మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) ముమ్మరంగా సాగుతుండగా నరేంద్రనాథ్ అమెరికాలో అడుగుపెట్టారు. అప్పటికే ఆయన మలేసియ, ఇండొనేషియా, ఇండో చైనా, ఫిలిప్పైన్స్, జపాన్, కొరియా, చైనాలో పర్యటించి జర్మనీ నుండి ఆయుధాలు, డబ్బు సాధించడంలో కొంతవరకే ఫలితాలను రాబట్టి, నిరుత్సాహం చెందారు. జర్మనీవారి సలహాపై జర్మనీకి బయల్దేరారు. అందుకుగాను మరో అవతారం ఎత్తి, క్రైస్తవ మత అధ్యయనం చేయడానికి పారిస్ వెడుతున్నట్లుగా కృత్రిమ పాస్ పోర్ట్ సంపాదించి, ఫాదర్ మార్టిన్ పేరిట బయలుదేరాడు. 1916 మే 28న జపాన్‌లో యొకహోమా రేవులో, నిపన్ మారు ఓడ ఎక్కి రెండు వారాలు పర్యటించి 1916 జూన్ 15న అమెరికా పశ్చిమతీరాన శాన్ ఫ్రాన్సిస్కో రేవుకు చేరుకున్నారు. అంతవరకు మొదటి ప్రపంచయుద్ధాన్ని పట్టించుకోని అమెరికా అప్పుడే యుద్ధ విషయాలో శ్రద్ధబూనింది. బ్రిటన్‌కు అనుకూలంగా వున్నది. అటువంటి వాతావరణంలో ఫాదర్ సి. ఎ. మార్టిన్గా అమెరికాలో అడుగిడిన నరేంద్రనాథ్ బెల్ వ్యూ హోటల్లో వున్నారు. కానీ, ఆయనను ప్రశాంతంగా వుండనివ్వకుండా పత్రికలు భారత గూఢచారి వచ్చినట్లు రాశాయి. అది నరేంద్రనాథ్‌ని ఇబ్బంది పెట్టింది. హడావుడిగా హోటల్ గది ఖాళీ చేసి మరో చోటికి తరలి వెళ్ళారు. పశ్చిమ తీరాన స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నది. దానికి సమీపంలో ఫాలో ఆల్టోలో ఒక గది తీసుకుని నరేంద్రనాథ్ ఉన్నారు. తరువాత స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ధనగోపాల్ని కలిశారు. అప్పటికే కవిగా, రచయితగా, ఉపాధ్యాయుడుగా ధనగోపాల్కి పేరున్నది. అతను బెంగాల్ నుండి వచ్చాడు. అతని తమ్ముడు జాదూ ముఖర్జీ ఒక పరిచయ లేఖను నరేంద్రనాథ్ కు ఇచ్చాడు. బెంగాల్ విప్లవోద్యమంలో నరేంద్రనాథ్, జాదూ ముఖర్జీ కలిసి పనిచేసారు. అతడిచ్చిన లేఖ నరేంద్రనాథ్‌కు బాగా ఉపకరించింది. ధనగోపాల్ (1890-1936) నరేంద్రనాథ్‌ను ఆహ్వానించి, ప్రోత్సహించి తగిన సహాయం చేయడానికి సంసిద్ధుడయ్యాడు. ధన గోపాల్ ఆనాడు ఎథెల్ రే డ్యుగాన్ను ప్రేమిస్తున్నాడు. ఆమె ఒక మేథావి విద్యార్థి. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయ్యింది. ఆమెకు స్నేహితురాలిగా మరొక మేథావి విద్యార్థిని ఎవిలిన్ ట్రెంట్ వున్నది. ఆమె కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నది. అలాంటి దశలో ధనగోపాల్ తనకు బాగా తెలిసిన ఎవిలిన్‌ను నరేంద్రనాథ్‌కు పరిచయం చేశాడు. వారి తొలి పరిచయం బాగా స్నేహంగా మారి ఉత్తరోత్తర పెళ్ళికి దారితీసింది. నరేంద్రనాథ్ జీవితంలో అదొక పెద్ద మలుపు.
