Business

దినపత్రికలు ఆపేయాలని డిమాండ్ల వెల్లువ

Demands On High Rise To Stop Publishing Daily NewsPapers

ఈరోజు హైదరాబాదులో చాలా ఇళ్లల్లో పేపర్లు పడలేదు…కొన్ని అపార్ట్‌మెంట్లలోకి పేపర్ బాయ్స్‌ను రానివ్వలేదు…అసలు సగం మంది పేపర్ బాయ్స్ ఈరోజు విధుల్లోకే రాలేదు… అనేకచోట్ల పేపర్లు అలాగే మిగిలిపోయాయి…చాలాచోట్ల ఇదే పరిస్థితి… ముంబైలో అసలు నామమాత్రపు పంపిణీ జరిగింది…అక్కడే కాదు, ఇక్కడే కాదు… దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో దినపత్రికల పంపిణీ ఆగిపోతున్నది…వైరస్ వాహకాల్లో పత్రికలు కూడా..! ఒక పత్రిక ప్రింటై, పాఠకుడి చేతికి వచ్చేవరకు అనేక దశల్లో అనేకసార్లు చేతులు మారుతుంది…పైగా వైరస్ చాలా టైం పత్రిక ఉపరితలంపై బతికే ఉంటుంది… అందుకని కొన్నాళ్లపాటు దినపత్రికల్ని నిషేధించాలనే డిమాండ్లు కూడా వినవస్తున్నాయి…ఈ స్థితిలోమొదట వారం రోజులు షట్ డౌన్ చేద్దామనే చర్చ ఉత్తర భారతంలోని ప్రధాన పత్రికల మధ్య నడుస్తున్నది… ఇప్పుడది దక్షిణాదిలో కూడా మొదలైంది…ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు కానీ, తీసుకోక తప్పని గడ్డురోజులు కనిపిస్తూనే ఉన్నాయి…కానీ ఎక్కడ ఆగుతున్నదీ అంటే…వారం పది రోజులు గనుక పత్రికల పంపిణీ ఆపేస్తే… పేపర్ బాయ్స్ సగం మందికి పైగా మళ్లీ వచ్చే స్థితి లేదు… అంటే మరింతగా గాడితప్పే ప్రమాదం ఉంది…ఇప్పుడున్న సంక్షోభస్థితిలో పత్రికలు పంపిణీ కమీషన్లు పెంచే సీన్ అసలే లేదు… పైగా ఆర్ఎన్ఐ రూల్స్ కొన్ని ఉంటయ్ కదా… పత్రికల ముద్రణలో కంటిన్యుటీ అవసరం… మరెలా..?ముద్రణ గణనీయంగా తగ్గించుకుందాం… పంపిణీ జరిగేచోట్ల కొనసాగిద్దాం… అంతేతప్ప ఒకసారి ట్రాక్ తప్పితే మళ్లీ పట్టాలెక్కించడం కష్టం అనేది ఈనాడు వంటి పెద్ద పత్రికల వాదనగా తెలుస్తున్నది…నిజానికి ఇతర పత్రికలతో పోలిస్తే ఈనాడు కొంత బెటర్… హైదరాబాదు వంటి చోట్ల ఈనాడుకు సొంత పత్రిక పంపిణీ వ్యవస్థ ఉంది… రెండు రాష్ట్రాల్లోనూ కమిటెడ్ ఏజెంట్లున్నారు…కానీ ఇతర పత్రికలు హైదరాబాదులో పూర్తిగా హాకర్ల మీదే ఆధారపడి ఉన్నయ్… హాకర్లు గనుక చేతులెత్తేస్తే ఇతర పత్రికలు బజారులో కనిపించే సూచనల్లేవు… అసలే ముద్రణవ్యయం విపరీతంగా పెరిగి, పేజీలను సొంతంగానే కుదించుకునే ఈ రోజుల్లో, ఇక కరోనా దెబ్బకు పత్రిక పంపిణీ కూడా సంక్షోభంలో చిక్కుకుంటే… అది పత్రికారంగానికి పెద్ద షాక్ కాబోతున్నది..!!