DailyDose

యెస్ బ్యాంకు షేర్ల అమ్మకాలపై RBI ఆంక్షలు-వాణిజ్యం

RBI Lock-In Period Stock Sales Of Yes Bank-Telugu Business News Roundup Today

* యెస్‌ బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విధించిన మారటోరియంను ఈ నెల 18న ఎత్తివేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ప్రస్తుతం అడ్మినిస్ట్రేషర్‌గా ఉన్న ప్రశాంత్‌ కుమార్‌కు సీఈఓ, ఎండీ బాధ్యతలను అప్పగించింది. ఆయన నేతృత్వంలో కొత్త బోర్డు ఈ నెలాఖరు కల్లా ఏర్పాటు అవుతుందని పేర్కొంది. ఈ మేరకు యెస్‌బ్యాంక్‌ పునరుద్ధరణ ప్రణాళిక- 2020పై ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. యెస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐ తన వాటాని మూడేళ్లలో 26 శాతం లోపునకు తగ్గించుకోకూడదు. మిగతా పెట్టుబడిదార్లు, ప్రస్తుత వాటాదార్లు తమ పెట్టుబడుల్లో 75 శాతాన్ని మూడేళ్లపాటు (లాక్‌-ఇన్‌ పిరియడ్‌) కొనసాగించాల్సిందే. 100 లోపు షేర్లు ఉండే వాళ్లకు లాక్‌-ఇన్‌ పిరియడ్‌ వర్తించదు. ఇక కొత్త బోర్డులో ప్రశాంత్‌ కుమార్‌తో పాటు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ హోదాలో సునీల్‌ మెహతా (పీఎన్‌బీ మాజీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌), నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరరెక్టర్ల హోదాలో మహేశ్‌ కృష్ణమూర్తి, అతుల్‌ బెహడా సభ్యులుగా ఉండనున్నారు. యెస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణ ప్రణాళిక మార్చి 13వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని నోటిఫికేషన్‌ పేర్కొంది. నిధుల ఉపసంహరణను రూ.50,000కి పరిమితం చేస్తూ మార్చి 5న ఆర్‌బీఐ యెస్‌ బ్యాంక్‌పై మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి వచ్చిన రోజునుంచి మూడో రోజు సాయంత్రం 6 గంటలకు మారటోరియం ఆంక్షలు తొలగిపోతాయని నోటిఫికేషన్‌ తెలిపింది. అలాగే అడ్మినిస్ట్రేషర్‌గా ఉన్న వ్యక్తి ఏడు రోజుల్లోగా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ తర్వాత కొత్త బోర్డు ఏర్పాటవుతుందని పేర్కొంది.

* జాతీయ పౌర విమానయాన విధానం- 2016 లో పేర్కొన్న విధంగా సుస్థిరమైన విమానయానం లక్ష్యాలను సాధించేందుకు వీలుగా నమూనా ప్రాజెక్టును చేపట్టేందుకు ఎయిర్‌బస్‌, తెలంగాణా ప్రభుత్వం, జీఎంఆర్‌ గ్రూపు కలిసి ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) సెన్సార్‌ ఆధారిత పర్యవేక్షణ ద్వారా పర్యావరణాన్ని విశ్లేషించి ఒక సమాచార నిధిని ఏర్పాటు చేయటానికి వీలు కలుగుతుంది. ఇందులో భాగంగా జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) ఈ విమానాశ్రయంలో గాలి, వాతావరణం, శబ్దం, కర్బన ఉద్గారాలను కొలిచే ఎయిర్‌బస్‌కు చెందిన ఎయిర్‌బస్‌ బిజ్‌ల్యాబ్‌ను టెక్నాలజీ సూట్‌ను అమలు చేయటానికి అనుమతిస్తుంది. ఈ సమాచార అధ్యయనం వల్ల పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయటానికి వీలుకలుగుతుంది. ఈ త్రైపాక్షిక ఒప్పంద కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, జీహెచ్‌ఐఏఎల్‌ సీఈఓ ఎస్‌జీకే కిషోర్‌, తెలంగాణా ప్రభుత్వ ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఎయిర్‌బస్‌ ఇండియా ఎండీ ఆనంద్‌ స్టాన్లీ తదితరులు పాల్గొన్నారు.

* అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి యెస్‌ బ్యాంక్‌ రూ.18,564 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2018లో ఇదే సమయంలో ఈ బ్యాంకు రూ.1000 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. 2019 జులై- సెప్టెంబరులో రూ.629 కోట్ల నష్టాన్ని చవిచూసింది. సమీక్ష త్రైమాసికంలో మొత్తం రుణాల్లో నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి 18.87 శాతానికి పెరిగింది. ఏడాదిక్రితం ఈ నిష్పత్తి 7.39 శాతంగా ఉంది. మొండి బకాయిలకు కేటాయింపులు కూడా రూ.1,336 కోట్ల నుంచి పెరిగి రూ.24,765 కోట్లకు చేరాయి. కేటాయింపులు ఇంత భారీగా పెరగడమే లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపింది. సెప్టెంబరు త్రైమాసికం చివరినాటికి 16.3 శాతంగా ఉన్న కనీస మూలధన నిష్పత్తి డిసెంబరు త్రైమాసికం చివరినాటికి 4.2 శాతానికి పడిపోయింది. ఆర్‌బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్‌ ప్రశాంత్‌ కుమార్‌ పర్యవేక్షణలో యెస్‌బ్యాంక్‌ ఈ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

* ఎన్నికల వేళ పాపం ట్రంప్‌కు కష్టాలు ఎదురొస్తున్నట్లున్నాయి. కష్టపడి సిరియా, ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌లలో ఏదో చేశానని చెప్పుకొందామనుకుంటే అక్కడ పరిస్థితులు ఎదురుతన్నుతున్నాయి. మరోపక్క చైనాతో ట్రేడ్‌వార్‌ బొప్పికట్టడంతో ఎన్నికలకు ముందు రాజీ చేసుకొని బయటపడ్డారు. ఇప్పుడు తనకు ఏమాత్రం సంబంధంలేని ఒపెక్‌+, రష్యా మధ్య వివాదంలో ట్రంప్‌ అదేనండి.. అమెరికా బాధిత దేశంగా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

* సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంకులో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్‌ బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. తాజాగా బంధన్‌ బ్యాంక్‌ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు తమ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. రూ.2 ముఖ విలువున్న షేరును రూ.8 అధికంగా అంటే రూ.10 చొప్పున మొత్తం 30 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.300 కోట్లతో కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. నగదు రూపేణా ఈ లావాదేవీ జరుగుతుంది.