* కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వ్యక్తులను హోం క్వారంటైన్ చేస్తూ ప్రభుత్వ సిబ్బంది ముద్రలు వేయడం ప్రారంభించారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలో చేతి వేలిపై సిరా చుక్క వేసేందుకు ఉపయోగించే ఇంకుతో రూపొందించిన స్టాంప్‌ను చేతి మడమపై కనిపించే విధంగా వేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన తేదీ నుంచి 14 రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాలని, అన్ని రోజులను లెక్కించి స్టాంపులో తేదీని సరిచేసి వేస్తున్నారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే 13 వేల మంది వరకు విదేశాల నుంచి వచ్చారని సమాచారం. వారందరి పాస్‌పోర్ట్ అడ్రస్‌లతో ఇళ్లకు వెళ్లి ముద్రలు వేస్తున్నారు.
* కరోనా వైరస్‌తో మానవ జాతి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోందని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి రాలేదని పేర్కొన్నారు. స్వీయ నియంత్రణ పాటించి, దేశాలు, జాతులు దీన్ని ఎదుర్కోవాలన్నారు. కరోనా వైరస్ తీవ్రతను తెలుపుతూ కవిత రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ‘కరోనా వైరస్.. కర్కశ వైరస్’ అంటూ ఆయనో కవిత రాశారు. పాశ్చాత్య పోకడలు పోకుండా మన దేశంలోని ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు.
* కరోనా విజృంభణతో మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమవుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. తాజాగా 11 కరోనా కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైరస్ బాధితుల సంఖ్య 63కు చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో ఎనిమిది మంది విదేశీ ప్రయాణం చేయగా.. మిగిలిన వారికి ఇతరుల నుంచి సోకిందని వైద్యులు ప్రకటించారు. మహారాష్ట్రలో కరోనా స్టేజ్3 దిశగా పయనిస్తోందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ఆయన తెలిపారు.
* కరోనా విషయంలో ఆయా మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మాస్కులు అందరూ ధరించాల్సిన అవసరం లేదని, సామాజిక దూరం పాటిస్తే సరిపోతుందని తెలిపింది. నేటి నుంచి 111 ల్యాబ్‌లు దేశవ్యాప్తంగా పనిచేయనున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరించారు. ఈ మేరకు దిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల అవసరాల మేరకు ల్యాబ్‌లను పెంచడంపై పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని అగర్వాల్ అన్నారు.
* మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం మొదలవుతుంది. 15 రోజులు ఈ వేడుకలు కొనసాగుతాయి. దేశమంతా సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా కోలాహలమే కనిపిస్తుంది. నింగిలోని చుక్కలన్నీ ఆ వీధుల్లోని తీగలకు వేలాడుతున్నాయా అనిపిస్తుంది. పిల్లలు, పెద్దలు కొత్త బట్టలు తీసుకుంటారు. మార్కెట్లన్నీ కొనుగోళ్లతో కళకళలాడుతుంటాయి. సంబరాలు అంబరాన్నంటుతాయి. వంద కోట్లకు పైగా ప్రజలు కొనుగోళ్లు చేయడంతో వేల కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఎక్కడ చూసినా సందడే సందడి. కానీ ఒక్క సూక్ష్మ క్రిమి ‘కరోనా’తో అన్నీ భగ్నమయ్యాయి. మనుషులు బయటకు వెళ్లాలంటేనే భయపడే స్థితి. ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో?ఎవరితో చేయి కలిపితే ఏం అంటుకుంటుందో?
* కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని, ఆ చర్యలు విజయవంతం కావాలంటే ప్రజల సహకారం కూడా అవసరమని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నామన్నారు. ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు ఈ కర్ఫ్యూ ఉపయోగపడుతుందని, నిర్దేశించిన సమయంలో భాగస్వాములు కావడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని నాని అన్నారు.
* నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ పోరాడిన రీతిలో కరోనా వైరస్‌పై యావత్ భారత్ పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం కోసం ఆదివారం జనతా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని మోదీ కోరారు. దీన్ని స్వాగతిస్తూ భారత క్రికెటర్లు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో తమ మద్దతు తెలుపుతున్నారు.
* చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లె సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వాటిలో ఓ మృతదేహం మహిళది కాగా.. మిగిలిన మూడు మృతదేహాలు పదేళ్లలోపు చిన్నారులవి. మృతదేహాలను గుర్తించిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తుతెలియని మృతదేహాలను పోలీసులు బావిలో నుంచి బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను స్థానికేతరులని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లీ పిల్లలుగా పోలీసులు భావిస్తున్నారు.
* ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు సినీ ప్రముఖులు ఎస్.ఎస్.రాజమౌళి, ఎన్టీఆర్, రాజశేఖర్, బోయపాటి శ్రీను తదితరులు మద్దతు తెలిపారు. అంతేకాదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోషల్‌మీడియా వేదికగా అభిమానులను, ప్రజలను కోరారు. ‘ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా ప్రతి భారతీయుడు ఇంటిలోనే ఉండాలని, బయటికి రాకూడదని కోరుతున్నా. ఐకమత్యంగా కరోనా వైరస్‌పై పోరాడుదాం’ అని రాజమౌళి ట్వీట్ చేశారు. ‘కొవిడ్-19ని జయించాలంటే మనవంతు కృషి చేయాలి. రేపు జరిగే ‘జనతా కర్ఫ్యూ’ని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
* కరోనాను కట్టడి చేసేందుకు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు సంస్థలు అనుమతి ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఓ సరికొత్త ‘వర్క్ ఫ్రం హోమ్’ ఆఫర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటా వినియోగించుకోవచ్చు. కాలపరిమితి 51 రోజులు. ధరను రూ.251గా నిర్ణయించింది. అపరిమిత డేటాను వినియోగించుకున్న తర్వాత 64 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను పొందొచ్చు.
* ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు రేపు ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం చర్యలు మరింత వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు. విదేశాల నుంచి వస్తున్న వారిలోనే కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు. అవసరమైతే ప్రజలు స్వీయనిర్బంధంలోకి వెళ్లాలన్నారు.