* కరోనా కట్టడి కోసం దేశ ప్రజలంతా ఈ నెల 22న (ఆదివారం) జనతా కర్ఫ్యూను సంయమనంతో పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటలకు వరకు బయటకు రాకుండా దీన్ని పాటిద్దామని పిలుపునిచ్చారు. జనం కోసం జనమే చేసుకున్న ఈ కర్ఫ్యూ కరోనాపై అతిపెద్ద యుద్ధమన్నారు. కరోనా నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించారు. జనతాకర్ఫ్యూను ఆచరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని కోరారు.
* కరోనా విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అంతర్జాతీయ, వాణిజ్య విమానాలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22 నుంచి వారంపాటు అంతర్జాతీయ, వాణిజ్య విమానాలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు అందరూ సూచనలు పాటించాలని కోరింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది.
* కరీంనగర్‌లో కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించినట్లు స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలను రద్దు చేశామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్వహించబోమని స్పష్టం చేశారు.
* కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని ఏపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని వ్యాపార సంస్థలు రక్షణ చర్యలు పాటించాలని ఆయన సూచించారు. ఈ మేరకు సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈనెల 31 వరకు థియేటర్లు, మాల్స్ బంద్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
* తిరుమల శ్రీవారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావం, ముందస్తు చర్యల్లో భాగంగా వారం పాటు దర్శనాన్ని నిలిపివేస్తున్నామని.. ఆ తర్వాత పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తులందరికీ దర్శనం చేసుకునే అవకాశం కల్పించి పంపిస్తామని స్పష్టం చేశారు.
* మధ్యప్రదేశ్‌లో బలపరీక్షకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే శుక్రవారం సాయంత్రం 5గంటలలోపు కమల్‌నాథ్ బలపరీక్షలో నెగ్గాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా.. కరోనా వైరస్ ప్రభావంతో అసెంబ్లీ సమావేశాలను మార్చి 26కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బలపరీక్ష కోసం అత్యవసర సమావేశం నిర్వహించాలని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం స్పీకర్‌ను కోరింది.
* కరోనా మహమ్మారి దేశంలో మరొకరి ప్రాణాన్ని బలితీసుకుంది. పంజాబ్‌కు చెందిన ఓ వృద్ధుడు (70) ఈ వైరస్ కారణంగా మరణించారు. దీంతో భారత్‌లో ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. 15 రోజుల క్రితం జర్మనీ నుంచి ఇటలీ మీదుగా స్వదేశానికి చేరుకున్న ఆయనకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ తేలింది.
* కరోనా వ్యాప్తిని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు సైతం రద్దు చేసి విద్యార్థులకు తర్వాతి తరగతి ఉన్నతి కల్పించాయి. కాగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ క్లిష్టకాలంలోనూ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
* కరోనా వ్యాప్తిని నియంత్రించే దిశగా కేంద్ర పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. లబ్దిదారులు ఆరు నెలలకు సరిపడా రేషన్ సరకులను ఒకేసారి తెచ్చుకునేందుకు వీలుగా అవకాశం కల్పించనుంది. ఈ విధానాన్ని పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. గరిష్ఠంగా రెండు నెలలకు మాత్రమే సరకులు తీసుకునేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. అయితే కరోనాను కట్టడి చేసే చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
* కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు పంజాబ్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రజారవాణాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 20 అర్ధరాత్రి నుంచి ఈ నిలిపివేత అమలులోకి వస్తుందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రజారవాణాను నిలిపివేయనున్న తొలి రాష్ట్రం పంజాబ్ కావడం విశేషం.