Devotional

రామాయణానికి సీతాయాశ్చరితం అని మరో పేరు

Valmiki Named Ramayana By Respecting Sita

హైందవ సంస్కృతీ సంప్రదాయాల పట్ల విశ్వాసం గల వారిలో ‘సీత’ పేరు తెలియనివారుండరు. ఆమె రామాయణ కావ్య నాయిక. శ్రీరామచంద్రమూర్తి ధర్మపత్ని. ఫాల్గుణ బహుళ అష్టమి దినాన ఆమె జన్మించిందని ‘కృతరాజసముచ్ఛయం’ చెబుతోంది.

రామాయణమంటే అది కేవలం రామకధే కాదు. సీతమ్మ కథ కూడా. వాల్మీకి మహర్షి ఈ కావ్యానికి ‘సీతాయాశ్చరితం’ అన్న పేరూ పెట్టాడు. రామా, ఆయనం అన్న పదాలు విడిగా చెప్పుకొంటే స్త్రీ ప్రయాణం అన్న అర్థం వస్తుంది. అంటే సీతాదేవి ప్రయాణం అన్న మాట.

జనక మహారాజు యజ్ఞం చేసే సంకల్పంతో యాగశాల కోసం క్షేత్రం దున్నుతున్న సమయంలో నాగటి చాలులో అందమైన పసిపాప లభిస్తే, సంతానం లేని జనకుడు పాపను తీసుకొచ్చి ‘సీత’ అని నామకరణం చేశాడు.

శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు తన పుత్రిక సీతాదేవినిచ్చి వైభవంగా వివాహం చేసి పంపాడు. జానకి ఆదర్శ వనిత. ఆమెలోని మేధాశక్తి, సహనం, విచక్షణ, ధర్మాచరణ, తపస్సు, ఆత్మ సంయమనం, భర్త పట్ల గల అచంచల భక్తి, ప్రేమ మొదలైన ఆదర్శవంతమైన లక్షణాలు ఎప్పటికీ అనుసరణీయమైనవే. భర్త వెంట అడవులకు వెళ్ళి నిరాడంబరంగా జీవితం గడిపింది. భర్తకు తోడుగా నీడగా అడవినే అయోధ్యగా భావించింది. కష్టాలను ఇష్టాలుగా చేసుకొంది. అవసరమైనప్పుడు తర్కం చేస్తుంది, చర్చ చేస్తుంది. సలహాలిస్తుంది. అసురులను అంతం చేస్తానని భర్త అక్కడి రుషులకు వాగ్దానం చేసినప్పుడు అందులోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తుంది. ఆమె లేని రాముడు లేడు. రాముడు లేక సీత లేదు. అంతటి అపురూప దాంపత్యం వారిది.
సతీఅనసూయ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది సీతమ్మ. రావణుడు సీతాపహరణం చేసినప్పుడు భార్యా వియోగంతో రాముడు సామాన్య మానవుడిలా కృశించిపోయాడు. సౌమిత్రితో కలిసి చెట్టు పుట్టా గాలిస్తూ, విలపించాడు. అశోక వనంలో సీతనుంచి రావణుడు తన కోరికను వెల్లడించినప్పుడు, ‘నా భర్త చేతిలో నీ సంహారం తథ్యం’ అని అపర కాళికయై హెచ్చరించింది. సీతకు అక్కడ కాపలాగా ఉన్నది విభీషణుడి కూతురు త్రిజట. త్రిజట తండ్రి వలె సౌమ్యురాలు. సీతమ్మకు సర్వదా సహానుభూతి తెలిపి ధైర్యం చెబుతూండేది. సీతమ్మలో దేవీశక్తి కనిపించేది ఆమెకు. రావణ వధ తరవాత భర్త ఆజ్ఞ మేరకు అగ్నిలో చేరి తన పాతివ్రత్యం నిరూపించుకుంది. భర్త చేత పరిత్యక్త అయిన భార్యకు అది అవమానం కాదని, ఆత్మవిశ్వాసంతో కాలానికి ఎదురీదాలని సందేశమిచ్చింది. వాల్మీకి ఆశ్రమంలో తలదాచుకుని యోధాగ్రేసరులైన లవకుశలను కని భర్తకప్పగించి తన తల్లి భూదేవి ఒడిలోకి చేరిపోయింది.

సీతారాములు అభిన్న తత్వాలని, వారిద్దరూ ఒకే దివ్యజ్యోతికున్న వేర్వేరు అభివ్యక్తులని తులసీ రామాయణం చెబుతుంది. సీత ప్రధాన స్వరూపమని, అక్షర బ్రహ్మమని, ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తుల సమైక్య రూపమని నిర్ణయ సింధు వ్యక్తపరచింది. సీత ఆదిశక్తి, సృష్టి స్థితి లయకారిణి అని చాటింది రామతాపనీయోపనిషత్తు. సీత ముక్తిదాయని అని ఆధ్యాత్మిక రామాయణం అభివర్ణించింది. స్త్రీ ఆదిశక్తి అని శౌననీయ తంత్రం ప్రస్తుతించింది. వ్యవసాయానికి అధిష్టాత్రి అని రుగ్వేదం కీర్తించింది. అధర్వ వేదానికి చెందిన సీతోపనిషత్తు సీతను శాశ్వత శక్తికి మూలబిందువుగా అభివర్ణించింది. ‘యోగమాయ’ అని శ్లాఘించింది. సీత జగన్మాత అని ప్రశంసించింది పద్మపురాణం. సాధక సాధ్యమైన దేవిగా రుషులు తాపసులు కీర్తించారు.