Devotional

చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ముసేశారు

Chilukuru Balaji Temple Closed Due To Covid19

కొవిడ్ 19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలు తీస్తుండటంతో… భారత్‌లోని అన్ని ఆలయాల్లో ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తిరుమల, షిర్డీ, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాల్లో భక్తుల రాకను తగ్గిస్తూ… చర్యలు చేపట్టారు. తాజాగా… తెలంగాణలో ఫేమస్ అయిన చిలుకూరి బాలాజీ టెంపుల్‌లో కూడా ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. చర్యల్లో భాగంగా… మార్చి 19 (గురువారం) నుంచీ మార్చి 25 వరకూ… ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. మూసివేయడమంటే… పూర్తిగా మూసేయడం కాదు… స్వామి వారికి రోజువారి పూజలు, నైవేద్యాలను సమర్పిస్తారు. భక్తులను మాత్రం అనుమతించరు. అందువల్ల భక్తులు ఎవరూ 25 వరకూ ఆలయానికి రావొద్దని అర్చకులు కోరుతున్నారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ… కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించే చర్యల్ని చేపట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ వైరస్ త్వరగా వెళ్లిపోవాలని దేవుణ్ని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఏ ఆలయానికూ భక్తులు వెళ్లకపోవడమే మంచిదన్నారు. ఇళ్లలోనే ఉండి పూజలు చేసుకొని… త్వరగా ఈ వైరస్ వదిలిపోయేలా చేద్దామని సూచించారు. శ్రీశైలం, షిర్డీ లాంటి ఆలయాల్లో నెలాఖరు వరకూ ఇలాంటి రూల్స్ ఉన్నాయి. అన్ని ఆలయాల్లో భక్తుల్ని రావొద్దనే కోరుతున్నారు. ఏమాత్రం అనారోగ్యం ఉన్నా… అస్సలు రావొద్దంటున్నారు. కనీసం ఇలాగైనా చేస్తే… కరోనా వైరస్ మరింత మందికి వ్యాపించకుండా ఉంటుందని ఆశిస్తున్నారు. ఏది ఏమైనా… ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే ఆలయాలకు… ఇప్పుడు భక్తులు వెళ్లడమే ప్రమాదకరమనే పరిస్థితి రావడం, దేవుడి దగ్గరకు వెళ్లకపోవడమే మంచిదనే పరిస్థితి తలెత్తడం విచాకరమే.