ScienceAndTech

పారాసెట్‌మాల్‌తో కేరళ వైద్యుల ఘనత

Kerala Doctors Treating COVID19 Patients With Paracetmol Effectively

దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకూ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన ఈ మహ్మమారి.. 11 వేలమందికి పైగా ప్రజలను బలితీసుకుంది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌కు విరుగుడును కనిపెట్టేందుకు ప్రపంచ దేశాల అధినేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఎంతటి రోగానైనా ఆయుర్వేదంతో అడ్డుకట్టే కేరళ కరోనాను నివారించడంలోనూ కొంతమేర విజయం సాధిస్తోంది. ఈసారి ఆయుర్వేద వైద్యం కాకుండా కరోనాపై పారాసిట్‌మాల్‌తో యుద్ధం చేసి.. మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. భారత్‌లో నమోదైన తొలి మూడు కేసులూ కేరళ రాష్ట్రంలోనే నమోదైన విషయం తెలిసిందే. అయితే చైనా అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బాధితులుపై పారాసిట్‌మాల్‌ను ప్రయోగించినట్లు కేరళ వైద్యులు తెలిపారు. తొలుత వైరస్‌ బారిన పడిన వారు తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారని, వారందరికీ దగ్గు మందుతో కలిపి పారాసిట్‌మాల్‌ వాడినట్లు డాక్టర్‌ అమర్‌ఫ్టెట్లే వెల్లడించారు. 4 రోజుల పాటు ఇవే మందులను వాడామని, వైరస్‌ పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. మరోవైపు కేరళలో కరోనా బాధితుల సంఖ్య 40 చేరిందని, వారిందరికీ కూడా పారాసిట్‌మాల్‌ వాడుతున్నామని చెప్పారు. అయితే ప్రపంచంలోనే కాక భారత్‌లోనూ ఇప్పటి వరకు కరోనాకు సరైన వాక్సిన్‌ కనిపెట్టకపోవడంతో.. పలు రాష్ట్రాలు కూడా కేరళ బాటలోనే నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ప్రఖ్యాత రాంమనోహర్‌ లోహియా వైద్యులు కూడా కేరళ వైద్యులను సంప్రదించి.. సలహాలు, సూచనలు తీసుకున్నారు. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా వైద్యులు తయారుచేస్తున్న వాక్సిన్‌ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.