడానికి ఏఐసీసీ పరిశీలకులు ఈ నెల 17న రాష్ట్రానికి వస్తున్నారు. వారు అభిప్రాయాలు సేకరించి ఏఐసీసీకి నివేదిస్తారు. దీని ఆధారంగా నాయకులను రాహుల్గాంధీ ఇంటర్వ్యూ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. యువతను ప్రభావితం చేయకపోవడం వల్లే పార్టీ ఓటమి పాలవుతోందని కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించి యువజన విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే యువజన కాంగ్రెస్ అధ్యక్షుల నియామక అంశాన్ని రాహుల్గాంధీ చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్కుమార్ యాదవ్ను ఆ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. విద్యార్థి విభాగం అధ్యక్షుడికి 26 ఏళ్లు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడికి 35 ఏళ్లు నిండకూడదనే నిబంధన అమల్లో ఉంది.
*ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు: బుగ్గన
రాష్ట్రానికి అవసరమైన ఆర్థికసాయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. దిల్లీలో నిర్మలాసీతారామన్తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థలకు సుమారు రూ.5వేల కోట్ల నిధులు రావాల్సి ఉందని.. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. కేంద్రం నుంచి గ్రాంటు రాకపోవడంతో రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే విధంగా వైకాపా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.3వేల కోట్లు రీయింబర్స్ కావాల్సి ఉందని.. ఆ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ను కోరినట్లు బుగ్గన వివరించారు. మరోవైపు జిల్లాల్లో వాటర్గ్రిడ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కోరామని తెలిపారు.
*రాష్ట్రానికి కోతలే తప్ప వచ్చిందేమీ లేదు:హరీశ్ రావు
రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఆశాజనకంగా ఉంటే ప్రతిపక్షాలకు మాత్రం నిరాశాజనకంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శాసన మండలిలో బడ్జెట్పై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. విద్యార్థులు ఇతర కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతుండటంతోనే ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు తగ్గాయని వివరించారు. సభ్యులు రాష్ట్ర అప్పులను జీఎస్డీపీని దృష్టిలో పెట్టుకొని చూడాలన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోని 21.3 శాతం లోబడే అప్పులు తీసుకున్నట్లు సభకు తెలిపారు. 24 రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి అప్పులు తీసుకున్నాయని అయితే తెలంగాణ మాత్రం పరిధిలోనే ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం పెంపుకోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అనేక శాఖల నుంచి విద్యారంగానికి బడ్జెట్లో 12.4 శాతం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు.
*పోలీసుల ముందే వైకాపా అరాచకాలు:చంద్రబాబు
రాష్ట్రంలో వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. ఆ పార్టీ నేతలు కండకావరంతో ప్రవర్తిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థుల ఇళ్లలో మద్యం సీసాలు పెడుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెనాలిలో తెదేపా నేత ఇంటి గోడ దూకివెళ్లి మద్యం పెట్టారన్నారు. తర్వాతి రోజు పోలీసులు ఆ నేత ఇంటికి వెళ్లి వాటర్ ట్యాంక్ ఎక్కడని ప్రశ్నించారని.. అలా ఎందుకు అడిగారన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాను పోలీస్స్టేషన్లో ఎందుకు పెట్టారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే తరహాలో తిరుపతిలో తెదేపా నేత కామేశ్ యాదవ్ ఇంట్లో మద్యం ఉందని ఆందోళన చేశారన్నారు. తెలంగాణ నుంచి ఇష్టారాజ్యంగా మద్యం తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు నకిలీ మద్యం కూడా తీసుకొస్తారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
*తిరుపతిలో గేట్లు మూసి వైకాపా రౌడీయిజం!
