NRI-NRT

ఒక్కరోజులో 100మంది మృతి

COVId19 Kills 100 Americans In One Day

అమెరికాలో కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది. చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఆదివారం ప్రతి ముగ్గురు అమెరికన్లలో ఒకరు ఇంటికే పరిమితమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక మృతుల సంఖ్య 24 గంటల్లో 100కు పైగా పెరిగినట్లు జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. ప్రస్తుతం అక్కడ మృతుల సంఖ్య 419గా ఉంది. బాధితుల సంఖ్య 33,546కు పెరిగింది. చైనా, ఇటలీ తర్వాత ఇక్కడే అధిక సంఖ్యలో వైరస్‌ బారిన పడ్డవారు ఉన్నారు. మరోవైపు వైరస్‌ కట్టడికి అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకుంటున్న చర్యల్ని భారత సంతతికి వైద్యవర్గాలు స్వాగతించాయి. వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉందని ఆయా రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతోన్న తరుణంలో భారతీయ వైద్యులు మాత్రం ట్రంప్‌నకు మద్దతుగా నిలవడం గమనార్హం. మరోవైపు కరోనా వైరస్‌ను ‘చైనీస్‌ వైరస్‌’ అని అభివర్ణించిన ట్రంప్‌ మరోసారి డ్రాగన్‌ దేశంపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌పై చైనా తమతో సరైన సమయంలో సమాచారాన్ని పంచుకోలేదని ఆరోపించారు. తొలినాళ్లలోనే ఈ వైరస్‌కు సంబంధించిన సమగ్ర వివరాల్ని అందించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. చైనా తీరు తనని నిరాశకు గురిచేసిందని చెప్పుకొచ్చారు. కానీ, తాను మాత్రం ఎప్పటికీ నిజాయతీగానే వ్యవహరిస్తానని వ్యాఖ్యానించారు. కెంటకీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సెనెటర్‌ ర్యాండ్‌ పాల్‌(57) కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వైరస్‌ సోకిన తొలి సెనెటర్‌ ఇతనే. అయితే ‘హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌’లో గతంలో ఇద్దరికి వైరస్‌ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఇప్పటి వరకు అమెరికన్‌ కాంగ్రెస్‌లో ముగ్గురికి కరోనా సోకినట్లైంది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ర్యాండ్‌ వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఆరోగ్యం కూడా మెరుగ్గానే ఉన్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది.