తల్లిదండ్రుల ప్రేమకు పూర్తి స్థాయిలో నోచుకోవడం లేదు. బంధువులు, స్నేహితుల పలకరింపులు అసలే లేవు. తోటి స్నేహితులతో కలిసి ఆడుకోవాలనుకుంటారు.. కానీ ఆ అదృష్టం వారికి లేదు. ఒకరికొకరు కలిసి నడిస్తేనే ఎక్కడికైనా వెళ్లేది. వారే అవిభక్త కవలలు వీణావాణీలు. ఈ కవలలిద్దరూ ఈరోజు పదోతరగతి పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్ మధురానగర్‌లోని ప్రతిభా హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి అరగంట ముందే వీణావాణీలు చేరుకున్నారు. యూసఫ్‌గూడలోని స్టేట్ హోం నుంచి సూపరింటెండెంట్ సఫియా ప్రత్యేక అంబులెన్స్‌లో కవలలిద్దరినీ పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అక్కడికి చేరుకొని వీణావాణీలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. వారిద్దరూ ఈ దఫా ఆంగ్ల మాధ్యమంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. వీరిద్దరికీ బోర్డు వేర్వేరుగా హాల్ టికెట్లు కేటాయించింది. సాధారణ విద్యార్థుల కంటే వీణావాణీలకు అరగంట సమయం ఎక్కువగా కేటాయించారు. ఇద్దరూ ఒకే సారి పరీక్ష రాయడానికి వీలులేకపోవడంతో స్టేట్ హోం అధికారులు వీరికి ఇద్దరు సహాయకులను కూడా కేటాయించారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వీణావాణీలు మాస్క్‌లతో పరీక్షకు హాజరయ్యారు. అలాగే ఈ కేంద్రంలో పరీక్ష రాస్తు్న్న మిగతా విద్యార్థులు సైతం మాస్క్‌లు, వాటర్ బాటిళ్లు, శానిటైజర్లతో కేంద్రాల వద్దకు చేరుకున్నారు.
వీణావాణీ గుర్తున్నారా? పది పరీక్షలు రాస్తున్నారు.
Related tags :