* పంచాయతీ భవనాలకు వైకాపా జెండా రంగులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కోట్టి వేసింది. ఈ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. పంచాయతీ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులు వేయడాన్ని ఇటీవల హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం సరికాదని తేల్చిచెప్పింది. ప్రభుత్వభవనాలకు పార్టీల రంగులు వేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
* కరోనా వైరస్ రోజురోజుకీ దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయవాదులు నేరుగా వచ్చి వాదించాల్సిన అవసరం లేదని తెలిపింది. అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే వాదించాలని సూచించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. న్యాయవాదులకు కొన్ని ‘లింక్’లు ఇస్తామని.. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని వీడియో కాల్ కనెక్ట్ చేసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే వివరించారు. అప్పటి వరకు కోర్టు భవనంలోని లాయర్ల ఛాంబర్లన్నీ మూసివేయాలని సిబ్బందిని ఆదేశించింది.
* కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సీఎస్, డీజీపీ మీడియాతో మాట్లాడారు. కరోనా తీవ్రతను గుర్తించి ప్రపంచమంతా జరుగుతున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్నామని డీజీపీ అన్నారు.
* కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లాక్‌డౌన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్ దృష్ట్యా విజయవాడలో పోలీసులు చర్యలు చేపట్టారు. నగరవ్యాప్తంగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రధాన రహదారులను మూసివేశారు. ఆటోలు, ప్రైవేటు వాహనాలు బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులను ఆపి లాక్‌డౌన్‌కు సహకరించాలంటూ వెనక్కి పంపిస్తున్నారు. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతినిస్తున్నారు. నగరవ్యాప్తంగా నిత్యావసరాలు, ఔషధ దుకాణాలు మినహా అన్ని దూకాణాలు మూతపడ్డాయి. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.నెలాఖరు వరకు అన్ని ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విజయవాడలో నిరంతరం రద్దీగా ఉండే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులు లేక బోసిపోయింది. కొంతమంది ప్రయాణికులు బస్సులు నడుస్తాయని భావించి బస్ స్టేషన్‌కు వస్తున్నారు.
* విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు 14 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. అలాంటి వారు స్వీయ నియంత్రణ పాటించాలని.. కుటుంబసభ్యులు కూడా వాళ్లని బయటకు వెళ్లకుండా చేయాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33కి చేరిందనిని ప్రకటించారు. మరో 97 మంది అనుమానితులు ఉన్నారని.. వారి నివేదికలు రావాల్సి ఉందని ఆయన వివరించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. క్వారంటైన్‌లో ఉన్న వాళ్లను 14 రోజుల తర్వాత పరీక్షలు చేసి ఇంటికి పంపిస్తామని చెప్పారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు మాత్రం బయట తిరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని.. వారిపై కేసులు తప్పవని మంత్రి హెచ్చరించారు. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేసి వాళ్లను పట్టుకుంటామన్నారు.
* ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల దేశంలో నెలకొన్న పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లాక్‌డౌన్‌పై ఆయన ట్విటర్ ద్వారా స్పందించారు. లాక్‌డౌన్ చాలా అరుదుగా తీసుకునే చర్య అని చెప్పారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. తోటివారితోపాటు తమను తాము కాపాడుకోవడమే కాకుండా వైరస్‌ను అంతమొందించే వరకు స్వీయనియంత్రణ పాటించాల్సిందేనని ఆయన సూచించారు.
* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి పరిధి భూలావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. గతంలో నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
* కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్‌కు ప్రభుత్వం పిలుపునిచ్చిందని, ప్రజలు అర్థం చేసుకుని అందుకు సహకరించాలని సైబరాబాద్, రాచకొండ సీపీలు సజ్జనార్, మహేశ్ భగవత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటలీని చూసైనా గుణపాఠాలు నేర్వాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.
* తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నమోదవుతున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ తేలడంతో రాష్ట్రంలో ఈ కేసుల సంఖ్య 30కి చేరింది. ఇటీవల కరీంనగర్‌లో ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన జిల్లా వాసికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. లండన్ నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి, ఫ్రాన్స్ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.
* లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. ఆర్థిక బిల్లుకు ఆమోదం అనంతరం దిగువ సభను వాయిదా వేశారు. కీలకమైన ఆర్థిక బిల్లుపై ఎలాంటి చర్చా జరగకుండానే కేవలం మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరిగిన సంగతి తెలిసిందే. రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 3 వరకు జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో సమావేశాలను కుదించారు.
* కొవిడ్-19 జీవితకాల సవాల్ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సరికొత్త, సృజనాత్మక పరిష్కారాలతో ఈ మహమ్మారిని కట్టడి చేయాలని మీడియా ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. ఇప్పటికే కరోనా అంటువ్యాధితో దేశంలో ఏడుగురు మరణించారు. సోమవారం మధ్యాహ్నానికి పాజిటివ్ కేసుల సంఖ్య 415కు చేరుకుంది. మీడియా సంస్థలు పాత్రికేయులకు ప్రత్యేకమైన మైకులు ఇవ్వాలని సూచించారు. ముఖాముఖి చేసేటప్పుడు కనీసం ఒక మీటరు దూరం ఉండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
* దేశంలో క్రమంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో జైళ్ల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో రద్దీ తగ్గించేలా దోషులను స్పెషల్ పెరోల్, లేదా ఫర్‌లో కింద విడుల చేయాలని నిర్ణయించినట్లు హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది అనుజ్ అగర్వాల్, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ సుబ్రహ్మణియం ప్రసాద్‌తో కూడిన ధర్మాసనానికి ఈ నిర్ణయాన్ని తెలియజేశారు.
* ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలు నిత్యవసర సరుకులు అధికమొత్తంలో దాచుకోవద్దని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ విజ్ఞప్తి చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(కొవిడ్ 19) విజృంభిస్తున్న నేపథ్యంలో అక్తర్ తన అభిమానులకు పలు విషయాలు సూచించాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ ప్రస్తుతం అనేక ప్రాంతాలు లాక్‌డౌన్ అవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో పేదల కోసం ఆలోచించాలని కోరాడు. మతాలకతీతంగా వ్యవహరించాలని, ప్రజలు మానవీయతతో నడుచుకోవాలని చెప్పాడు. మూడు నెలల తర్వాత మీరు ఉంటారనే గ్యారెంటీ ఏంటీ? ఇతరుల గురించి కూడా ఆలోచించండి. ’ అని అక్తర్ విజ్ఞప్తి చేశాడు.