DailyDose

వేగాస్ వెలవెల-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Las Vegas Is All Dull

* క‌రోనా కాటుకు గ్యాంబ్ల‌ర్లు కూడా బిక్కుబిక్కుమంటున్నారు.అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఉన్న కాసినోల‌ను మూసివేశారు. నెల రోజుల పాటు క్యాసినోల‌ను మూసివేయాల‌ని అమెరికా ప్ర‌భుత్వం ఆదేశించింది. ప్ర‌తి రోజు వేలాది మంది జూద‌గాళ్లు లాస్ వెగాస్‌లో గ్యాంబ్లింగ్ ఆడేందుకు వ‌స్తుంటారు. అయితే క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. క్యాసినోలు, రెస్టారెంట్లు, ఇత‌ర బిజినెస్ కేంద్రాల‌ను మూసివేస్తున్న‌ట్లు నెవ‌డా రాష్ట్రం ప్ర‌క‌టించింది.తాజా ప్ర‌భుత్వ ఆదేశాల‌తో గ్యాంబ్లింగ్ రాజ‌ధానిగా పేరుగాంచిన లాస్ వెగాస్ వెల‌వెల‌బోయింది.సాధార‌ణంగా లాస్ వెగాస్‌లో 24 గంట‌లూ క్యాసినోలు తెరిచి ఉంటాయి.1963లో జాన్ ఎఫ్ కెన్న‌డీ అంత్య‌క్రియ‌లు రోజున మాత్ర‌మే క్యాసినోల‌ను మూసివేశారు.మ‌ళ్లీ ఇప్పుడు క‌రోనా భ‌యంతో వాటిని లాక్‌డౌన్ చేశారు.

* వచ్చే త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లలో కోత విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో ద్రవ్య పరపతి విధాన వడ్డీరేట్ల కోత బదిలీ త్వరగా జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత త్రైమాసికంలో బ్యాంకు డిపాజిట్‌ వడ్డీ రేట్లు హేతుబద్ధీకరించినప్పటికీ ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ) వంటి చిన్న మొత్తాల వడ్డీరేట్ల జోలికి పోలేదు.

* టెలికాం సంస్థలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సవరించిన స్థూల ఆదాయం(ఏజీర్‌) ఛార్జీల చెల్లింపు విషయంలో ఎలాంటి పునఃసమీక్ష ఉండదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో స్వీయ మదింపు చేసుకున్న కంపెనీలపై కోర్టు మొట్టికాయలు వేసింది.‘‘అసలు ఎవరు సమీక్షించమన్నారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. బకాయిలు వసూలు చేయడంలో ప్రభుత్వ తీరుపై కూడా కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఛార్జీల పునఃసమీక్షకు గడువు ఇవ్వాలన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. కోర్టును ప్రభావితం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారని.. కానీ, అది సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసం బుధవారం ఈ అంశంపై విచారణ జరిపింది. ఒకవేళ పునఃసమీక్షని అంగీకరిస్తే కోర్టు గతంలో తప్పుచేసినట్లవుతుందని.. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపుల పునఃసమీక్షకు అనుమతించిన అధికారుల్ని సహించేది లేదని హెచ్చరించింది.

* అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ (కొవిడ్‌-18) వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో.. చైనాలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ రిటైల్‌ దుకాణాలను నిరవధికంగా మూసివేస్తున్నట్టు టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రకటించింది. తొలుత మార్చి 27 వరకే తమ రిటైల్‌ స్టోర్లను మూసివేయనున్నామని ప్రకటించిన ఆ సంస్థ.. తాము తిరిగి ప్రకటించేంత వరకూ స్టోర్ల మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల దిశగా కొనసాగుతున్నాయి. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలో ఊగిసలాట ధోరణిలో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి దిగజారిపోయాయి. ఉదయం 11.46 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 789 పాయింట్లు నష్టపోయి.. 29,776 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయి 8,732 వద్ద ట్రేడవుతోంది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74.12 వద్ద కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వైరస్‌ ప్రభావంతో మదుపరులు భయాలకు లోనవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* ప్రస్తుతం యెస్‌ బ్యాంక్‌ పద్దులన్నీ సరిగ్గానే ఉన్నందున ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయాల్సిన అవసరం లేదని యెస్‌ బ్యాంక్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), మేనేజింగ్‌ డైరెక్టరుగా (ఎండీ) నియమితులైన ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు. నిధుల లభ్యత విషయంలోనూ ఆందోళన చెందనక్కర్లేదని అన్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి బ్యాంకు కార్యకలాపాలు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరుగుతాయని అన్నారు. యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా ప్రశాంత్‌ కుమార్‌ 26న అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌, ఫెడ్‌రల్‌ బ్యాంక్‌ సీఎఫ్‌ఓ అశుతోష్‌ ఖజూరియాతో కలిసి మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘మేం తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని ఏటీఎంల్లో డబ్బులు ఉన్నాయి. శాఖల్లోనూ నిధుల కొరత లేదు. మొత్తానికి యెస్‌ బ్యాంక్‌కు సంబంధించి ఎలాంటి నిధుల సమస్య లేద’ని ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. నిధుల కోసం ఇతర బయటి వనరులపై ఆధారపడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. మారటోరియం తొలగిపోయాక.. పూర్తి స్థాయిలో బ్యాంకింగ్‌ సేవల అనుభూతిని వినియోగదారులు పొందొచ్చని తెలిపారు. డిపాజిట్ల భద్రతపై డిపాజిటుదార్లు ఆందోళన చెందనక్కర్లేదని కూడా ఆయన భరోసా కల్పించారు. అయితే సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లపై ప్రస్తుతం చెల్లిస్తున్న అత్యధిక 5-6% వడ్డీని కొనసాగించడంపై ఆయన హామీ ఇవ్వలేనన్నారు. మారటోరియం ఆంక్షలు తొలగింపుతో బ్యాంకు శాఖలకు ఖాతాదారులు డిపాజిట్లను వెనక్కి తీసుకునే నిమిత్తం పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది.