కరుణలేని “కరోనా”ను కట్టడి చేయడానికి నడుం కట్టండి !!వందల దేశాలను వణికిస్తున్న మహా రక్కసి కరోనా..వేల మందిని పొట్టన పెట్టుకున్న మహమ్మారి కరోనా..యావత్ ప్రపంచం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్న ఈ తరుణంలో..అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనావస్థకు చేరుకొని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్న ఈ సమయంలో..అకుంఠితమైన దీక్ష పూని మొత్తం మానవజాతి మహా యుద్ధానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది.కరుడుగట్టిన కరోనా భూతాన్నిభుస్తాపితం చేయటానికి మన భుజ బలంతో కాక బుద్దిబలంతో అలుపెరుగని పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదు.మానవ జాతి మహాయాత్ర లో ఎన్నో సంక్షోభాలను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నవనాగరికునిగా నిలబడ్డ చరిత్ర మనిషికి ఉంది. అయితే ఈ సారి పరిస్థితి వేరు. జాతి, మత, దేశ, భాషా భేదాలు లేకుండా ప్రపంచాన్ని పెను సంక్షోభంలో నెట్టేసిన ఈ కరోనా మహమ్మారిని తక్కువ అంచనా వేయడం సరికాదు.”ఆత్మరక్షణ” ” ఆరోగ్యక్రమశిక్షణ”అనే రెండే మన ప్రస్తుత ఆయుధాలు. శత్రువు మన కన్నా కొన్ని వేల రెట్లు శక్తివంతమైనప్పుడు ఆత్మరక్షణ అసలైన యుద్ధ వ్యూహం.కరోనా పై యుద్ధం లో ఆత్మ రక్షణే ప్రధాన ఆయుధం …ప్రధమ ఆయుధం…అదే మనల్ని రక్షించగలిగినప్రబల ఆయుధం… మనల్ని మనం రక్షించుకోవడమే ఈ శత్రువు పై మన తిరుగులేని గెలుపు అవుతుంది. మనిషి ప్రాణం అత్యంత విలువైనది. అది ఎవరికీ తెలియని కొత్త విషయం కాదు. కానీ అది మనసులో ఉంచుకొని ప్రవర్తించడం కీలకంగా గుర్తుంచుకోవ డం అతి ముఖ్యమైన విషయం.ఒక పది రోజుల పాటు మనం బయటికి వెళ్లకపోతే పెద్ద నష్టాలు జరిగి పోవు. మనం బయటికి వెళ్లి పని చేయకపోతే ఏదో పెద్ద గొప్పఉత్పాతాలు జరిగిపోతాయని అనుకోటం వివేకం కాదు. అత్యుత్సాహం,నిర్లక్ష్య భావంతో బయట తిరగటం ఫంక్షన్లు, సంబరాలు, సామూహిక పార్టీలు అని సమూహంతో కలిసి విజ్ణ తలు మరచి చేసిన పొరపాట్ల వల్లే అనేక దేశాల్లో చెప్పటానికి వీలు లేనంతకష్టం కలిగింది..ప్రాణ నష్టం జరిగింది…. జరుగుతూనే ఉంది.మనకు కరోనా లక్షణాలు ఉంటే మన సొంత వారికి ఆ వ్యాధి రాకుండా ఎంత జాగ్రత్త పడతామో బయట వారికి కూడా అది రాకుండా ఉండేందుకు మనం అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలిసి కూడా జన సమూహంలో తిరగటం ముర్ఘత్వం..రాక్షసత్వం కాక మరేమిటి? ఒక వ్యక్తి చేసే చిన్ని పొరపాటు వలన ఎన్ని ప్రాణాలు ప్రమాదంలో పడతాయో గుర్తించాలి.అలాగే ఈ విషయంలో డాక్టర్లు, పెద్దలు, ప్రభుత్వాలు చెప్పే ఆత్మ రక్షణ చర్యలు పాటిస్తూ సమూహాలకు దూరంగా ఉంటూ సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే ఉంటూ సునాయాసంగా దీన్ని ఎదుర్కోవచ్చు.మనల్ని మనం కాపాడుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అప్పుడే మన వారిని మనం కాపాడుకో గలుగుతాం. విజ్ఞతతో ఆలోచించి మనల్ని ప్రేమించే వారి గురించి తగు జాగ్రత్తలు పాటించి ఆత్మ రక్షణ చర్యలు చేపడితే ఈ వైరస్ బారిన పడకుండా ఉంటారు. అదే మానవజాతికి చేసే గొప్ప సేవ గా భావించవచ్చు.ఇక రెండో ఆయుధం”ఆరోగ్య క్రమశిక్షణ”. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం.”జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ అవసరం.అసలు జీవితమే ఉండాలంటేఆరోగ్య క్రమశిక్షణ అవసరం”.జీవించి ఉండాలంటే, ఈ వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తప్పకుండా క్రమశిక్షణ పాటించడం అవసరం.చేతులను తరుచుగా సబ్బు తో కడుక్కోవడం ,కళ్లు,నోరు,ముక్కు జాగ్రతగా చూసుకోవడం, సమూహంలో కలవక పోవడం,వంటి జాగ్రతలు అందరికి తెలిసినవే కానీ పాటించడం లేదు.ఆరోగ్య క్రమశిక్షణ లేకపోవడమే దీనికి కారణం.క్రమశిక్షణ రాహిత్యం ఈ సమస్య ఇంతగా వ్యాప్తి చెంద టానికి కారణంగా కనిపిస్తుంది.ఇప్పటికైనా ప్రతీ ఒక్కరూ దృఢ సంకల్పం చేసుకొని ఆత్మ రక్షణ,ఆరోగ్య క్రమశిక్షణ పాటిస్తూ… అప్రమత్తంగా వుంటూ వైరస్ వ్యాప్తి ని అరికట్టి రానున్న విపత్తు ను చిత్తు చేయాలని కోరుకుంటున్నాము.ప్రపంచపు పటం ఎల్లాలు చెరిపేసిన కరోనా కల్లోల కాలంలో…,కష్టాల కాలంలో.. అందరం ఒకే మాటమీద నిలిచి..ఒకే బాట మీద నడచి… మన విజ్ణతతో,విజ్ణానం తో విజేతలు గా నిలుస్తామన్న విశ్వాసం వుంది.ఈ వైరస్ ప్రభావం మొదలైన దశ నుంచి అహో రాత్రులు అలుపెరుగక సేవలందిస్తున్న డాక్టరులకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందికి, ఇతర శాఖలలో వారికి మా ధన్యవాదాలు, అభినందనలు.
Let us not join our hands…
But let us join our
hearts and thoughts…
Together to win the war against
human common rival
Corona.
—-తాళ్లూరి జయశేఖర్
అధ్యక్షులు,
(తానా) ఉత్తర అమెరికా తెలుగు సంఘం.