నరేంద్రనాథ్‌ను పేరు మార్చుకోమని, మానవేంద్రనాథ్ అని పిలుచుకోమని ధనగోపాల్ సలహా ఇచ్చాడు. ఆ విధంగా అమెరికాలో మానవేంద్రనాథ్ రాయ్ ఆవిర్భవించాడు. ఆ పేరే స్థిరపడింది. సుప్రసిద్ధంగా మారింది.
అయితే పాలో అల్టో వుంటున్న రాయ్‌కి జీవితం సాఫీగా సాగలేదు. గూఢచారులు కన్నేసి వుంచారు. భారత విప్లవకారులు నరేంద్రనాథ్‌ను తరచు కలుస్తూ వుండేవారు. నరేంద్రనాథ్ అద్దెకుంటున్న ఇల్లు వచ్చేపోయేవారితో సందడిగానే వుండేది. ఎస్.పి.సర్కార్ అనే విప్లవవాది కూడా రాయ్‌తో వుండేవాడు. జపాన్ వ్యాపార సంస్థకు శాఖగా చిన్న కంపెనీని నడుపుతున్నట్లు పేర్కొనేవాడు. రాయ్‌కు ఇంగ్లండ్ నుండి కూడా చాలా వుత్తరాలు వస్తుండేవి. రాయ్ ఇంటి యజమానురాలి కుమారుడు పోలీసు అధికారి. ఉత్తరోత్తర ఇల్లు సోదా చేయటానికి పోలీసు వచ్చినపుడు ఈ విషయాలన్నీ బయటికి తెలిశాయి. గదర్ పార్టీ విప్లవకారులు రాయ్‌ను కలిసినవారిలో ఉన్నారు.
ఎమ్.ఎన్.రాయ్, ఎవిలిన్ ట్రెంట్ పరస్పరం ఇష్టపడ్డారు. పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు. రాయ్ తన ఉద్దేశాలు చెప్పి యూరోప్‌కు వెళ్ళవసి వుంటుందని ఆమెకు తెలియపరిచారు. తదనుగుణంగా పాస్ పోర్ట్ కూడా ఆమె సేకరించింది. యూరోప్‌కు పాస్ పోర్టు ఇవ్వడం అమెరికా బాగా అదుపు చేస్తున్న రోజులవి. అయితే స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యక్షుడు డేవిడ్ స్టార్ జోర్డన్ పరిచయ పత్రం వల్ల ఎవిలిన్‌కు పాస్ పోర్టు రావటం సులభం అయింది. ఆ రోజుల్లో ఎవిలిన్ తల్లిదండ్రులు లాస్ ఏంజెలస్‌లో వుంటుండేవారు. రాయ్, ఎవిలిన్ లు వెళ్ళి తమ వ్యవహారం తెలియపరిచి పెళ్ళి చేసుకోవడం గురించి చెప్పారు. తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన ఎవిలిన్ సోదరుడు వాల్టర్ ఎడ్విన్ కూడా వారి వివాహానికి వ్యతిరేకత కనబరిచాడు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డేవిడ్ జోర్డన్ స్టార్ దగ్గరకు వెళ్ళి తమ విషయం తెలియపరిచి సహాయం కోరారు. తాము మెక్సికో వెళ్ళదలచామని చెప్పారు. అతను మెక్సికో గవర్నర్‌కు పరిచయ లేఖ ఇచ్చాడు. ఉత్తరోత్తర ఆ లేఖ మెక్సికోలో వారికి బాగా ఉపకరించింది.
