నిర్మాణరంగంలో వినియోగించే విద్యుత్ పరికరాలను ఉత్పత్తి చేసే పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ (గతంలో యాంకర్ ఎలక్ట్రికల్) చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీ ఇండస్ట్రియల్ పార్క్‌లో కొత్త ఉత్పత్తి ప్లాంటును నిర్మించబోతోంది. దీనికోసం ఇప్పటికే అక్కడ 35 ఎకరాల భూమిని సేకరించినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ శర్మ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో దేశంలోనే మొదటి పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ప్రత్యేక ప్రదర్శన, విక్రయశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీసిటీలో ఏర్పాటు చేయబోతున్న ప్లాంటుపై ఇప్పటికే రూ.450 కోట్లను పెట్టుబడిగా పెట్టినట్లు వివరించారు. నిర్మాణ పనులు మే 21న ప్రారంభమవుతాయని తెలిపారు. ఏడాదిలో పనులు పూర్తయి, ఉత్పత్తి మొదలవుతుందని పేర్కొన్నారు. యంత్రాలు, ఇతర అవసరాల కోసం మరో రూ.200 కోట్ల వరకూ అవసరం అవుతాయన్నారు. దేశంలో ఇది ఎనిమిదో ఉత్పత్తి కేంద్రం అని తెలిపారు. ఇక్కడ నుంచి వైరింగ్ పరికరాలు, ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్ గేర్లు, గాలి శుద్ధి పరికరాలను ఉత్పత్తి చేస్తామన్నారు. దాదాపు 1,800 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం 12 ఎకరాల్లో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు, మిగతా భూమిని విస్తరణకు లేదా సోలార్ యూనిట్ల తయారీకి ఉపయోగిస్తామన్నారు. ఉత్పత్తి ప్రారంభమైన మూడేళ్లలో రూ.2,000 కోట్ల ఆదాయాన్ని ఇక్కడినుంచి ఆశిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విక్రయశాల్లాంటివి దేశంలో 2022 నాటికి 130 ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో ఇక్కడ మరో రెండు, విజయవాడ, విశాఖపట్నంలో ఒకటి చొప్పున ఉంటాయని తెలిపారు.
ఏపీలో పానాసోనిక్ ప్లాంట్
Related tags :