DailyDose

ఇండియాలో విమానాలు బంద్-వాణిజ్యం

All Domestic Flights In India Grounded-Telugu Business news Roundup Today

* కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. సరకు రవాణా విమానాలకు మినహాయింపు ఇచ్చింది. తమ విమానాలన్నీ మంగళవారం అర్ధరాత్రి 11.59గంటల్లోగా గమ్యస్థానాలకు చేరుకునేలా పౌర విమానయాన సంస్థలు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమాన సర్వీసుల్ని నిలిపివేయనున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులను వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 415కి పెరగడంతో పాటు 8 మంది మరణించిన నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

* ‘స్టాక్‌మార్కెట్లు భారీ పతనం’ ప్రపంచాన్ని కరోనా కమ్మేసిన నాటి నుంచి ఈ మాట సాధారణం అయిపోయింది. మరీ ముఖ్యంగా భారత్‌లో కరోనా వ్యాప్తి చెందుతున్న నాటి నుంచి అయితే, మార్కెట్లకు ఇదే నిత్యమంత్రం అయిపోయింది. కరోనా దెబ్బకు నేడు స్టాక్‌మార్కెట్లు మరో బ్లాక్‌ మండేను చూడాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకరోజు ట్రేడింగ్‌లో అత్యధిక పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 3,934 పాయింట్ల కోల్పోయి, 25,981కు చేరింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 1,135 పాయింట్ల పతనంతో 7,610 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఒక రోజులో అటు పర్సంటేజీల పరంగా, ఇటు అంకెల పరంగా అతి పెద్ద పతనం ఇదే.

* కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడటంతో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఆర్థిక ఉద్దీపన పథకాన్ని (బెయిలౌట్‌ ప్యాకేజ్‌) ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

* కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సైతం రంగంలోకి దిగింది. రోజుకు లక్ష ఫేస్‌మాస్క్‌లు ఉత్పత్తి చేస్తామని సోమవారం ప్రకటించింది. కొవిడ్‌-19 పేషెంట్లను తరలించే అత్యవసర వాహనాలకు ఉచితంగా ఇంధనం సరఫరా చేస్తామని తెలిసింది. లాక్‌డౌన్‌ కారణంగా వివిధ నగరాల్లోని చాలా మంది జీవనాధారం కోల్పోతారు కాబట్టి వారికి ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తామని తెలిపింది.

* ముడిచమురును అధికంగా దిగుమతి చేసుకునే దేశాలైన భారత్‌ వంటి దేశాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సౌదీ అరేబియా దిగ్గజం ఆరామ్‌కో తెలిపింది. ఇప్పటికే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 20 శాతం వరకు వాటా కొనుగోలుకు సంస్థ సంప్రదింపులు జరుపుతున్న సంగతి విదితమే. ప్రపంచంలో చమురు అధికంగా వినియోగించే దేశాల్లో ఒకటైన భారత్‌ అవసరాలు ఏటా 4-5 శాతం పెరుగుతున్నాయి కూడా. 83 శాతం చమురు అవసరాలు దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దేశానికి రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా సౌదీ అరేబియా ఉంది.

* ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి దేశంలోనూ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇక మహారాష్ట్రలో ఈ వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటికే అక్కడ 69కరోనా కేసులు నమోదుకాగా తాజాగా మరో కేసు నిర్ధారణ అయ్యింది. పుణెలోని ఇన్ఫోసిస్‌లో పనిచేసే మహిళా ఉద్యోగికి తాజాగా కొవిడ్‌-19 నిర్ధారణ అయినట్లు ఆ కంపెనీ స్వయంగా వెల్లడించింది. కొన్నిరోజుల క్రితం కరోనా నిర్ధారణ అయిన అంగన్‌వాడీ కార్యకర్తతో ఆ మహిళ సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించారు. అనంతరం ఈ యువతికి కూడా వైరస్‌ సోకినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన ఇన్ఫోసిస్‌, రాజీవ్‌గాంధీ ఇన్ఫోటెక్‌పార్క్‌లోని తమ కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేసినట్లు వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆదివారంనాడు ప్రతి ఉద్యోగికి ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేశామని పేర్కొంది. అంతేకాకుండా ఆ యువతితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ 14రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించింది. ఈ సమయంలో అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఇన్ఫోసిస్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, గతంలో కరోనా వైరస్‌ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బెంగళూరులో ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌లో శిక్షణలో ఉన్న దాదాపు 8వేల మందిని తమ ఇంటికి వెళ్లాలని సూచించింది.ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా 415 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఏడుగురు మరణించారు.