అంటార్కిటికా మంచులో ఆడుకోవాలి. ఆఫ్రికా అడవుల్లోనూ సంచరించాలి. హిమాలయాల్లో విహరించాలి. అందుకోసం కుటుంబసభ్యుల్నో స్నేహితుల్నో తోడుగా రమ్మని అడగడం లేదు, వస్తారని ఎదురుచూడటమూ లేదు నేటి మహిళ. తనకు వీలైనప్పుడు తనకు నచ్చినట్లుగా హాయిగా స్వేచ్ఛగా ప్రపంచమంతా పర్యటించేస్తోంది.
‘నీతో కలిసి ప్రయాణించేందుకు ఎవరైనా వస్తారని ఎదురుచూడటంలోనే నీ జీవితం ముగిసిపోవచ్చు’… ఈ విషయాన్ని ఈతరం మహిళలు చక్కగా గ్రహించారు. అవునుమరి, పనుల్లో కాస్త విరామం దొరికినప్పుడు ఏ సఫారీకో వెళ్లాలనో నైలునదిలో విహరించాలనో అనిపిస్తుంది. ఆ సమయంలో వెంట రావడానికి కుటుంబసభ్యులకి కుదరకపోవచ్చు. ఆసక్తి లేకపోవచ్చు. ఒక్కోసారి ఎవరూ లేకపోనూవచ్చు. అలాగని ఈతరం అమ్మాయిలు పర్యటించడం మానుకోవడం లేదు. తమలానే ఆలోచించే కొత్త స్నేహితులతో కలిసి సంతోషంగా టూర్లకు వెళ్తున్నారు, సరదాగా గడుపుతున్నారు. అలాంటివాళ్లకోసం రూపుదిద్దుకున్నవే ఈ మహిళా ట్రావెల్ సంస్థలు. రకరకాల టూర్లతో పర్యటకుల్ని ఆకర్షిస్తున్నాయివి.
*(**వారెవ్వా… వావ్!
‘పర్యటించడం అంటే నాకెంతో ఇష్టం. నాలానే చాలామందే ఉండొచ్చు. కానీ తోడు లేక ఆగిపోతుంటారు. అలాంటి వాళ్లకోసం ఏర్పాటు చేసిందే ఈ విమెన్ ఆన్ వాండర్లిస్ట్(వావ్)’ అంటారు దీన్ని ప్రారంభించిన సుమిత్ర సేనాపతి. ఆకాశం చేతికి అందుతుందా అనిపించే ఎత్తైన లద్దాఖ్ కొండల్లో ఆరుబయట పడుకుని నక్షత్రాలని లెక్కపెట్టడం… అర్జెంటీనాలో టాంగో తెగతో నృత్యం చేయడం… ఇలా ఏదైనా ‘వావ్’ బృందానికి సాధ్యమే అంటారు సుమిత్ర. ప్రపంచవ్యాప్తంగా యాభైకి పైగా ప్రదేశాలకు వందల పర్యటనల్ని నిర్వహిస్తూ ఎందరో పర్యటకుల్ని తమ ఖాతాలో వేసుకుంటోందీ క్లబ్
**(ఎఫ్5 తోడుంటే..!
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వైవిధ్యభరితమైన పర్యటనల్ని నిర్వహిస్తోంది బెంగళూరుకి చెందిన ‘ఎఫ్5 ఎస్కేప్స్’. మున్నార్‌లోని తేయాకు తోటలూ, అలెప్పీ బ్యాక్వాటర్సూ మణిపుర్ లోక్తాక్ సరస్సూ… ఇలా ఆయా ప్రాంతాల్లోని విశేషాలను చక్కగా చూపిస్తుందీ సంస్థ. పర్యటనలో భాగంగా హస్తకళల్నీ నేర్పిస్తుంది. ఇవేకాదు, హోమ్స్టేలూ హెరిటేజ్ హోటళ్లలో బస ఏర్పాటుచేయడం దీని ప్రత్యేకత.
