Editorials

ఈశాన్య భారతీయులను కొరోనా పేరిట వేధిస్తున్నారు

North Eastern Indians Mocked As Chinese And Corona

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు అనేక రకాల సమస్యలు తెచ్చిపెడుతోంది. దీంతో చైనా నుంచి ఎవరు వచ్చినా వాళ్లతో మాట్లాడాలంటేనే అందరూ వణికిపోతున్నారు. వాళ్లకు కరోనా ఉందేమో..? అది తమకూ వ్యాపిస్తుందేమోనని అని భయపడుతున్నారు. చైనాలో పుట్టిన కరోనా ఇప్పుడు ప్రపంచానికి పాకింది. భారత్‌లోనూ ప్రవేశించింది. అయితే, కేవలం ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఈ వైరస్‌ వ్యాపించలేదు. అయినా.. సరే ఈశాన్య ప్రజలు ఈ వైరస్‌ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కారణం.. ఈశాన్య రాష్ట్రాలు చైనాకు ఆనుకొని ఉండటం వల్ల అక్కడి ప్రజలు చూడటానికి చైనా దేశస్థుల్లా కనిపిస్తారు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎక్కడ కనిపించినా.. అందరూ వాళ్లను దూరం పెడుతున్నారట..? కరోనా.. కరోనా.. అని పిలుస్తున్నారట. దీంతో ప్రస్తుతం పంజాబ్‌లో ఉంటున్న కొంతమంది విద్యార్థులు ఒక వీడియో చేశారు. ‘చూడ్డానికి చైనా దేశస్థుల్లా ఉన్నామని కొంతమంది మాకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికే బయపడుతున్నారు. స్నేహితులు కూడా మమ్మల్ని దూరం పెడుతున్నారు. ఇంకా కొంతమంది మమ్మల్ని కరోనా.. కరోనా.. అని పిలుస్తున్నారు. మేం చైనా దేశస్థులం కాదు. మాపై చూపిస్తున్న ఈ వివక్ష సరైంది కాదు. ఈశాన్య రాష్ట్రాల గురించి తెలియకపోతే ఒకసారి భారతదేశ పటం చూడండి. మేం స్వచ్ఛమైన భారతీయులం. దయచేసి మమ్మల్ని అలా పిలవద్దు’ అని ఆ వీడియోలో వారు వేడుకున్నారు. దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఇప్పుడు అదికాస్తా వైరల్‌ అయింది. దీంతో దేశం నలుమూలల ఉంటున్న ఈశాన్య రాష్ట్రాల యువత స్పందిస్తోంది. తాము కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని తమ బాధను పంచుకుంటున్నారు.