మా బాబు వయసు రెండున్నరేళ్లు. ఇప్పటికీ తనకు మాటలు రావడం లేదు. ఇదేమైనా మానసిక సమస్యా? ఎన్నాళ్లకు మాటలు వస్తాయి? అందుకు మేమేం చేయాలి?
చిన్నారులు దాదాపు తొమ్మిది నెలల వయసులో తాతా… అత్తా, అమ్మా… అంటూ చిన్నచిన్న పదాలను మాట్లాడటం మొదలుపెడతారు. అంతకు ముందు శబ్దాలు (మాటలు) వింటున్నా… మాట్లాడటం మాత్రం ఈ వయసులోనే మొదలుపెడతారు. పిల్లలు వారి భావోద్వేగాలు, అవసరాలను చిట్టి చిట్టి పదాలతో చెబుతారు లేదా చేతల ద్వారా చూపిస్తారు. తొమ్మిది నెలల నుంచి ఒకటిన్నర సంవత్సరాల మధ్య మాట్లాడటం అటూ ఇటూగా వస్తుంది. కొందరిలో మరికాస్త ఆలస్యమవుతుంది. మరికొందరిలో ఇది మరీ ఆలస్యమైతే మాట్లాడలేరు. మాటలు రాకపోవడానికి మూడు రకాల ఆరోగ్య సమస్యలు కారణం కావొచ్చు. అవేమిటంటే.. నడక, వస్తువులను పట్టుకోవడం, ఎదుటివారికి తమ అవసరాలను చేతల ద్వారా చెప్పడం… కొందరు చిన్నారుల్లో ఇవన్నీ ఆలస్యమవుతాయి. ఈ సమస్యను గ్లోబల్ డెవలప్‌మెంటల్ డిలే అంటారు. మరికొందరు చిన్నారులు బాగానే నడుస్తారు. తమకేం కావాలో చేతల ద్వారా చూపిస్తారు. కానీ మాటలు మాత్రం ఆలస్యంగా వస్తాయి. దీన్ని స్పెసిఫిక్ స్పీచ్ డిలే అంటారు. ఇక మూడోది… ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్. ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో నడక, వస్తువులను పట్టుకోవడం అన్నీ బాగానే ఉంటాయి. మాటలు కొంత వరకు మాత్రమే వస్తాయి. అవి కూడా ఆలస్యమవుతాయి. అర్థవంతంగానూ ఉండవు. అడిగిన వాటికి సరైన సమాధానం కాకుండా తమకు తోచింది పదే పదే చెబుతారు. మీరేం చేయాలంటే… మీ చిన్నారికి ఈ మూడు ఇబ్బందుల్లో ఏదైనా ఉందేమో తెలుసుకోవాలి. ముందుగా మీరు బాబును ఓసారి మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లండి. వైద్యులు బాబు డెవలప్‌మెంటల్ హిస్టరీ అంతా తీసుకుంటారు. మీ ఇంట్లో బాబు ఒక్కడికే ఈ సమస్య ఉందా? ఇంతకు ముందు చిన్నారికి ఈ సమస్య ఉందా? కుటుంబంలో ఎవరికైనా మానసిక సమస్యలు ఉన్నాయా కనుక్కుంటారు. డెవలప్‌మెంటల్ డిలే, స్పెసిఫిక్ స్పీచ్ డిలే, ఆటిజమ్ స్టెక్ట్రమ్ డిజార్డర్.. ఈ మూడు కాకుండా కేవలం మాట్లాడటం మాత్రమే ఆలస్యమవుతుందనుకుంటే… స్పీచ్ థెరపిస్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. వారు బాబును పరీక్షించి ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు. అవసరమైతే తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇస్తారు.