టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ పునరాగమనం చేయడం ఇక కష్టమేనని మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భావిస్తున్నాడు. ప్రస్తుత జట్టు కూర్పులో అతడికి చోటు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నాడు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ వికెట్‌కీపింగ్, బ్యాటింగ్‌లో రాణిస్తున్నారని పేర్కొన్నాడు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ఏ సిరీస్‌కూ అందుబాటులో లేడు. దీంతో అతడి భవితవ్యంపై సందేహాలు తలెత్తాయి. బీసీసీఐ అతడి కాంట్రాక్టును సైతం పునరుద్ధరించలేదు. పదేపదే అతడి వీడ్కోలుపై వదంతులు రావడంతో బీసీసీఐ, రవిశాస్త్రి వివరణలు ఇచ్చారు. ఐపీఎల్లో బాగా ఆడితే ప్రపంచకప్ జట్టుకు మహీని పరిశీలిస్తామని శాస్త్రి తెలిపారు. కరోనా ముప్పుతో ప్రస్తుతం ఐపీఎల్ వాయిదా పడింది. పరిస్థితులు మెరుగవ్వకపోతే టోర్నీని రద్దు చేసే విషయాన్నీ కొట్టిపారేయలేం.
‘జట్టులో అతడికి చోటు ఎక్కడుంది? రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ ఇప్పటికే ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీసుల్లో రాహుల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంకా అతడి గురించి ఆలోచించేందుకు కారణం ఏముంది’ అని సెహ్వాగ్ అన్నాడు. అలాగే న్యూజిలాండ్‌లో విఫలమైన టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి అండగా నిలిచాడు.
‘విరాట్ అద్భుతమైన ఆటగాడు. అతనికిప్పుడు జరిగిందే గతంలో దిగ్గజాలూ అనుభవించారు. వేర్వేరు కాలాల్లో సచిన్ తెందూల్కర్, స్టీవ్ వా, జాక్వెస్ కలిస్, రికీ పాంటింగ్ గడ్డుకాలం ఎదుర్కొన్నారు. వన్డే, టెస్టుల్లో కివీస్ మన కన్నా అత్యుత్తమంగా ఆడిందని అంగీకరించాలి. టీ20ల్లోనూ కివీస్ విజయాలకు సమీపించింది. పొట్టి క్రికెట్లో వెంటనే పుంజుకోవడం అంత సులభం ఆదు’ అని వీరూ పేర్కొన్నాడు.