DailyDose

కొరోనా రెండోసారి కూడా సోకవచ్చు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Corona Can Attack Second Time As Well Says JHU

* జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటి వరకూ 1,30,000కుపైగా వ్యక్తులకు కరోనా సోకింది. అందులో 69,607 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. అయితే, వైరస్‌ నుంచి బయటపడ్డవారు ఆ భయం నుంచి మాత్రం బయటికి రాలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా రెండోసారి సోకుతుందా? అన్న ప్రశ్నకు ఇప్పుడైతే కచ్చితమైన సమాధానం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. అది కరోనా బాధితుల రోగ నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు రెండోసారి వైరస్‌ సోకే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. అయితే, ఇది చాలా అరుదుగా సంభవిస్తుందని అంటున్నారు. అలాగని కరోనా వైరస్‌ రెండోసారి సోకుతుందని కూడా చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.

* కరోనాపై పోరాడేందుకు భారత్‌కు ఉన్న నిబద్ధత ఎంతో ఆకట్టుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసలు కురిపించింది. భారత వైద్య పరిశోధనా సంస్థ(ఐసీఎంఆర్‌)తో సమావేశం అనంతరం భారత్‌కు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధిగా ఉన్న హెంక్‌ బెకెడమ్‌ విలేకరులతో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా హెంక్‌ మాట్లాడుతూ.. ‘కరోనాపై పోరాడేందుకు భారత్‌లో ఉన్నత స్థాయి నుంచి నిబద్ధతతో చేపడుతున్న చర్యలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వైరస్‌ ఇంత తీవ్రతలోనూ భారత్ అంత గట్టిగా ఉండటానికి ఇది కూడా ఓ కారణం. వైరస్‌ను ఎదుర్కొనగల సామర్థ్యం వారికి ఉంది. ఇప్పుడు పరిశోధనా కమ్యూనిటీలో భారత్‌ కూడా ఒక భాగంగా కొనసాగనుంది’ అని పేర్కొన్నారు.

* ఉరి అమలు తేదీ దగ్గరపడుతుండడంతో నిర్భయ దోషులు శిక్ష తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ తాజాగా దిల్లీ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశాడు. నిర్భయ అత్యాచార ఘటన జరిగిన డిసెంబరు 16న తాను దిల్లీలోనే లేనని పిటిషన్‌లో చెప్పుకొచ్చాడు. డిసెంబర్‌ 17, 2012న రాజస్థాన్‌ నుంచి పోలీసులు తనని దిల్లీ తీసుకొచ్చారని పేర్కొన్నాడు. తిహాడ్‌ జైలులో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించాడు.

* చైనాలో ఉత్పన్నమైన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం చూపుతోన్న ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 7130 మృత్యువాత పడగా.. 1,79,823 కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ ఈ వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో మూడు మరణాలు చోటుచేసుకున్నాయి. రోజు రోజుకూ ఈ కేసుల తీవ్రత పెరుగుతుండటంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమై దీని వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడంతో పాటు దీని కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు సూచిస్తూ అప్రమత్తం చేస్తోంది.

* రాష్ట్రంలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని, ఈసారి కేంద్ర బలగాల బందోబస్తుతో ఎన్నికలు జరపాలని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని భాజపా కూడా డిమాండ్ చేస్తున్నందున కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందన్నారు. ప్రతిపక్షాలను అణచివేయాలనే ధోరణి మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.

* దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం మరో ఆరు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. హరియాణాలోని గుడ్‌గావ్‌లో 29 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గుడ్‌గావ్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న మహిళగా అధికారులు నిర్ధారించారు. ఆమె ఇటీవల మలేషియా, ఇండోనేషియా పర్యటనకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. కాగా ఇది ఆ రాష్ట్రంలో తొలి కరోనా కేసు కావడం గమనార్హం.

* సీఏఏకి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై భాజపా ఎంపీలు, నేతలు మండిపడ్డారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రాష్ట్ర భాజపా నేతలు మౌన దీక్ష చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా చేసిన తీర్మాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్య రాజ్యాంగ విరుద్ధమని నేతలు హెచ్చరించారు. . సీఏఏ, ఎన్‌పీఆర్‌ అమలు జరిగి తీరుతుందని, అసెంబ్లీ చేసిన తీర్మానం చెత్తబుట్టకే పరిమితమని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

* యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తర్వాతి చిత్రం మరో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. దీంతోపాటు ఓ ఛేజింగ్‌ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించారు. కాగా, కొన్ని రోజుల క్రితం యూనిట్‌ ఈ చిత్రం షూటింగ్‌ కోసం జార్జియా వెళ్లారు. కరోనా వైరస్‌ ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న నేపథ్యంలోనూ ముందడుగు వేశారు. ‘10 డిగ్రీల చలి.. ఓ పక్క వర్షం పడుతోంది.. మరోపక్క కరోనా వైరస్‌ ముప్పు.. ఇవేవీ యూనిట్‌ విశ్వాసాన్ని ఆపలేకపోయాయి’ అని నాలుగు రోజుల క్రితం రాధాకృష్ణ ట్వీట్‌ చేస్తూ ఫొటోను షేర్‌ చేశారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలో నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో లాభపడి మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 810 పాయింట్లు నష్టపోయి.. 30,579 వద్ద ముగిసింది. నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోయి 8,967 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద కొనసాగుతోంది.

* తెలంగాణ అభివృద్ధిని తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. ఈ విషయంలో చొరవ తీసుకుని సహకరించాలని ప్రధాని మోదీని కోరినట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో ప్రధానితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెరాస పాలనలో తెలంగాణ ఎలా నాశనమైందనే విషయాన్ని మోదీకి వివరించానన్నారు. రూ.4లక్షల కోట్ల అప్పులు చేశారని.. ప్రాజెక్టుల పేరుమీద ఏవిధంగా దోచుకుంటున్నారనే అంశాలను ప్రధాని తెలిపానని చెప్పారు. అయితే ఈ విషయాలన్నీ మోదీ దృష్టిలో ఉన్నాయన్నారు.

* దేశమంతా క్రమంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ తరుణంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో విశేష కృషి చేస్తున్న వివిధ రంగాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా బాధితులకు, అనుమానితులకు విశేష సేవలందిస్తున్న డాక్టర్లను, వైద్య సిబ్బందిని అభినందించారు. అలాగే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్న మీడియా పాత్రను కూడా ప్రధాని కొనియాడారు.