DailyDose

BSNL ఉచిత సేవలు-వాణిజ్యం

Telugu Business News Roundup Today-BSNL To Offer One Month Free Broadband

* దాదాపు నాలుగు రోజుల పతనాల తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 1,627.73 పాయింట్లు లాభపడి 29,915 వద్ద ముగిసింది. నిఫ్టీ 482 పాయింట్లు లాభపడి 8,745.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.04 వద్ద కొనసాగుతోంది. కొవిడ్ -‌19కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు చేపట్టడం, టెక్నికల్‌ సపోర్ట్‌, అమెరికా మార్కెట్లు సానుకూలంగా ఉండటం వంటి కారణాలతో సూచీలు ర్యాలీ తీశాయి. నేటి మార్కెట్లో మదుపరుల సంపద రూ.5లక్షల కోట్లకు పైగా పెరిగింది. నిఫ్టీలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ, గెయిల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడ్డాయి. యెస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నేలచూపులు చూశాయి.

* దేశంలోని 50శాతం కంపెనీల కార్యకలాపాలపై కరోనావైరస్‌ ప్రభావం పడుతుందని, 80శాతం కంపెనీల ఆదాయం తగ్గే అవకాశం ఉందని ఫిక్కీ నిర్వహించిన ఒక సర్వే చెబుతోంది. ఈ విశ్వవ్యాప్త సాంక్రమిక వ్యాధి కారణంగా ఆర్థిక వ్యవస్థ, డిమాండ్‌, పంపిణీ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బ తింటాయని పేర్కొంది. ఇప్పటికే ఆర్థిక మందగమన ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తోంది. మూడో త్రైమాసికంలో 4.7శాతం మాత్రమే వృద్ధిరేటు కనిపిస్తోంది.

* కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఉద్యోగులు ఇంటినుంచే పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అత్యవసర సేవలు తప్ప ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలూ ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సూచించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ దీనిని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంది. కొత్తగా కనెక్షన్లు తీసుకొనే వినియోగదారులకు ఒక నెల ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందజేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ల్యాండ్‌లైన్‌ వినియోగదారులు, కొత్త వినియోగదారులు రాగి తీగల (కాపర్‌ కేబుల్) కనెక్షన్‌ తీసుకుంటే కనీసం ఇన్‌స్టలేషన్‌ రుసుములూ వసూలు చేయబోమని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. మోడెమ్‌ మాత్రం కొనుగోలు చేయాలని సూచించింది. ‘ప్రస్తుతం ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ ఉన్నవారు, కొత్తగా కనెక్షన్‌ తీసుకోవాలనుకునే వారికి ఒకనెల ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తాం. దేశవ్యాప్తంగా దీనిని అమలు చేస్తున్నాం. ఈ పథకంతో బయటకు రాకుండా ఇంటివద్ద నుంచే వారు పనిచేసుకోవచ్చు’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ (పీఎఫ్‌ఏ) వివేక్‌ బంజాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

* మహమ్మారి కరోనావైరస్‌ ప్రభావంతో ఎయిర్‌ కెనడా 5,000 మంది సిబ్బందిని తాత్కాలికంగా పనుల నుంచి తొలగించింది. ఏప్రిల్‌ 30 వరకూ లేఆఫ్స్‌ అమల్లో ఉంటాయని ఎయిర్‌ కెనడా పేర్కొంది. కాగా, పెద్దసంఖ్యలో ఎయిర్‌ కెనడా ఉద్యోగులను తొలగించడం విచారకరమని కెనడా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (సీయూపీఈ) ఆందోళన వ్యక్తం చేసింది. యూనియన్లతో చర్చించే ఉద్యోగులను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్టు కంపెనీ పేర్కొంది.