Politics

జగన్…మొండితనం విడవాలి

Chandrababu Preaches To Jagan Over Corona And Elections 2020

సీఎం జగన్‌ తన మొండి వైఖరి, వితండవాదం వీడి 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. కరోనా వైరస్‌ ప్రభావంపై రాబోయే రెండు మూడు వారాలు చాలా కీలకమని చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందితే అదుపుచేయడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా బారిన పడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా వైరస్‌ పూర్తిగా లేదని ప్రకటించేవరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చంద్రబాబు సూచించారు. డెంగీ విషయంలోనూ గతంలో తనను ఎగతాళి చేశారని, దోమలపై యుద్ధం చేస్తారా? అని అపహాస్యం చేశారని వైకాపానుద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, బెంగాల్‌లో అన్ని రకాల ఎన్నికలను రద్దు చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. కరోనాకు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ చాలని జగన్‌ అనడాన్ని జాతీయ మీడియా సైతం తప్పుబట్టిందని చెప్పారు. కరోనా వైరస్‌ విషయంలో 4 వారాల పాటు ఎలాంటి సమస్య ఉండదని సీఎస్‌ అంటున్నారని.. సీఎస్‌కు దీనిపై అవగాహన ఉందా? అని ప్రశ్నించారు.