Business

పైలెట్ల జీతాల్లో కోత

Airlines Cutting Staff Salaries Due To Corona Downtime

కరోనా వైరస్‌ ప్రభావం విమానయాన రంగ ఉద్యోగుల జీతాల్లో కోతకు కారణం కానుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పూర్తిగా క్వారంటైన్‌లో ఉండటంతో చాలా విమానయాన సంస్థలకు వ్యాపారం దెబ్బతింది. దీంతో పలు సంస్థలు ఖర్చుతగ్గించుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ మేరకు ఇండిగో సంస్థ తమ ప్రయత్నాలను మొదలుపెట్టింది. తమ సీనియర్‌ ఉద్యోగుల వేతనాల్లో 25శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ సీఈవో రాజీవ్‌రాయ్‌ దత్తానే తన జీతంలో 25శాతం కోత విధించుకొన్నారు. సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌.. ఆపై స్థాయి అధికారుల వేతనాల్లో 20శాతం, వైస్‌ప్రెసిడెంట్‌ , కాక్‌పిట్‌ క్రూ వేతనాల్లో 15శాతం కోత విధించుకొన్నారు. ఈ మేరకు కంపెనీ చీఫ్‌ ఆపరేషన్స్‌ అధికారి అశీమ్‌ మిత్ర పైలెట్లకు ఒక లేఖరాశారు. ప్రస్తుత ఆర్థిక కష్టాల నుంచి ఏ విమానయాన సంస్థ మినహాయింపు కాదని పేర్కొన్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని సరి పరిస్థితి ఏర్పడిందన్నారు.