Devotional

రావణుడి ఆగ్రహం నుండి ఏర్పడిన పుణ్యక్షేత్రాలు

Ravana Brahma's Anger Created Spiritual Locations

రావణుడి కోపం నుంచి పుట్టిన పుణ్యక్షేత్రాలు..

అమిత భక్తి నుంచి పుట్టిన కోపం.. మరో ఐదు పుణ్య క్షేత్రాల ఆవిర్భావానికి కారణమైంది. ఆ కోపం ఏమిటి? ఆ పుణ్య క్షేత్రాలు ఏవి? ఈ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లంకాధిపతి రావణాసురుడు గొప్ప శివ భక్తుడు. మహాశివుడి ఆత్మలింగాన్ని సాధించి, అమరత్వం పొందాలని రావణాసురుడికి కోరిక కలిగింది. ఆత్మ లింగం కోసం మహాశివుడిని రావణుడు భక్తిశ్రద్ధలతో ప్రార్థించాడు. రావణుడి తపస్సును మెచ్చుకున్న మహాశివుడు ఆయనకు ప్రత్యక్షమై, ఏం వరం కావాలని అడిగాడు. అదే సమయంలో వైకుంఠంలో శ్రీ మహా విష్ణువు వద్దకు నారద ముని వెళ్లాడు. రావణుడి మనసును మార్చాలని మహావిష్ణువును ప్రార్థించాడు.

రావణాసురుడి ఆలోచనను శ్రీ మహా విష్ణువు మార్చడంతో రావణాసురుడు మహాశివుని ఆత్మ లింగాన్ని అడగడానికి బదులు పార్వతీ దేవిని అడిగాడు. వెంటనే మహా శివుడు అంగీకరించి పార్వతీ దేవిని రావణాసురుడికి ఇచ్చేశాడు. పార్వతీ దేవితో సహా రావణాసురుడు తన లంకా పట్టణానికి తిరిగి ప్రయాణమయ్యాడు. ఆ దారిలో నారద ముని రావణాసురుడికి కనిపించాడు. మహాశివుడు నిజమైన పార్వతీ దేవిని ఇవ్వలేదని, మహాకాళిని ఇచ్చాడని రావణాసురుడికి నారదుడు చెప్పాడు. అసలు పార్వతీ దేవి పాతాళంలో ఉందని తెలిపాడు. ఆ సమయంలో పార్వతీ దేవి కాళికా అవతారంలో రావణాసురుడికి దర్శనమిచ్చింది. వెంటనే రావణాసురుడు పార్వతీ దేవిని విడిచిపెట్టేశాడు.

అసలు పార్వతీ దేవి కోసం వెతుకుతూ రావణాసురుడు పాతాళానికి వెళ్లాడు. అక్కడ మండోదరిని పార్వతీ దేవిగా భావించి ఆమెను వివాహం చేసుకున్నాడు. మండోదరిని తీసుకుని రావణాసురుడు లంకా పట్టణానికి తిరిగి వచ్చాడు. అక్కడ రావణాసురుడి తల్లి మహాశివుడి ఆత్మలింగం తెచ్చావా? అని అడిగింది. తాను మోసపోయానని రావణాసురుడికి అర్థమైంది ఎలాగైనా ఆత్మలింగాన్ని సాధించాలని రావణాసురుడికి పట్టుదల పెరిగింది.

రావణాసురుడు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా భక్తిశ్రద్ధలతో మళ్లీ తపస్సు చేశాడు. ఆయన తపస్సును మెచ్చుకున్న మహాశివుడు ప్రసన్నుడయ్యాడు. మళ్లీ ప్రత్యక్షమై ఏం వరం కావాలని రావణాసురుడిని అడిగాడు. తనకు ఆత్మ లింగం ఇవ్వాలని రావణాసురుడు మహాశివుని ప్రార్థించాడు. ఆయన కోరిన వరం ఇచ్చేందుకు మహాశివుడు అంగీకరించి, ఓ షరతు విధించాడు.