శాన్ ఫ్రాన్సిస్కో వదలి రాయ్ – ఎవిలిన్లు న్యూయార్క్ వెళ్ళారు. అక్కడ ఎవిలిన్ సోదరుడు ఎడ్విన్ వున్నాడు. అతను ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అప్పటికే బ్రిటిష్ గూఢచారులు, రాయ్‌ని వెంటాడుతూ వున్నారు. సరైన పత్రాలు లేకుండానే రాయ్ అమెరికాలో ప్రవేశించాడని అమెరికా గూఢచారులు తనిఖీ పెట్టారు. అందువలన నరేంద్రనాథ్ ఎప్పటికప్పుడు అడ్రస్ మారుస్తూ వివిధ ప్రాంతాలో గడపవలసి వచ్చింది. మరొక భారత విప్లవ కారుడు శైలేన్ ఘోష్ ఎప్పటికప్పుడు రాయ్ నుండి డబ్బు కావాని ఒత్తిడి చేస్తుండేవాడు. రాయ్ అతికష్టం మీద అతనికి కొద్దిపాటి డబ్బు పంపగలిగాడు. న్యూయార్క్‌లో 1117, డాలీ అవెన్యూలోను, 239 ఇల్లు, 19వ వీధిలోను, 19 వెస్ట్ 44వ వీధిలో రాయ్, ఎవిలిన్ లు వున్నారు. 672, ఎనిమిదవ అవెన్యూలో వున్న సిలోన్ రెస్టారెంట్‌ను ఉత్తరాలు అందుకోవడానికి అడ్రస్‌గా పేర్కొన్నారు. ఆవిధంగా న్యూయార్క్‌లో అటు వుండటానికి, ఇటు ఆర్ధికంగానూ సతమతమయ్యారు. అటువంటి పరిస్థితులో వారికి పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ చేయూతనిచ్చారు. తన పనులు కొన్ని ఎవిలిన్‌కు అప్పగించి అవి చేసిపెట్టినందుకు డబ్బిచ్చేవాడు. లజపతి రాయ్ మొదటి ప్రపంచ యుద్ధకాల మంతటా న్యూయార్క్‌లో వున్నారు. ఆయన పంజాబు నుండి వచ్చిన భారత విప్లవకారుడు. గదర్ పార్టీ స్థాపకులలో వున్నారు. కాంగ్రెసు పార్టీలో ప్రముఖపాత్ర వహించారు. లాల్, పాల్, బాల్ అని కాంగ్రెసులో ముగ్గురు ప్రముఖులను కలిపి కీర్తిస్తుండేవారు. ఆయన్ను పంజాబు కేసరి అనేవారు. సైమన్ కమిషన్‌కు నిరసన తెలియపరచినపుడు జరిగిన లాఠీ ఛార్జీలో తీవ్ర దెబ్బకు గురయి తరువాత చనిపోయారు. న్యూయార్క్‌లో భారత్‌కు అనుకూలంగా ఉపన్యాసాలిస్తుండేవాడు. ఒక్కొక్కసారి ఉపన్యాసం అనంతరం ఎమ్.ఎన్.రాయ్ కూడా తన సందేహాలు వెలిబుచ్చుతూ ప్రశ్నలు వేసేవాడు. ఇండియాలో తెల్లవారి పాలన పోయి నల్లవారి పాలన వస్తే సామాన్య ప్రజల జీవితం ఎలా బాగుపడుతుందనే చిక్కు ప్రశ్నలు వేస్తుండేవాడు.
నరేంద్రనాథ్ న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి అధ్యయనం చేస్తూ ఉండేవాడు. అప్పుడే తొలిసారి మార్క్సిజం చదివారు. భారత విప్లవకారులపై జర్మనీ ఏజెంట్ల పేరిట గూఢచారులు వెంటబడుతూ వచ్చారు.
జపతిరాయ్ ఎవిలిన్‌ను ఎమ్.ఎన్.రాయ్‌ను ఇష్టపడి ఆదరించారు. అతని కోరికపై నరేంద్రనాథ్ ఒకసారి రసగుల్లా చేసి పెడితే జపతిరాయ్ తిని చిన్నప్లివాడి వలె గంతులేశారు. ఆ రోజుల్లో పంజాబీ స్వీట్లు న్యూయార్క్‌లో లభించేవి కాదు. కాచిన పాలు యాసిడ్ వేసి విరిచి ఎమ్.ఎన్. రాయ్ రసగుల్లా చేసి పెట్టాడు. ఈలోగా న్యూయార్క్‌లో వున్న కొందరు భారత విప్లవకారులను ఎమ్.ఎన్.రాయ్ కలుసుకున్నాడు. గుప్తా అనే అతను జపాన్ లోనే రాయ్‌కి పరిచయమయి అమెరికాలో చక్రవర్తి, మరికొందరు విప్లవకారుల గురించి చెప్పాడు. న్యూయార్క్‌లో మరొక భారత విప్లవకారుడు వసంత కుమార్ రావ్‌ను కూడా ఎమ్ ఎన్.రాయ్ కలిశాడు. న్యూయార్క్‌లో వున్న రామకృష్ణ వివేకానంద వసతి గృహంలో కూడా కొన్నాళ్ళున్నాడు. ఇప్పటికే న్యూయార్క్‌లో వున్న భారత విప్లవకారులలో ఈర్ష్య అసూయలు ద్వేషాలు పరస్పర ఆరోపణలు విపరీతంగా వుండేవి. డా॥చక్రవర్తి అనే మరో విప్లవకారుడు గొడవల్లోనే న్యూయార్క్‌లో చిక్కుకున్నాడు. అతను మార్మికంగా నివసించేవాడు. మొత్తం మీద న్యూయార్క్‌లో ఉన్న భారత విప్లవకాయి పరస్పరం ద్వేషారోపణతో ఉన్నట్లు రాయ్ గ్రహించాడు. వీరందరికీ బెర్లిన్ కమిటీతో సంబంధాలున్నాయి.
