వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాలు అందించిన సమాచారం మేరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 27 నుంచి నిర్వహించాలని భావిస్తోంది ప్రభుత్వం. అయితే కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా సమావేశాలను రెండు లేదంటే మూడు రోజులు మాత్రమే నిర్వహించాలని యోచిస్తోంది. 28 లేదా 29న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేలా కసరత్తు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల వ్యయాల నిమిత్తం అసెంబ్లీ అనుమతి పొందేందుకు గాను ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
దీనికి సంబంధించి ఇవాళో, రేపో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఈనెల 31 లోపే బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. ఎన్నికలు రావడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఈనెల 29 న ఆమోదించాలని ముందుగా నిర్ణయించుకున్నా ఎన్నికలు వాయిదా పడటంతో సమావేశాలకు కూడా అడ్డు లేకుండా పోయింది. అయితే ఈ క్రమంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అనుకున్నా ఆంక్షలతో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో జీతాలు, ఇతర ఖర్చుల నిమిత్తం మార్చి 31 లోపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఈలోపే బడ్జెట్ ఆమోదించకపోయినట్టయితే సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
ఇదిలావుంటే ఈనెల 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక సోమవారం (మార్చి 23న) వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షసమావేశం కావాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలో పోలింగ్, అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు. అదే రోజు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ కూడా నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ మాక్ పోలింగ్ లో వైఎస్సార్‌సీపీ నలుగురు అభ్యర్థుల్లో ఎవరెవరికి ఏయే ఎమ్మెల్యే ఓటు వేయాలి అనే అంశంపై టీమ్‌లుగా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తారు. నలుగురు అభ్యర్థుల్లో ముగ్గురికి 38 మంది చొప్పున ఎమ్మెల్యేలు. నాలుగో అభ్యర్థికి 37మంది ఓటేసేలా వ్యూహం సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది.
27 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Related tags :