ఆత్మలింగాన్ని ఇస్తూ, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని మహాశివుడు చెప్పాడు. ఆత్మలింగాన్ని నేలపై పెడితే దానిలోని అన్ని శక్తులు మళ్లీ తనకే వచ్చేస్తాయని మహాశివుడు చెప్పాడు. రావణాసురుడు సంతోషంగా ఆత్మలింగాన్ని తీసుకుని లంకా పట్టణానికి బయల్దేరాడు.

ఆత్మలింగాన్ని రావణాసురుడు తీసుకొస్తున్నట్లు నారద మునికి తెలిసింది. దాని శక్తితో రావణాసురుడికి అమరత్వం వస్తే భూ మండలాన్ని సర్వనాశనం చేస్తాడని భావించాడు. వెంటనే గణేశుడిని ఆశ్రయించాడు. ఆత్మలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని ప్రార్థించాడు. రావణాసురుడు ప్రతి రోజూ క్రమం తప్పకుండా సంధ్యావందనం చేస్తాడని గణేశుడికి తెలుసు. రావణాసురుడు సంధ్యావందనం చేసే సమయంలోనే ఆయన నుంచి ఆత్మలింగాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రణాళిక రచించాడు.

రావణాసురుడు ఆత్మలింగంతో గోకర్ణమును సమీపిస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నట్లుగా కనిపించేలా మహావిష్ణువు చేశాడు. దీంతో రావణాసురుడు సంధ్యావందనం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. కానీ చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక తికమక పడ్డాడు. చేతిలో ఆత్మలింగం ఉంటుండగా సంధ్యావందనం చేయడం సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నాడు. దీనిని ఆసరాగా చేసుకుని గణేశుడు బ్రహ్మచారి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మణ బాలుడి రూపంలో ఉన్న గణేశుడిని రావణాసురుడు పిలిచి, తాను సంధ్యావందనం చేసే వరకు ఆత్మలింగాన్ని పట్టుకోవాలని కోరాడు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని తెలిపాడు. ఆత్మలింగాన్ని పట్టుకోవడానికి గణేశుడు ఓ షరతు విధించాడు. తాను మూడుసార్లు పిలుస్తానని, ఆ లోగా వచ్చి, ఆత్మలింగాన్ని తీసుకోకపోతే నేలపై పెట్టేస్తానని చెప్పాడు. దానికి రావణాసురుడు అంగీకరించాడు.

రావణాసురుడు సంధ్యావందనం చేసే సమయంలో గణేశుడు రావణా… రావణా అంటూ మూడుసార్లు పిలిచాడు. రావణాసురుడు ఏకాగ్రతతో ప్రార్థన చేస్తూ, గణేశుడి మాటలను వినిపించుకోలేదు. సంధ్యావందనం పూర్తయిన తర్వాత తిరిగి గణేశుడి వద్దకు రావణాసురుడు వచ్చాడు. అప్పటికే ఆత్మలింగాన్ని గణేశుడు నేలపై పెట్టేశాడు. బాలుడు తనను మోసం చేశాడని రావణాసురుడికి పట్టరాని కోపం వచ్చింది. ఆ ఆత్మలింగాన్ని పైకి తీసి, ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు. రావణుడి ముష్టిఘాతాలకు ఆత్మలింగంలో కొన్ని భాగాలు చెల్లాచెదురయ్యాయి. ఆత్మలింగంలో శిఖర భాగం ప్రస్తుతం సూరత్కల్‌ అని పిలుస్తున్న ప్రాంతంలో పడిందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఆ ప్రాంతంలో సుప్రసిద్ధ సదాశివ దేవాలయాన్ని నిర్మించారు. ఆత్మలింగంలోని మరో భాగం ఇక్కడికి 23 మైళ్ల దూరంలోని సజ్జేశ్వరంలో పడింది. ఆత్మలింగానికి ఆచ్ఛాదనగా ఉన్న కప్పును విసిరేయగా దాదాపు 10-12 మైళ్ల దూరంలో ఉన్న గుణేశ్వరం, ధారేశ్వరంలలో పడ్డాయి.