Health

సర్వకాల శుభకరం…పసుపు

Use turmeric extensively-Telugu health news

‘ముత్యాలముగ్గు’ సినిమాలోని ‘ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ’ పాట వింటుంటే పసుపుయొక్క ప్రాముఖ్యత ఎలాంటిదో ఇట్టే అర్థవౌతుంది. అంతకుముందే శతాబ్దాలనుంచి మన దేశంలో గృహిణులు పసుపు ప్రాధాన్యాన్ని అనుభవపూర్వకంగా నిరూపిస్తూ వస్తున్నారు.క్రీస్తుపూర్వం నాటిదైనా, చరకాది ఆయుర్వేద గ్రంథాలలో పసుపు ఔషధీ ప్రశస్తి గురించి వివరణలున్నాయి. ఈ అంశాలను ఆధునిక వైద్య పరిశోధనలు ప్రముఖంగా నిరూపిస్తున్నాయి. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో విస్తృతంగా ఈ అంశంలో పరిశోధనలు జరుగుతున్నాయి.భారతీయ జన జీవనంలో పసుపు వినియోగంలేని సందర్భం కనిపించదు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ రసాయనాలు వైరస్ నిరోధకాలుగా సిలీంద్ర నాశకాలుగా, యాంటీ బాక్టీరియా రసాయనాలుగా పేరొందటంవలన క్యాన్సర్, చక్కెర ఆర్థరైటిస్, అల్జీమర్స్ వంటి భయంకర దీర్ఘవ్యాధుల నివారణలో ఉపయోగిస్తారని నమ్ముతున్నారు. దీనిపై ఇంత గొప్ప ఔషధ ప్రశస్తిని ఆపాదించటం తగదని కొందరు పరిశోధకులు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రసిద్ధ ఔషధ సంస్థ, పరిశోధకుడైన డాక్టర్ భరత్ అగర్వాల్ ‘కురుమిన్- ది ఇండియన్ సాలిడ్ గోల్డ్’ అనే గ్రంథం రాశాడు.
దీనిలో ఆయన పసుపు ఉపయోగాలు, మోతాదు, ఎంతకాలం వాడాలో మొదలైన అంశాలపై సాధికారికమైన విషయాలను వివరించారు. ఆ గ్రంథం సారాంశం- ‘‘ఐదువేల సంవత్సరాలనుండి భారతదేశంలో పసుపు, ఆవాలు వంటివి చక్కటి ఔషధాలుగా పేరొందాయి. ఇవి రక్తశుద్ధికి, జీర్ణమండల రుగ్మతలకు, గాయాల చికిత్సకు బాగా ఉపయోగపడతాయి’ అని, ఆయన పసుపు నుంచి కణతుల నివారణకు ఉపయోగించే నిక్రోసిన్ రసాయనాన్ని గుర్తించారు. దానినే వైద్యభాషలో టిఎన్ఎఫ్ అంటారు. ఇది అల్ఫా, బీటా తరహా నిర్మాణాలు కలిగి వుంటుంది. టిఎన్ఎఫ్ రసాయనాలు క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయి. అవయవాల వాపును నిరోధిస్తాయి. అయితే కొందరు దీనిని ఇంకా పరిశోధనలు చేసి గుణదోషాలు నిర్థారించాలంటున్నారు. అయినా క్లోమగ్రంధి క్యాన్సర్లోనూ, మైలోమా క్యాన్సర్లోనూ, పెద్దప్రేగు క్యాన్సర్లోను, అల్జీమర్స్ చికిత్సలనూ పసుపు రసాయనాలు ఎంతగానో అక్కరకు వస్తున్నట్లు చాలామంది పరిశోధకులు గుర్తించారు.రకరకాల పాన్క్రియాటిస్ జబ్బులు, ఆర్తరైటిస్, మలాశయపు వాపు, రుగ్మతలకు, ఫాలిటిస్ గాసెటిస్, ఎలర్జీ, జ్వరము వంటి రుగ్మతలలో ఈ పసుపు రసాయనాలు నమ్మకంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. చక్కెర వ్యాధి, రోగనిరోధక వ్యవస్థ బలోపేతం, గుండె, రక్తనాళాల రోగాలు వంటి అంశాలలో వీటిని వాడవచ్చునని కొందరు శాస్తవ్రేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. మోతాదు గురించి అనేక అభిప్రాయాలు ప్రచారంలో వున్నాయి.
భారతీయ ప్రమాణాల ప్రకారం 40 మి.గ్రా. వరకూ ఈ పసుపు మందును వాడాలని కొందరంటున్నారు. కొందరు పాశ్చాత్య శాస్తవ్రేత్తలు రోజుకు 8 గ్రాములు వాడవచ్చునని అంటున్నారు. మరికొందరు 12 గ్రాముల మోతాదును సూచిస్తున్నారు. ఒకవేళ మోతాదులో తేడా వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్సు వస్తే అది పసుపు మందువల్ల కాదని, మందు తయారీలో వాడే ఇతర రసాయనాల వల్ల అని కొందరు పరిశోధకులు అంటున్నారు. వీజ్మాన్ పరిశోధక సంస్థలో జీన్స్స్థాయిలో ఈ మందులపై కీలక పరిశోధనలు జరుగుతున్నాయి.
మొత్తంమీద అనువంశిక రోగాల నివారణకు పసుపు ఆధారిత రసాయనాలతో చాలా సంక్లిష్టమైన పరిశోధనలు జరుగుతున్నాయి. మెదడులో అల్జీమర్స్ రోగులకు క్రమంగా ఆవరించే ఎమిలాయిడ్ నివారణకు పసుపు ఆధారిత రసాయనాలను ఎంతమేరకు వాడాలనే అంశాపై కీలక పరిశోధనలు జరుగుతున్నాయి.