ScienceAndTech

OTP లేకుండా లక్షలు కాజేస్తున్న సైబర్ నేరస్థులు

OTP లేకుండా లక్షలు కాజేస్తున్న సైబర్ నేరస్థులు

మీ కార్డును వెంటనే మార్చుకోండి.. ఏటీఎంలో నగదు రావాలంటే మార్పులు తప్పనిసరి అంటూ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు ఇతర బ్యాంకు ఖాతాదారులను మోసం చేస్తున్న సైబర్‌ నేరస్థులు పంథా మార్చేశారు. బ్యాంకు ఖాతాదార్లు ఓటీపీ(ఒన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) చెప్పకపోయినా నగదు బదిలీ చేసుకుంటున్నారు. అనంతరం వాటిని ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌, ఈ-బే, పేటీఎం వంటి ఈ-వ్యాలెట్లను వినియోగించుకుంటున్నారు. బిహార్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఉంటున్న సైబర్‌ నేరస్థులు కొద్దినెలలుగా ఈ తరహా మోసాలకు తెరతీశారు. కేవలం నెలరోజుల వ్యవధిలో రూ.60లక్షలు ఈ-వ్యాలెట్‌ల ద్వారా బదిలీ చేసుకున్నారు. ఒక్కో వ్యాలెట్‌లో రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ బదిలీ చేస్తుండడంతో వ్యాలెట్‌ నిర్వాహకులు నగదు బదిలీ క్షణాల్లో చేస్తున్నారు. ముందుగా సంక్షిప్త సందేశాలను పంపించిన సైబర్‌ నేరస్థులు బాధితులకు అనుమానం రాకుండా నాలుగైదు రోజుల తర్వాత నగదు బదిలీ చేసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు.

*** డెబిట్‌కార్డులకున్న అంతర్జాల లావాదేవీల సదుపాయాన్ని సైబర్‌ నేరస్థులు వేర్వేరు మార్గాల ద్వారా తెలుసుకుని ఆన్‌లైన్‌ లావాదేవీలను నిర్వహిస్తున్న వారి ఖాతాల్లోంచి నగదు బదిలీ చేసుకుంటున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న మహిళ బ్యాంక్‌ ఖాతాలోంచి రూ.2.50లక్షలను నగదు బదిలీ చేసుకున్నారు. గతేడాది డిసెంబరు 27 నుంచి 2020 మార్చి 5 వరకు ఈ నగదును తీసుకున్నారని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆన్‌లైన్‌ లావాదేవీలను పరిశీలించగా ప్రతిసారి రూ.2వేలు, రూ.3వేల చొప్పున ఈ-వాలెట్‌లోకి మార్చుకున్నారని గుర్తించారు. తాను ఎప్పుడూ ఓటీపీ చెప్పలేదని ఇదెలా జరిగిందో తనకు తెలియడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

*** జాతీయ, ప్రైవేటు బ్యాంకులు అంతర్జాలం, చరవాణుల ద్వారా డిజిటల్‌ లావాదేవీలను ఈ-వ్యాలెట్ల ద్వారా నిర్వహిస్తున్నాయి. వీటిని సైబర్‌ నేరస్థులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మొబైల్‌యాప్‌ల ఈ-వ్యాలెట్‌లలో నేరస్థులూ తమ బినామీ పేర్లతో ఖాతాలను తెరుస్తున్నారు. అందులో రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు నగదు ఉంచుతున్నారు. చరవాణి ద్వారా ఇతరుల ఖాతాల్లోకి నగదు జమ చేసుకుంటున్నారు. పేటీఎం, ‘ఎఫెక్స్‌మార్ట్‌’, ‘హెల్ప్‌చాట్‌’, ‘ఫోన్‌పే’, ‘ఫ్రీఛార్జ్‌’, ‘సీసీ అవెన్యూ’, ‘వీ-పే’, ‘మై పైసా’ ‘వన్‌ పే’, ‘గేమ్‌24×7’, ‘పేజాప్‌’, ‘లైన్‌యాక్సిస్‌’, ‘వైపేక్యాష్‌’ ‘ఎఫెక్స్‌’ ఈ-వ్యాలెట్‌ల ద్వారా సైబర్‌ నేరస్థులు బాధితుల ఖాతాల్లోంచి లాగేస్తున్నారు.

*** డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డు దారుల నుంచి ఓటీపీ చెప్పకపోయినా నగదు స్వాహా చేస్తున్న సైబర్‌నేరగాళ్లు వీటిని తమఖాతాల్లో జమచేసుకోకుండా ఈ-వ్యాలెట్‌లలోకి బదిలీ చేసిన ఒకట్రెండు రోజుల్లో ఆ మొత్తాన్ని ఖాతాలోకి జమ చేసుకుంటున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే గేట్‌వే ద్వారా చెల్లింపులు ఆగిపోతాయని గ్రహించిన సైబర్‌ నేరస్థులు ఒక్కొక్కరూ పదుల సంఖ్యలో ఈ-వ్యాలెట్‌లను ఎంచుకుని వాటిల్లో రూ.5వేలు, రూ.10వేల చొప్పున బదిలీ చేసుకుంటున్నారు. ఒక్కోసారి వంద రూపాయలు కూడా నగదు బదిలీ చేసుకుంటున్నారని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.