* ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న మురికిగుంట కాలువలో పడిన ఘటన శుక్రవారం రామిరెడ్డిపేట వద్ద చోటు చేసుకుంది. మిరపకాయల పని కోసం వెళుతున్న కూలీల ట్రాక్టర్ రాజుపాలెం మండలం రామిరెడ్డి పేట వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న మురికిగుంట కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న కొంతమంది కూలీలకు గాయాలయ్యాయి. కూలీలందరూ నకరికల్లు మండలం త్రిపురపురం గ్రామానికి చెందినవారుగా సమాచారం.
* హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈ రోజు కొనసాగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న విశ్రాంత అధికారులు మన్మోహన్‌సింగ్, రాజగోపాల్ విచారణకు హాజరయ్యారు. వారిని విచారించిన అనంతరం ఈ కేసు వాయిదా పడింది. తదుపరి విచారణను ఏప్రిల్ 9న చేపడతామని సీబీఐ, ఈడీ కోర్టు తెలిపింది. ఈ కేసులో మరికొందరు నిందితులైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు శ్యామ్ ప్రసాద్ ఇటీవల జరిగిన విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
* నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలైన విషయం తెలిసిందే. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. న్యాయం జరిగింది. మహిళలకు గౌరవ స్థానాన్ని, రక్షణను కల్పించడంలో భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. మన నారీ శక్తి ప్రతి రంగంలోనూ ప్రతిభ కనబర్చుతోంది. మహిళల సాధికారతపై దృష్టి పెట్టి, సమానత్వం, సమాన అవకాశాలు కల్పించే దిశగా దేశం ముందుకు వెళ్లాల్సి ఉంది అని పేర్కొన్నారు. ఉరి అమలుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ… క్రూరమైన నేరానికి పాల్పడిన అందరు నేరస్తులకు కఠిన శిక్ష పడింది. ఈ శిక్ష మరింత త్వరగా పడితే బాగుండేది అని తెలిపారు. దోషులకు శిక్షపడడం పట్ల నిర్భయ తల్లి ఆశా దేవి కూడా హర్షం వ్యక్తం చేసింది.
* కుక్కల దాడిలో 10 గొర్రెలు మృతి చెందిన ఘటన శుక్రవారం గురవాం గ్రామంలో చోటు చేసుకుంది. రాజాం మండలం గురువారం గ్రామంలో కొయ్యాన రాజారావు కి చెందిన గొర్రెలు కళ్ళం లో ఉండగా, పది గొర్రెలపై కుక్కలు విరుచుకుపడ్డాయి. కుక్కల దాడిలో 10 గొర్రెలు మృతి చెందాయి.