సుమ (జననం: మార్చి 22, 1974) ప్రజాదరణ పొందిన తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతల్లో (యాంకర్లలో) ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నందుకు గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.
కేరళకు చెందిన ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు వ్యాఖ్యానం (యాంకరింగ్) చేస్తూ ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకోవడం విశేషం. చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తితో ఈమె రంగంలో రాణిస్తున్నారు. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలోను మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యానం (యాంకరింగు) చేసి మంచి గుర్తింపును పొందారు.
టివి కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చలనచిత్రాల పాటల ఆవిష్కరణ (ఆడియో రిలీజు) కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.