ఒకనాడు కొలంబియా యూనివర్సిటీలో లజపతిరాయ్ ప్రసంగం విని బయటికి వస్తుండగా ఆరుగురు గూఢచారి పోలీసు దళం రాయ్‌ను పట్టుకుని, పద అంటూ నెట్టి వేన్లోకి ఎక్కించారు. ఒక భవనం దగ్గరకు తీసుకెళ్ళి అనేక వరండాలు తిప్పి అక్కడున్న పోలీసులకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. నేరస్థులను కోర్టులో హాజరుపరిచేముందు వారిచేత కొన్ని కీలక విషయాలు తెసుకోవడానికి ఇలా ముందుగా విచారణ జరపటం ఒక పద్ధతి. ఇది చట్టబద్ధం కాదు. అయినా ఆ పద్ధతినే అనుసరిస్తూ వుంటారు. అక్కడున్న విచారణాధికారి రాయ్‌ను నానావిధాల ప్రశ్నలు వేశాడు. అమెరికా స్వేచ్ఛా దేశం అని, పీడిత పాలితులకు అండగా నిలుస్తుందని భావించారని రాయ్ చెప్పాడు. తాను త్వరలోనే దేశం వదిలి వెళ్ళిపోతానన్నాడు. అప్పటికే రాత్రి చాలా పొద్దుపోయింది. విచారణాధికారి ఏమనుకున్నాడో గానీ రాయ్ దగ్గరకు వచ్చి ఇప్పటికి వెళ్ళిపో, రేపు కోర్టులో హాజరయి విషయం చెప్పమని అన్నాడు. రాయ్ ఆ విధంగా బయటపడి మర్నాడు ఉదయం 10 గంటలకి కోర్టుకి వెళ్ళాడు. అక్కడ కాసేపు విచారణ జరిపిన తర్వాత మేజిస్ట్రేటు కేసు వాయిదా వేస్తూ మరోసారి త్వరలో పిలుస్తామని, పారిపోవటానికి ప్రయత్నించవద్దని వదిలేశాడు. రాయ్ అలా బయటపడి ఎవిలిన్‌ను కలిసి మెక్సికో తీరానికి వెళ్ళే రైలు ఏదో కనుక్కుని టిక్కెట్లు కొని బయలుదేరాడు. టెక్సాస్ రాష్ట్రంలో వున్న శాన్ ఆంటోనియో పట్టణంలో దిగి మెక్సికోలో ప్రవేశించాడు. ఆ పట్టణం మెక్సికో సరిహద్దుల్లో ఉన్నది.
అమెరికా వదిలి వెళ్ళిపో బోయేముందు న్యూయార్క్‌లో మేరేజ్ రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్ళి రాయ్ – ఎవిలిన్ లు పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళి పత్రాన్ని దగ్గర పెట్టుకుని పయనించారు. మెక్సికోకు వెళ్ళిన రాయ్ దంపతులు అనూహ్యంగా మారిపోయారు. చరిత్ర మలుపు తిప్పారు. – Innaiah Narisett.
అమెరికాలో M.N.Roy(1915-17)-Part 3
Related tags :