నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు కావడంతో దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది.
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు వెనుక కఠోర శ్రమ పడింది మాత్రం ఇద్దరే.
ఆ ఇద్దరు ఎవరంటే.. ఒకరు నిర్భయ తల్లి అయితే, మరొకరు నిర్భయ తరపున వాదించిన న్యాయవాది.
నలుగురు దోషులకు ఉరి పడడంతో తల్లి ఆశాదేవీ, న్యాయవాది సీమా కుష్వాహా సంతోషం వ్యక్తం చేశారు.
సీమాకు ఇదే మొదటి కేసు. ఆమె వాదించిన తొలి కేసులోనే విజయం సాధించింది.
అది కూడా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో విజయం సాధిస్తే ఆ సంతోషం వేరే.
మరి సీమా ఈ కేసును ఎందుకు వాదించాల్సి వచ్చిందంటే.. తాను ఒక ఆడబిడ్డనే. చదువుతున్నది కూడా న్యాయ విద్యనే.
అందుకే సాటి యువతికి జరిగిన అన్యాయంపై న్యాయంగా పోరాటం చేయాలని నిర్ణయించుకుంది.
మరో ఆలోచన లేకుండా నిర్భయ కేసులో తొలిసారిగా కోర్టు మెట్లెక్కింది.
కింది కోర్టు నుంచి మొదలుకొంటే సుప్రీంకోర్టు వరకు ఆమె తన వాదనను వినిపించి నిర్భయ ఆత్మకు శాంతి చేకూర్చింది.
ఈ కేసులో నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడిన అనంతరం ఆశాదేవీ మొదటి థ్యాంక్స్.. లాయర్ సీమాకే చెప్పింది.
సీమా వల్లే దోషులకు ఉరిశిక్ష అమలు సాధ్యమైందని ఆశాదేవీ తెలిపింది.
2012, డిసెంబర్ 16న రాత్రి నిర్భయపై ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్ 29న నిర్భయ మృతి చెందారు.
దీంతో ఢిల్లీతో పాటు మిగతా రాష్ర్టాల్లో నిరసనలు వెలువెత్తాయి.
రాష్ర్టపతి భవన్ వద్ద చోటు చేసుకున్న నిరసన ప్రదర్శనల్లో సీమా పాల్గొన్నది. నిందితులకు ఉరిశిక్ష విధించాలని సీమా గళమెత్తింది.
ఈ కేసు విచారణ జరుగుతున్న తొలి రోజుల్లో సీమా.. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించి.. కోర్టులో ట్రైనీగా పని చేస్తున్నారు.
2014లో ఈ కేసులో సీమా చేరింది. నాటి నుంచి నేటి వరకు ఈ కేసులో న్యాయం కోసం పోరాడింది సీమా.
ఈ కేసును వాదించేందుకు సీమా ఒక్క రూపాయి కూడా ఆశాదేవీ నుంచి ఆశించలేదు. కేసును పూర్తిగా ఉచితంగా వాదించింది.
అత్యాచార బాధితుల కోసం ఏర్పాటైన జ్యోతి లీగల్ ట్రస్టులో 2014లో సీమా చేరింది.
ఐఏఎస్ కావాలనే కోరిక సీమాకు బలంగా ఉంది.
యూపీఎస్సీ పరీక్ష కోసం సిద్ధమవుతున్నట్లు ఓ టీవీ ఇంటర్వ్యూలో సీమా చెప్పింది.