ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కొవిడ్-19) నుంచి మానవాళిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు ఈ వైరస్ పనిపట్టే మందుల్ని తయారు చేయడంలో తలమునకలయ్యారు. అందులో భాగంగా రూపొందించిన ఓ టీకా(వ్యాక్సిన్)ను నేడు తొలిసారి ప్రయోగించనున్నట్లు అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. సోమవారం ఓ వ్యక్తిపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నామని వెల్లడించారు. అయితే, దీన్ని అక్కడి ప్రభుత్వం కానీ, సంస్థలు కానీ అధికారికంగా ప్రకటించలేదు. దీనికి సంబంధించి సియాటెల్‌లోని వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనలు జరగుతున్నాయి. ఈ ప్రయోగానికి సంబంధించిన నిధులను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సమకూరుస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ పనితీరును పూర్తిస్థాయిలో ధ్రువపరచడానికి మాత్రం మరో 18 నెలలు వేచిచూడక తప్పదని అక్కడి పబ్లిక్ హెల్త్ అధికారులు తెలిపారు.
స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 45 మంది యువకులపై ఈ వ్యాక్సిన్‌ని ప్రయోగిస్తారు. వీరికి ఒక్కొక్కరికి ఒక్కో పరిమాణంలో వ్యాక్సిన్‌ను ఇస్తారు. అయితే, ఈ క్లినికల్ ట్రయల్స్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు. మరిన్ని లోతైన పరీక్షలు చేయడానికి ముందు చేసే ప్రయోగం మాత్రమే అని పేర్కొన్నారు. తద్వారా మున్ముందు ఏమైనా దుష్ఫరిణామాలు ఉంటాయేమో తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు.
కరోనా వైరస్‌ని కట్టడి చేసే వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికోసం వివిధ పద్ధతులను అవలంబిస్తున్నారు. ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని చేస్తున్న ‘షాట్స్’ తరహా వ్యాక్సిన్లను వేగంగా ఉత్పత్తి చేసే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. అలాగే ఇది ఇచ్చే ఫలితాలు కూడా సంప్రదాయ వ్యాక్సిన్ల కంటే మెరుగ్గా ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం ప్రయోగించబోతున్న వ్యాక్సిన్‌ను షాట్స్ విధానంలో అభివృద్ధి చేసిందే. ఇక కొంతమంది స్వల్పకాలిక వ్యాక్సిన్ల తయారీపైనా దృష్టి సారించారు. కొన్ని నెలల పాటు ఈ మహమ్మారి నుంచి రక్షించేలా వీటిని తయారు చేసేందుకు ప్రయోగాలు జరుపుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 5800 పైగా మంది మృత్యువాత పడ్డారు. దాదాపు మరో 156,000 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు ఇది 145 దేశాలకు పైగా విస్తరించింది. భారత్‌లో 110 మంది దీనిబారిన పడగా.. ఇద్దరు మృతిచెందారు.