రెండు చేతులు కలిసి చప్పట్లుగా మోగుతాయి… అవే రెండు చేతులు కలిసి వినయంగా నమస్కరిస్తాయి. సనాతన సంప్రదాయంలో నమస్కారం అనే సంస్కారానికి చాలా ప్రాధాన్యముంది.నమః అనే సంస్కృత ధాతువు నుంచి నమస్కారం పుట్టింది. సాత్త్విక గుణానికి అదో చిహ్నం. గౌరవ సూచకంగా మనం పెట్టే ఈ నమస్కారంలో ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది. ఈ చేతులు జోడించడం యథాలాపమైన ప్రక్రియ కాదు మనలోని అహంకారాన్ని నిర్మూలించి అణకువను పెంచే ఓ విశిష్ట ముద్ర. నీలో, నాలో ఉన్న ఆత్మ ఒక్కటే అన్న సత్యానికి ఇదో ప్రతీకాత్మక చిహ్నం. మనలో ద్వైదీ భావనలను తొలగించుకుంటూ మనసును సమస్థితిలో ఉంచుకోవాలన్న అద్వైత బోధను నమస్కారం సూచిస్తుంది.భౌతికమైన స్పర్శ లేకుండా జరిగే ఈ ఆదానప్రధాన చర్య వల్ల ఒకరిలోని సానుకూల శక్తి, మరొకరికి ప్రసారమవుతుందని చెబుతారు.పంచభూతాత్మకమైన శరీరంలోని ఆకాశ, పృథ్వీతత్త్వాలను ఏకం చేస్తున్నట్లు సూచించే ముద్ర ‘నమస్కారం’. ఈ ముద్ర మనిషిలోని సానుకూల దృక్పథాన్ని జాగృతం చేస్తుంది. విద్యుదయస్కాంత ఘటాన్ని పోలిన మన శరీరంలో ధన, రుణ ధృవాలు కలవడంలాంటిది నమస్కారం. చూపుడు వేలు జీవాత్మ, బొటన వేలు పరమాత్మకు ప్రతీకలు. చిటికెన వేలిని తమస్సుకు, ఉంగరపు వేలిని రజస్సుకు, మధ్యవేలిని సత్త్వగుణాలకు ప్రతీకలుగా చెబుతారు. వాటిని కలుపుతూ ఉంచే ఈ ప్రక్రియతో మనిషిలోని దివ్యచైతన్యం జాగృతమవుతుందని చెబుతారు.
నమస్కారం…ఓ దివ్యచైతన్యం
Related tags :