Editorials

తిరువూరు నగర పంచాయతీలో రసవత్తర పోరు-TNI ప్రత్యేకం

Tiruvuru ZPTC MPTC Muncipal Elections Update-Candidates In 20 Wards

స్థానిక ఎన్నికల్లో అధికార వైకాపా పార్టీని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతోంది. 2014 ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ స్థానంలో వైకాపా విజయం సాధించింది. అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తిరువూరు నగర పంచాయతీలో తెలుగుదేశం విజయం సాధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుండి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా రక్షణనిధి రెండోసారి ఎన్నికయ్యారు. ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో తిరువూరు మున్సిపాల్టీలో మళ్ళీ పాగా వేయాలని తెలుగుదేశం పావులు కదుపుతుంది. తిరువూరు నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఈ 20వార్డుల్లో వైకాపా తమ అభ్యర్ధులను నిలబెట్టింది. అధికార పార్టీకి దీటుగా తెలుగుదేశం కూడా తమ అభ్యర్ధులను రంగంలోకి దింపింది. తిరువూరు పట్టణ తెలుగుదేశంలో ఇప్పటి వరకు కీలక పాత్ర పోషిస్తున్న మాజీ ఏఎంసీ చైర్మన్ తాళ్లూరి రామారావు ఈ పర్యాయం కూడా పార్టీలో అన్ని వర్గాల వారిని కలుపుకుపోవడం లేదని పార్టీ కార్యకర్తల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. 14వ వార్డులో తెలుగుదేశం అభ్యర్ధిగా తాను పోటీ చేస్తున్నానని ముందుగా ప్రకటించిన తాళ్లూరి రామారావు చివరి నిముషంలో తోక ముడవడంతో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. 6వ వార్డులో తిరువూరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే మాజీ జడ్పీటీసీ సభ్యుడు గద్దె రమణ తెదేపా అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. తాళ్ళూరి రామారావు వర్గం మనస్ఫూర్తిగా సహకరిస్తే గద్దె రమణ 6వ వార్డులో పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కనీసం గద్దె రమణ లాంటి నాయకుడున్నా ఎన్నికల బరిలో ఉంటే తెదేపా పార్టీకి కొంత ఉత్సాహం వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. గద్దె రమణ రంగంలో ఉండే విధంగా తాళ్ళూరి రామారావు, స్వామిదాసు చర్యలు తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. నియోజకవర్గంలో దాదాపు మూడోవంతు ఓటర్లు తిరువూరు పట్టణంలో ఉన్నారు. తిరువూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జిగా ఇప్పటి వరకు చంద్రబాబు ఎవరినీ నియమించలేదు. తిరువూరు మున్సిపాల్టీలో తెదేపా గెలిస్తే స్వామిదాసే మళ్ళీ పార్టీ ఇన్‌ఛార్జి అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాని స్వామిదాసులో మాత్రం ఆ హుషారు కనిపించడం లేదని తెదేపా శ్రేణులు వాపోతున్నాయి. పార్టీ నేతలందరూ కట్టుదిట్టుగా వ్యవహరిస్తే తిరువూరు మున్సిపాల్టీలో మళ్ళీ తెలుగుదేశం పాగా వేస్తుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.