ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చిత్ర పరిశ్రమనూ భయపెడుతోంది. సినిమాల ప్రదర్శనలు, విడుదల, చిత్రీకరణ ఇలా అన్నింటా కరోనా అడ్డుపడుతోంది. మహారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, బిహార్, పంజాబ్ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 3500 థియేటర్లు మూతపడ్డాయి. దీంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇప్పటి వరకు రూ.800 కోట్లు నష్టపోయిందని సమాచారం.
మార్చి 6న విడుదలైన ‘బాఘీ 3’.. మొదటి వారంలోనే 90.67 కోట్ల రూపాయలు వసూలు చేసింది. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘ఆంగ్రేజీ మీడియం’ తొలి మూడు రోజుల్లోనే 59.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఆ తర్వాత థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాలు నష్టపోతున్నాయి. ‘బాఘీ 3’ నిర్మాతలకి 25 నుంచి 30 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం. వారాంతాల్లో థియేటర్లు మూసివేయడంతో ‘ఆంగ్రేజీ మీడియం’పై కూడా ప్రభావం పడింది. ఈ సినిమా కూడా నష్టాల బారిన పడింది.
సినిమాల ప్రదర్శన నిలిపేయడమే కాకుండా, కొత్త సినిమాల విడుదల కూడా లేకపోవడంతో బాలీవుడ్ భారీగా నష్టపోతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ హిందీ చిత్రాల విడుదల వాయిదా పడింది. ‘బ్రహ్మాస్త్ర’, ‘సూర్యవంశీ’ వాయిదా పడ్డాయి. దీనికితోడు జేమ్స్ బాండ్ తదుపరి సినిమా ‘నో టైమ్ టు డై’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ లాంటి హాలీవుడ్ సినిమాలూ వెనక్కి మళ్లాయి. హాలీవుడ్ సినిమాలకు అందులోనూ బాండ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి సినిమాలకు మన దగ్గర మంచి మార్కెట్ ఉంది. ఇదిలా ఉండగా చిత్రీకరణలూ నిలిపేయడంతో నష్టం మరింత పెరిగింది. ఇవన్నీ కలిపితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సుమారు రూ.800 కోట్ల రూపాయలు నష్టపోయిందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.