తిరుపతి నగరపాలక సంస్థ సాక్షిగా వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగారు. గడువుకు 45 నిమిషాల ముందే కార్యాలయం గేట్లను మూసివేసి రౌడీయిజం ప్రదర్శించారు. నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో 9, 10, 11, 12 వార్డు సచివాలయ కార్యాలయాలు ఉండగా..అక్కడికి వైకాపా మినహా ఇతర అభ్యర్థులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. తెదేపా అభ్యర్థులను నిలువరించడంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నగరపాలక సంస్థ కార్యాలయంలో వెళ్లేందుకు ప్రయత్నించగా..ఆమెను వైకాపా నేతలు అడ్డుకున్నారు. భాజపా నేత నామినేషన్ వేసేందుకు యత్నించగా.. వైకాపా నేతలు అతడిని తరిమికొట్టారు. ఈ ఘటనంతా పోలీసుల కళ్లముందే జరుగుతున్నా ఏ ఒక్కరూ స్పందించలేదు. నామినేషన్ల ప్రక్రియలో వైకాపా పాల్పడుతున్న దౌర్జన్యానికి ఇది నిదర్శనమంటూ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
*రేణిగుంటలో కొనసాగుతున్న ఉద్రిక్తత
రేణిగుంట పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఏర్పేడు జనసేన జడ్పీటీసీ అభ్యర్థి నితీష్పై రేణిగుంటకు చెందిన వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో నితీష్ను ఏర్పేడుకు తరలించేందుకు రేణిగుంట పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో నితీష్ వాహనం నుంచి దూకాడు. ఏర్పేడుకు వెళ్తే వైకాపా నేతల నుంచి తనకు ప్రాణహాని పొంచి ఉందని నితీష్ వాపోయాడు. పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో పోలీసులు జనసేన రాష్ట్ర సమన్వయ కర్త పసుపులేటి హరిప్రసాద్, పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు బొలిశెట్టి సత్యను అరెస్టు చేశారు. జడ్పీటీసీ నామినేషన్ వెనక్కి తీసుకోనందుకే కక్ష సాధిస్తున్నారని ఈ సందర్భంగా హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైకాపా నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని జనసేన నాయకులు ఆరోపించారు. మరోవైపు తిరుపతిలోని కొర్లగుంట ఎనిమిదో వార్డు స్వతంత్ర అభ్యర్థినికి వైకాపా నేతల నుంచి బెదిరింపులు వచ్చాయి. తనను నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని తిరుపతి తూర్పు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు.
*రాజ్యసభ తెదేపా అభ్యర్థిగా వర్ల నామినేషన్-ఆత్మప్రబోధానుసారం
రాజ్యసభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా వర్ల రామయ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు ఉమామహేశ్వరరావు, ఆనంద్బాబు, కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడు అర్జునుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సహా పలువురు నాయకులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ మీడియాపాయింట్లో వర్ల మాట్లాడారు. ‘సీఎం జగన్ను పక్కనపెట్టి 174 మంది ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దల సభలో దళితవాణి, అంబేడ్కర్ భావజాలాన్ని వినిపించాలన్నదే నా ఆలోచన. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపాలో.. రాజ్యసభకు పంపేందుకు ఒక్క దళిత అభ్యర్థి లేరా’ అని ప్రశ్నించారు. ‘వైకాపాలోని 30-35 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఆలోచించండి.. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి’ అన్నారు.
*చంద్రబాబుకు ప్రతిపక్షనేత హోదా కూడా మిగలదు-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి దాన్ని కప్పిపుచ్చుకోడానికే చంద్రబాబు వైకాపాపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుంటే చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పురపాలికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు తెదేపా సభ్యులు నామమాత్రంగా పోటీ చేస్తున్నారు. చంద్రబాబుపై నమ్మకం లేక నామినేషన్లు వేసిన వాళ్లూ ఉపసంహరించుకుంటున్నారు. ముగ్గురు కాదు..పది మంది ఎమ్మెల్యేలు తెదేపాను వీడినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. చంద్రబాబు ప్రతిపక్ష హోదాను కూడా నిలుపుకోలేరు. నా నియోజకవర్గంలో తెదేపా ఎప్పుడూ గెలవలేదు. సదుం మండలం పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ లేదా వైకాపానే గెలుస్తోంది. అక్కడేదో జరిగిపోయిందని, ఎన్నికలు వాయిదా వేయాలని బాబు గగ్గోలు పెడుతున్నారు.చెదురుమదురు ఘటనలకే వాయిదా వేస్తారా?
*సవాంగ్కు అది చీకటిరోజు: వర్ల రామయ్య
ముఖ్యమంత్రి జగన్ వ్యవహారశైలి, అవగాహన లేని పాలన వల్లే డీజీపీ గౌతమ్ సవాంగ్ న్యాయస్థానానికి వెళ్లి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ జగన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ సవాంగ్ జీవితంలో ఇది చీకటిరోజని, తనకు ఈ పరిస్థితి వచ్చినందుకు ఆయన సీఎంను ప్రశ్నించాలని సూచించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘విధి నిర్వహణలో అధికారులు తప్పటడుగులు వేస్తున్నారని సాక్ష్యాధారాలతో మేం పలుమార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కోర్టు కూడా పోలీసుల వ్యవహారశైలిని తప్పుపట్టింది. సాక్షాత్తూ డీజీపీ కోర్టుకు సంజాయిషీ ఇవ్వడం, 5.45 గంటలు అక్కడే ఉండటం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఈ పరిస్థితుల్లో మరెవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే రాజీనామా చేసేవారు.