సోల్ పర్పస్‌తో సరికొత్తగా…
పర్యటన విభిన్నంగా ఉండాలంటే ట్రెక్కింగ్, కయాకింగ్, ర్యాఫ్టింగ్, వైల్డ్‌లైఫ్ సఫారీ… వంటివన్నీ ఉండాల్సిందే అంటూ ఆ దిశగా మహిళల్ని ప్రోత్సహిస్తుందీ ‘సోల్ పర్పస్’ ట్రావెల్ సైట్. ఫొటోగ్రఫీ, యోగా, ధ్యానానికి సంబంధించిన తరగతుల్నీ వర్కుషాపుల్నీ నిర్వహిస్తుంది. ‘మహిళలు హాయిగా విహరించాలంటే ఫిట్‌గా ఉండాలి అందుకే పర్యటనలో భాగంగా దానిమీదా అవగాహన కలిగిస్తున్నాం’ అంటున్నారు దీన్ని ప్రారంభించిన మిమి, విద్యలు.
**(వైవిధ్యంగా వ్యాండర్ గర్ల్స్‌తో…
కొత్తప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణంలో మమేకం కావాలి. అందుకే పర్యటనలతోబాటు కొన్ని కార్యక్రమాల్నీ నిర్వహిస్తూ అంతర్జాతీయ మహిళల్నీ ఆకర్షిస్తోంది ‘ద వ్యాండర్ గర్ల్స్’. అటు ప్రకృతిఅందాల్నీ ఇటు చరిత్రనీ సంస్కృతినీ స్థానిక రుచుల్నీ కళల్నీ షాపింగ్నీ అన్నింటినీ మేళవించి మరీ పర్యటనల్ని రూపొందిస్తున్నాం అంటున్నారు దీని నిర్వాహకులు.
**విమెన్ ఆన్ క్లౌడ్స్‌తో…
దిల్లీకి చెందిన ‘విమెన్ ఆన్ క్లౌడ్స్ క్లబ్’ థీమ్ బేస్డ్ టూర్లను నిర్వహిస్తూ తనదైన ప్రత్యేకత చాటుకుంటోంది. రిషీకేశ్‌లో ర్యాఫ్టింగ్, గోకర్ణలో ధ్యానం, యోగా తరగతులు, గఢ్వాల్లో ట్రెక్కింగ్…వంటి వాటితోబాటు వన్యప్రాణుల పార్కులూ, హాంటెడ్ ప్యాలెస్‌ల సందర్శనల్నీ ఏర్పాటుచేస్తోంది. వీటితోబాటు దేశ, విదేశాల్లోని ప్రముఖ ప్రాంతాల్లోనూ పర్యటనల్ని నిర్వహిస్తుందీ క్లబ్. ఇవే కాదు, దివా ఒడిస్సీస్, వ్యాండరింగ్ జేన్, గర్ల్స్ ఆన్ ద గో క్లబ్, జుగ్ని, వండరఫుల్ వరల్డ్, మిస్ ట్రావెల్ బీ… ఇలా ఎన్నో వెబ్సైట్లు మహిళా పర్యటకుల్ని ఆకర్షిస్తున్నాయి. మేక్ మై ట్రిప్, ఇన్క్రెడిబుల్ ఇండియాటూర్స్, కుంజుమ్డాట్కామ్… వంటి ట్రావెల్ సంస్థలూ మహిళలకి ప్రత్యేక పర్యటనల్ని నిర్వహిస్తున్నాయి. ఒంటరిగా వెళ్లేటప్పుడు మన ఆసక్తుల్నీ ఆహారపుటలవాట్లనీ సంస్థ సభ్యులకు ముందే తెలియజేస్తే అలాంటివి ఉన్నవాళ్లతోనే కలిసి ఉండేలా చూస్తారు. గదుల షేరింగ్‌తో ఖర్చూ తగ్గుతుంది. బోరూ కొట్టదు. కొత్తవాళ్లతో పర్యటిస్తే తెలియనివి నేర్చుకుంటూ తెలిసినవి చెప్పొచ్చు. నచ్చినట్లుగా ఉండొచ్చు. సో, ఒకే అభిరుచి ఉన్నవాళ్లతో పర్యటిస్తే ఆ ఆనందమే వేరు. కాబట్టి హాయిగా పర్యటించండి. కొత్త స్నేహితులతో సరికొత్త అనుభూతులతో తిరిగిరండి..!
ఈ యాత్ర కేవలం మహిళల కోసమే!
Related tags :