Movies

ఎన్‌టీఆర్ ఏఎన్నార్ స్థాయి నటుడు…కాంతారావు-TNI కథనం

Remembering TL Kantha Rao The Veteran Actor

ఎన్టీరామారావు, నాగేశ్వరరావు తిరుగులేని హీరోలుగా వెలుగుతున్న కాలంలో వారితో సమానమైన స్థాయి హీరోగా నిలబడిన ఏకైక నటుడు కాంతారావు. నల్లగొండ జిల్లా గుదిబండ గ్రామంలో 1923 లో జన్మించిన కాంతారావు పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు.

ఆయన తన గ్రామ మునసబుగా వున్న రోజుల్లో వారి గ్రామానికి సురభి నాటక సమాజం వారు రావడం జరిగింది. మునసబు హోదాలో కాంతారావు గారికి ఆ ప్రదర్శనలకు ఆహ్వానం అందింది. ఆ నాటకాలను చూసాక ఆయనలోని నటుడు నిద్ర లేచాడు. వారితో బాటు తిరుగుతూ వివిధ నాటకాల్లో నటించారు. ఆ అనుభవమే సినిమాలలో తనకు బాగా ఉపయోగపడిందని నమ్మేవారాయన.

కత్తి పట్టిన జానపద వీరుడు అంటే ఇప్పటికీ కూడా మొదటగా గుర్తుకు వచ్చేది కాంతారావు గారే ! విఠలాచార్య, కాంతారావు గార్ల కలయిక జనపదులకు మహదానందం.

అగ్ర కథానాయకుల సరసన మరో అగ్ర నటుడిగా వెలుగొందిన ఆయన ఆస్తులు మాత్రం ఆ స్థాయిలో ఉండేవికావు. అయితేనేం ఆయన సంపాదించిన అమూల్యమైన ఆస్తి ప్రజాభిమానం. అగ్ర కథానాయకునిగా ఉన్నరోజుల్లో కూడా తోటి అగ్ర నాయకుడు ఎన్టీ రామారావు గారితో కలిసి చాలా చిత్రాల్లో నటించారు. అన్ని రకాల పాత్రలు పోషించారు. పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలతో బాటు కథానాయకుడిగానే కాక కాలానుగుణంగా అనేకరకాల వివిధ పాత్రలు ధరించారు.

తెలుగు చిత్ర సీమలో రాముడు, కృష్ణుడు పాత్రలకు రామారావు గారు ఎలాగో నారదపాత్రకు కాంతారావు గారు అలాగ ప్రాణ ప్రతిష్ట చేశారు. పాండవ వనవాసం, నర్తనశాల లాంటి చిత్రాల్లో కృష్ణునిగా రామారావు గారి ప్రక్కన నటించారు కూడా .

ఆయన నటుడే కాదు నిర్మాత కూడా ! ‘ సప్తస్వరాలు ‘ , ‘ గుండెలు తీసిన మొనగాడు ‘, ‘ స్వాతి చినుకులు ‘ లాంటి చిత్రాలు నిర్మించారు. అయితే చిత్ర నిర్మాణం ఆయనకు కలసి రాలేదు. ఆర్థికంగా కృంగదీసింది.

కాంతారావు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా కన్నుమూశారు.